‘యమున’ను మరిచారు..!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణజైట్లీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యమునా నదిని శుద్ధి చేయడానికి నిధులు కేటాయించకపోవడంపై స్థానిక పర్యావరణవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గం గానది కోసం బడ్జెట్‌లో సుమారు రూ.2 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం యమునా నదిని మాత్రం మరచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యమునా నదిని శుద్ధి చేయడానికి రూ. 1,000 కోట్లు కేటాయించాలని గతంలో కేంద్రాన్ని ఢిల్లీ సర్కారు కోరింది. కానీ బడ్జెట్‌లో నదీతీరాన్ని అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు కేటాయించిన కేంద్రం నదీ జలాల శుద్ధి గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడంపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి యమునా నదికి కూడా మంచి రోజులు వస్తాయన్న అభిప్రాయం స్థానికుల్లో కలిగింది. నరేంద్ర మోడీ సలహా మేరకు యమునా నదీ తీరాన్ని కూడా గుజరాత్‌లోని సబర్మతీ నది తరహాలో అభివృద్ధి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వాధికారుల ఉన్నత స్థాయి బందం ఒకటి ఇటీవల అహ్మదాబాద్ ఇటీవల వెళ్లి అధ్యయనం కూడా చేసి వచ్చింది. అంతేకాక యమునా నదిని శుద్ధి చేయడానికి కూడా ఓ ప్రాజెక్టును రూపొందించారు. కానీ బడ్జెట్‌లో యమునాన దీ తీరాన్ని అభివృద్ధి చేయడానికి మాత్ర మే నిధులు కేటాయించి, నదీజలాల శుద్ధిని వదిలేశారు. దీంతో ఇప్పటివరకు ఢిల్లీ ప్రభుత్వం యమునానది శుద్ధీకరణకు చేపట్టిన కార్యక్రమాలన్నీ అటకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘నదీతీరాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే దాని అర్థం నదిని శుద్ధి చేయడం కాదు కదా.. ’యమునా జియే అభియాన్‌కు చెందిన పర్యావరణవేత్త మనోజ్‌మిశ్రా అన్నారు. యమునా నది ప్రస్తుతం మురికి కాలు వ మాదిరిగా ఉంది. జలచరాలు, బ్యాక్టీరియా కూడా ఈ నీటిలో బతకలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నదిలో ప్రతిరోజూ 5 మిలియన్ గ్యాలన్ల పారిశ్రామిక కాలుష్యాలు, 1,25,000 గ్యాలన్ల డీడీటీ నీరు కలుస్తోందని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, గత పాతికేళ్లలో కేంద్ర ప్రభుత్వాలు దేశంలోని నదులను శుద్ధి చేయడానికి సుమారు రూ. 2,000 కోట్లకు పైగా ఖర్చుపెట్టా యి.
అయినప్పటికీ గంగా, యమునా నదీజలాలు ఏమాత్రం శుభ్రపడిన దాఖలాలు కనిపించడంలేదు. ఈ నదులను శుద్ధి చేసేదాని కంటే కొన్ని రెట్లు ఎక్కువగా మలినాలు ప్రతిరోజూ వాటిలో చేరుతుండటంతో ఆయా ప్రభుత్వాల చర్యలు ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. ఈ రెండు నదులను శుభ్రంగా ఉంచడానికిసీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పారిశుధ్య సదుపాయాలను ఏర్పాటుచేసినప్పటికీ మొత్తం మీద పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు.
ఢిల్లీ చేరేవరకు పరిశుభ్రంగా ఉండే యమునా జలాలు ఢిల్లీలోనే కాలుష్య కాసారంగా మారుతున్నాయి. ఢిల్లీలో యమున 48 కిమీల పొడవునా ప్రవహిస్తుంది. ప్రతిరోజూ నదిలో పారిశ్రామిక కాలుష్యా లు, విషపదార్థాలతో పాటు 225 మిలియన్ గ్యాలన్ల శుద్ధి చేయని సీవేజ్ కలుస్తుంది. ఆ తర్వాత ఫరీదాబాద్, బల్లభ్‌ఘడ్, పల్వల్, మధురలోని పరిశ్రమ లు యమునా నదీజలాలను మరింత కాలుష్యమ యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో యమునానది జలాలను శుద్ధి చేసేందుకు తగినన్ని నిధులను కేంద్రం కేటాయించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.