ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్(Teamindia) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) అద్భుతమైన నాక్ ఆడాడు. 133 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఊచకోత కోశాడు. అతడిని ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల తరం కాలేదు.
ఈ క్రమంలో అభిషేక్ కేవలం 20 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 34 బంతుల్లు ఎదుర్కొన్న ఈ పంజాబీ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..
👉భారత గడ్డపై టీ20 మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్ (70+ పరుగులు) ఆడిన ప్లేయర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఇంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. 2022లో గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మిల్లర్ 225.53 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 106 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 232.35 స్ట్రైక్ రేట్‌తో 79 పరుగులు చేసిన అభిషేక్.. మిల్లర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.
👉రన్-ఛేజ్ సమయంలో టీ20 మ్యాచ్‌లో అత్యంత వేగంగా(70+ రన్స్) పరుగులు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కూడా యువరాజ్ పేరిట ఉండేది. 2013లో ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ 35 బంతుల్లో 77 పరుగులు (220.00 స్ట్రైక్ రేట్) చేయగా.. తాజా మ్యాచ్‌లో అభిషేక్ 34 బంతుల్లో 79 (232.35 స్ట్రైక్ రేట్) పరుగులు చేశాడు. దీంతో యువీ ఆల్‌టైమ్ రికార్డు బద్దులు అయింది.
👉ఇంగ్లండ్ జట్టుపై టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత్ బ్యాటర్ గా అభిషేక్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువీ 7 సిక్సర్ల బాదాడు. తాజా మ్యాచ్‌తో తన మెంటార్ యువరాజ్ ఆల్‌టైమ్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. కాగా యువీ గైడెన్స్‌లోనే అభిషేక్ మరింత రాటుదేలాడు.
👉టీ20ల్లో ఇంగ్లండ్‌పై భారత తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. 2018లో మాంచెస్టర్‌లో జరిగిన టీ20లో ఇంగ్లండ్‌పై రాహుల్ 27 బంతుల్లోనే అర్ధ శతకం సాధించగా.. తాజా మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో యువరాజ్ సింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో మెరిశాడు.
ఊది పడేసిన భారత్..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్(26), తిలక్ వర్మ(19 నాటౌట్) దూకుడుగా ఆడారు.
చదవండి: ENG vs IND: ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్ చిత్తు
Comments
Please login to add a commentAdd a comment