బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష
సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని విమర్శించారు. కేంద్రం బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ఈ బడ్టెట్‌లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు.
కేంద్రం ఆదుకుంటుందేమోన్న ఆశలు నీరుగారిపోయాయన్నారు. గ్రామీణాభివృద్ధి , వ్యవసాయ, ఉపాధి హామీ పథకాలకు నిధుల కేటాయింపును కేంద్రం విస్మరించిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులపై భారాన్ని తగ్గింగచలేదన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.