సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదింపజేసుకుందని, జిల్లా ఏజెన్సీ ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసిన ఈ బిల్లుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు శుక్రవారం లోక్‌సభలో ఆమోదం పొందిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టడంపై తీవ్రంగా వ్యతిరేకించిచామన్నారు. ఒంటెద్దు పోకడలతో కేంద్రం అనుసరించిన తీరు ఆదివాసీలకు ఆశనిపాతమైందన్నారు.
ఈ బిల్లును తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీలు వ్యతిరేకించినా కేంద్రం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. బిల్లుపై స్పీకర్ కూడా న్యాయస్థానానికి వెళ్లండన్న రీతిలో మాట్లాడడం శోచనీయమన్నారు. ఆదివాసీలకు మద్దతుగా ఈ బిల్లును తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా ఈ అభిప్రాయాలను కేంద్రం పట్టించుకోకపోవడంపై దారుణమని ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్‌కు నిరసనగా వేలరుపాడు, కుక్కునూరు మండలాల్లో పరిషత్ ఎన్నికలను బహిష్కరించి నామినేషన్లు వేయకపోయినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు.
భద్రాచలం మండలం సీతారామపట్నంలోని రామాలయ భూములు కూడా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్తాయని.. ఇదంతా టీడీపీ నేత చంద్రబాబునాయుడు నిర్వాకంతోనే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివాసీ, గిరిజన సంస్కృతి.. సంప్రదాయాలు, వందళ ఏళ్ల నాటి వారి చరిత్రకు ఈ ఆర్డినెన్స్‌తో మనుగడ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ధోరణితో అరుదైన ఆదివాసీ జాతులు చెల్లా చెదురయ్యే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని ఏజెన్సీలో ఆర్డినెన్స్ పెట్టిన చిచ్చుతో ఆదివాసీలు పోరాటం చేస్తున్నారని ఈ పోరాటానికి కడవరకు తాను అండగా ఉంటానని పొంగులేటి స్పష్టం చేశారు. బిల్లు ఆమోదానికి నిరసనగా శనివారం జరిగే బంద్‌లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆర్డినెన్స్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
Published Sat, Jul 12 2014 2:46 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement