స్తంభించిన పాలన! | Governance stalemate due to state bifurcation | Sakshi
Sakshi News home page

స్తంభించిన పాలన!

Published Wed, May 28 2014 1:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Governance stalemate due to state bifurcation

 సాక్షి, కర్నూలు: విభజన ప్రక్రియతో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో స్తబ్దత ఏర్పడింది. జిల్లా అధికారుల బదిలీలు.. నిధులకు కళ్లెం.. ఫైళ్ల కదలికకు ముకుతాడు వేయడంతో పాలనా అంతా స్తంభించిపోయింది. శనివారం నాటి నుంచే నిధుల మంజూరు, విడుదలకు సంబంధించిన వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. మరోవైపు అధికారుల బదిలీలపై సీరియస్‌గా దృష్టి సారించారు. జిల్లా స్థాయి అధికారులతోపాటు గ్రూప్-1లో ఎంపికైన అధికారుల బదిలీ కూడా జరగడానికి వీలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

 తాగునీరు, రోడ్లు, విద్యుత్తు విభాగం, వ్యవసాయశాఖకు సంబంధించిన అంశాలు..
అకాల వర్షంతో ఏర్పడిన నష్టంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే విభజన ప్రభావాన్ని చూపించింది. పూర్తిస్థాయిలో పాలనా వ్యవస్థ స్తంభించడంతో అధికారులకు ఎటూ పాలుపోవడం లేదు. ఉద్యోగుల్లోనూ ఉత్సాహం లేదు. ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా గడిపిన ఉన్నతాధికారులు కొందరు ఆ బరువు దిగడం.. పైగా పిల్లలకు వేసవి సెలవులు కావడంతో సెలవు పెట్టి సొంత ఊళ్లకు, కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లారు. జిల్లాలోనే ఉన్న ఉన్నతాధికారులు కూడా కొత్త ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏవిధంగా మారతాయోనని వేచిచూస్తున్నారు. కీలక నిర్ణయాలేమీ తీసుకోవడం లేదు.

ఎవర్ని కదిలించినా రాష్ట్ర విభజన, కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించే చర్చిస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలూ అధికారికంగా ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ముందే ఇచ్చేశారు. జూన్ ఒకటో తేదీ వరకు లెక్కగట్టి ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇచ్చేశారు. మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి కనిపించనుంది.

 బదిలీల గుబులు..! : జిల్లా ఉన్నతాధికారుల్లో ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. కొందరు అధికారులు ఈ జిల్లా నుంచి వెళ్లిపోవాలనికోరుకుంటుండగా, మరికొందరు ఇక్కడే కొనసాగాలన్న ఉద్దేశంతో ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్ అధికారులను ఆప్షన్లు అడిగారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కన్నబాబు.. ఎటు వెళ్లడానికి మొగ్గు చూపారన్న విషయం బయటకు రాలేదు. వారి ‘ఆప్షన్’ ఏదైనా.. కొత్త ప్రభుత్వం వచ్చాక మార్పులు ఖాయమన్న భావన అధికారుల్లో కనిపిస్తోంది. జిల్లా స్థాయి అధికారులూ ప్రస్తుతం బదిలీలపై దృష్టి పెట్టారు. ఇదే జిల్లాలో కొనసాగాలని కోరుకుంటున్న అధికారులు.. టీడీపీ ప్రజాప్రతినిధుల్లో తమకు బాగా తెలిసిన వారితో లాబీయింగ్‌కు ప్రయత్నిస్తున్నారు.

 గతంలో వేరే జిల్లాల్లో పనిచేసి సమర్థులైన అధికారులుగా పేరు తెచ్చుకున్న వారిని తమ జిల్లాలకు పిలిపించుకునేందుకు ఇక్కడ కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పక్షానికి వీర విధేయులుగా ఉండి, టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టిన అధికారులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. పోలీసు, ఎక్సైజ్ వంటి విభాగాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. కొత్త ప్రభుత్వం వస్తే తాము అప్రాధాన్య పోస్టుల్లోకి వెళ్లక తప్పదని భావిస్తున్నవారు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement