టీడీపీ నేత మీనాక్షినాయుడు మేనల్లుడికి బీజేపీ నేత నీలకంఠ సోదరుడు నాగరాజు ఫోన్
రూ.3 కోట్లు ఇస్తే ఆదోని టీడీపీకి వదిలేసి.. ఆలూరు అడుగుతామని ప్రతిపాదన
బోర్డులో లక్ష్మణ్ జీ ఉన్నారు.. మేం ఏది చెబితే అదే
పురందేశ్వరి మేడమ్‌కూ ఇవ్వాలంటూ బీజేపీ నేత ప్రతిపాదన
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఆడియో
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర శాఖలో ‘కోట్లుకు సీట్లు’ వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య ఫోను సంభాషణతో కూడా ఓ ఆడియో టేపు మంగళవారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకొచ్చింది.
పొత్తులో బీజేపీకి కేటాయించినట్టు చెబుతున్న ఆదోని నియోజకవర్గాన్ని వదిలేసి, దానికి బదులు ఆలూరు సీటు కోరతామని, అందుకు రూ.3 కోట్లు అవుతుందంటూ ఆదోని నియోజకవర్గానికి చెందని బీజేపీ నాయకుడొకరు ఆ స్థానం టికెట్ ఆశిస్తున్న టీడీపీ నాయకునికి చెందిన ఓ నాయకుడితో అనడం కమలం పార్టీలో కలకలం రేపుతోంది. ఈ ఆడియోను ఆ ఇద్దరు నాయకుల్లో ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో ఉంచినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ జరిగింది
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీజేపీ, జనసేనకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. బీజేపీ పట్టుబట్టడంతో చంద్రబాబు ఆదోని అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లు తెలిసింది. దీంతో ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద టీడీపీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కూడా తొలగించారు.
ఈ టికెట్ తనకు లేదా తన కుమారుడు భూపాల్ చౌదరికి ఇవ్వాలని మీనాక్షినాయుడు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి మీనాక్షినాయుడు మేనల్లుడు మారుతి నాయుడుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠ ఆర్థిక వ్యవహారాలు చూసే అతని సోదరుడు నాగరాజు ఫోన్ చేసి.. ‘రూ. 3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదిలేసి ఆలూరు సీటు కోరతామని, అంతా మన ఇష్ట ప్రకారమే జరుగుతుందంటూ’ ఆఫర్ ఇచ్చినట్లు ఆ ఆడియోటేపులో ఉంది. ‘మీరు రూ.3 కోట్లు ఇస్తే మాకు ఆలూరు కావాలని చెప్పేస్తాం.
మీకు హార్ట్‌ఫుల్‌గా టీడీపీ కోసం పని చేస్తాం. ఒక గంటలో మేం ఆలూరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం. మాకు అన్ని చానల్స్ ఉన్నాయి. ఈ ఒక్క రోజు చెడుపుకుంటే నష్టపోతారు. రేపు టికెట్ ప్రకటిస్తున్నారు. బోర్డులో లక్ష్మణ్ జీ ఉన్నారు. మేం ఏది చెబితే అది మాట్లాడతారు. మేం పురందేశ్వరి మేడమ్‌కు కూడా అప్పజెప్పాలి’ అని మారుతీ నాయుడుతో నాగరాజు అన్నట్లుగా చెబుతున్న ఈ ఆడియో టేపులో ఉంది. మంగళవారం ఉదయం 11గంటలకు బయటకు వచ్చిన ఈ ఆడియో టేప్ బీజేపీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది.
పార్టీకి కేటాయించిన పది అసెంబ్లీ సీట్లలోనూ...
పొత్తులో పార్టీకి కేటాయించిందే పది అసెంబ్లీ సీట్లు. వాటినీ రాష్ట్రంలో బీజేపీకి కొద్దో గొప్పో బలం ఉన్న నియోజకవర్గాలు కోరకుండా, కనీసం పార్టీకి సరైన అభ్యర్థి కూడా లేని వాటిని ఏరికోరి జాతీయ నాయకత్వానికి సూచించడం వెనుకా రాష్ట్ర నాయకత్వం ముడుపుల దందా ఉండి ఉండొచ్చని కొందరు పార్టీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఏకంగా రెండు నియోజకవర్గాలను బీజేపీ కోరడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అందులోనూ సరైన నాయకుడు కూడా లేని బద్వేలు సీటు తీసుకోవడమే ఇందుకు ఒక ఉదాహరణగా చెబుతున్నారు.
ఆ స్థానాన్ని బీజేపీ తీసుకున్నా, పార్టీ కార్యకర్తగా గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పనతల సురేష్‌కు అవకాశం ఇవ్వలేదు. బలమైన నాయకుడు లేడన్న కారణంతో ఆ నియోజకవర్గ టీడీపీ నాయకుడినే అప్పటికప్పుడు బీజేపీలో చేర్చుకొని. అతనికే బీజేపీ టికెట్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి బీజేపీలో పరిచయాలు ఉండవని, అక్కడ ఖర్చు కోసం పార్టీ ఇచ్చే సొమ్ములో భారీగా నొక్కేయాలన్న ఆలోచన కూడా మరో కారణమని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
పార్టీ కార్యకర్తకు టికెట్ ఇస్తే.. పార్టీ ఇచ్చిన సొమ్ము మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని, నొక్కేయడానికి అవకాశం ఉండదనే సురేష్‌కు రాకుండా అడ్డుకుంటున్నారని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో మరో రెండు చోట్లా రాష్ట్ర నాయకత్వం ఇదే రకమైన ముడుపుల వ్యవహారం నడిపించినట్టు రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు.
బీజేపీ వారు రూ.3 కోట్లు అడిగింది వాస్తవమే: మీనాక్షినాయుడు
ఆదోని సీటు వదులుకోవడానికి బీజేపీ నేతలు తన బంధువులతో మాట్లాడి రూ. రూ.3 కోట్లు అడిగిన మాట వాస్తవమే అని టీడీపీ నేత మీనాక్షి నాయుడు చెప్పారు. అయితే సీటు కోసం అంత డబ్బులు ఇచ్చే స్తోమత తనకు లేదన్నారు. రూ.3 కోట్లు బీజేపీకి ఇచ్చి తిరిగి ఎన్నికల్లో పార్టీ కోసం ఖర్చు పెట్టాలాంటే తమతో కాదని తెలిపారు.
రూ.3 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తామని నేను అనలేదు: నాగరాజు
మీనాక్షినాయుడు రూ.3 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తామని తాను అనలేదని, తన వాయిస్ మార్చి వైరల్ చేశారని నాగరాజు చెప్పారు. ‘టీడీపీ టికెట్ కోసం వారు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు ఇలా వాయిస్ మార్చి వైరల్ చేస్తే బీజేపీకి టికెట్ రాదని ఈ ప్రయత్నం చేశారు. బీసీ వర్గం ఎదగకూడదని, బీజేపీకి టికెట్ రాకూడదనే ఇలా చేశారు. ఇందులో నా వాయిస్ లేదు. దీనిపై పరువునష్టం దావా వేస్తా’ అని అన్నారు.
రాష్ట్ర బీజేపీలో పరిణామాలు చూసినా..
పొత్తుల ఖరారు తర్వాత రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు కూడా కమలం పార్టీలో గుడుపుఠాణీలు జరుగుతున్న అనుమానాలను బలపరుస్తున్నాయి. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చిన తర్వాత ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని దాని కోసమే అహరహం శ్రమిస్తున్న అసలు సిసలైన బీజేపీ నేతల మాటకు విలువ లేకుండా పోయింది.
ఆమెతో పాటు నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు ఆదేశానుసారం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మరికొందరు నాయకుల మాటే అధినాయకత్వం దగ్గర చెల్లుబాటయ్యేలా చూసుకుంటున్నారు. సీట్లు, టికెట్ల ప్రతిపాదనలకు కూడా వారికి నచ్చిన తీరులోనే జాతీయ పార్టీ పెద్దలకు పంపారన్న చర్చ పార్టీలో సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే.. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ సీట్లలో నరసాపురం మినహా మిగిలిన అరకు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేట, తిరుపతి స్థానాలు వలస పక్షులకే దక్కాయి. పైపెచ్చు తిరుపతి లోక్‌సభ టికెట్ పొందిన గూడూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు బీజేపీ సభ్యత్వం కూడా లేదు.
ఆయన్ని అధికారికంగా ప్రకటించే కొన్ని గంటల ముందు ఆయన బీజేపీలో చేరారు. పురందేశ్వరి ఐదారు రోజులపాటు ఢిల్లీలో వరప్రసాద్‌ను వెంటబెట్టుకుని కొందరు జాతీయ పెద్దల వద్ద లాబీయింగ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆమె ప్రతిపాదన మేరకే బీజేపీ జాతీయ నాయకత్వం వరప్రసాద్‌కు బీజేపీలో చేరక మునుపే తిరుపతి లోక్‌సభ సీటు కేటాయించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ముడుపులు బాగానే పనిచేసి ఉంటాయని బీజేపీ అసలు నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ టికెట్ కావాలంటే భూములు తాకట్టు పెట్టాల్సిందే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా టీడీపీలో మరో విషయం వెలుగు చూసింది. పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు తాకట్టు పెట్టి బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అభ్యర్థులతోపాటు ఆ పార్టీ కీలక నేతలు కూడా నిర్ధారిస్తున్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు పోటీ చేస్తున్నారు. అంతకుముందు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాగరాజును పిలిపించారు.
‘ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టుకోగలవు?’ అని లోకేశ్ ప్రశ్నిస్తే రూ.20 కోట్ల వరకూ ఖర్చు పెడతానని నాగరాజు చెప్పినట్లు తెలిసింది. ఇది సరిపోదని, కనీసం రూ.35 కోట్లు డిపాజిట్ చేయాలని లోకేశ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ‘నగదు లేదని, భూములపై పెట్టుబడి పెట్టాను’అని నాగరాజు చెప్పారు. అందుకు లోకేశ్ కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి పేరు చెప్పి అతని వద్ద భూములు తాకట్టు పెడితే తక్కిన డబ్బులు ఇస్తారని చెప్పినట్లు సమాచారం. దీంతో తప్పని పరిస్థితుల్లో నాగరాజు భూములు తాకట్టుపెట్టి డబ్బు మకూర్చుకున్నట్లు చర్చ నడుస్తోంది.
ఈ విషయాన్ని చందాల కోసం వెళ్లినప్పుడు నాగరాజు కూడా పలువురితో చర్చించినట్లు తెలిసింది. ఇలాగే కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి కూడా డబ్బుల కోసం లోకేశ్ చెప్పిన వ్యక్తుల వద్దే తాకట్టు పెట్టినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. డబ్బు లోకేశ్ పంపుతున్నారని, భూములను పార్టీలోని ముఖ్యుల వద్ద తాకట్టు పెట్టించుకున్నారని టీడీపీలోని ఓ కీలక వ్యక్తి ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment