ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్‌ చిత్తు | India win over England in first T20 | Sakshi
Sakshi News home page

ENG vs IND: ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్‌ చిత్తు

Published Thu, Jan 23 2025 4:11 AM | Last Updated on Thu, Jan 23 2025 8:31 AM

India win over England in first T20

తొలి టి20లో భారత్‌ ఘన విజయం

7 వికెట్లతో ఇంగ్లండ్‌ చిత్తు

చెలరేగిన అభిషేక్‌ శర్మ

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ చక్రవర్తి

రాణించిన అర్ష్‌దీప్, అక్షర్, పాండ్యా

శనివారం చెన్నైలో రెండో టి20  

టి20 వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌ మరోసారి తమ స్థాయికి తగ్గ ఆటతో అదరగొట్టింది. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. కట్టుదిట్టమైన పేస్, స్పిన్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... ఆపై దూకుడైన బ్యాటింగ్‌తో మరో 43 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

భారీ బ్యాటింగ్‌ బలగం ఉన్న ఇంగ్లండ్‌ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అర్ష్ దీప్ , వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌తో పాటు అభిషేక్‌ శర్మ మెరుపు ప్రదర్శన భారత జట్టును ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిపాయి. రెండో టి20 మ్యాచ్‌ శనివారం చెన్నైలో జరుగుతుంది.   

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో మొదలైన టి20 సిరీస్‌లో భారత్‌ 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన తొలి పోరులో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. 

వరుణ్‌ చక్రవర్తికి 3 వికెట్లు దక్కగా...అర్ష్ దీప్ , అక్షర్‌ పటేల్, హార్దిక్‌ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 12.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు సాధించి గెలిచింది. అభిషేక్‌ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు.  

భారత బౌలర్ల జోరు... 
లెఫ్టార్మ్‌ పేసర్‌ అర్ష్ దీప్ ‌ పదునైన బంతులతో ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. తొలి ఓవర్లో ఫిల్‌ సాల్ట్‌ (0)ను అవుట్‌ చేసిన అతను, తన రెండో ఓవర్లో డకెట్‌ (4)ను వెనక్కి పంపించాడు. బట్లర్, బ్రూక్‌ (17) కలిసి కొద్దిసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పాండ్యా ఓవర్లో నాలుగు ఫోర్లతో బట్లర్‌ దూకుడు ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌కు ఇంగ్లండ్‌ కుదేలైంది. 

ఒకే ఓవర్లో అతను బ్రూక్, లివింగ్‌స్టోన్‌ (0)లను డగౌట్‌కు పంపించాడు. అనంతరం ఒక ఎండ్‌లో ఇంగ్లండ్‌ వరుసగా వికెట్లు కోల్పోగా... బట్లర్‌ ఒక్కడే పోరాడగలిగాడు. 34 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆపై పాండ్యా, అక్షర్‌ మెరుగైన బౌలింగ్‌కు తోడు చక్కటి ఫీల్డింగ్‌ కారణంగా ఇంగ్లండ్‌ 26 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. 
 
మెరుపు బ్యాటింగ్‌... 
అట్కిన్సన్‌ వేసిన రెండో ఓవర్లో సంజు సామ్సన్‌ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 4, 4, 0, 6, 4, 4 బాదిన అతను 22 పరుగులు రాబట్టాడు. అయితే ఒకే ఓవర్లో సామ్సన్, సూర్యకుమార్‌ (0)లను అవుట్‌ చేసి ఆర్చర్‌ దెబ్బ తీశాడు. వుడ్‌ ఓవర్లో అభి షేక్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టడంతో పవర్‌ప్లేలో భారత్‌ 63 పరుగులు చేసింది. 

ఆ తర్వాత 29 పరుగుల వద్ద ఆదిల్‌ రషీద్‌ రిటర్న్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్‌ తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ఆపై మరో సిక్స్‌తో 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా దూకుడుగా ఆడిన అభిషేక్‌ భారత విజయానికి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు. 

షమీకు నో చాన్స్‌!
ఫిట్‌నెస్‌ నిరూపించుకొని దాదాపు 14 నెలల విరామం తర్వాత భారత జట్టులోకి వచి్చన సీనియర్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీకి ఇంకా మ్యాచ్‌ ఆడే అవకాశం మాత్రం రాలేదు. 

ఇంగ్లండ్‌తో తొలి టి20 కోసం ప్రకటించిన టీమ్‌లో అనూహ్యంగా అతనికి చోటు దక్కలేదు. దీనికి మేనేజ్‌మెంట్‌ ఎలాంటి కారణం చెప్పలేదు. జట్టు కూర్పులో భాగంగా అతడిని పక్కన పెట్టారా లేక పూర్తిగా కోలుకోలేదా అనే విషయంపై స్పష్టత లేదు.

97 అంతర్జాతీయ టి20ల్లో అర్ష్ దీప్ ‌ సింగ్‌ వికెట్ల సంఖ్య. భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యుజువేంద్ర చహల్‌ (96)ను అర్ష్ దీప్ ‌ అధిగమించాడు.  

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) సామ్సన్‌ (బి) అర్ష్ దీప్ ‌ 0; డకెట్‌ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ ‌ 4; బట్లర్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) వరుణ్‌ 68; బ్రూక్‌ (బి) వరుణ్‌ 17; లివింగ్‌స్టోన్‌ (బి) వరుణ్‌ 0; బెతెల్‌ (సి) అభిషేక్‌ (బి) పాండ్యా 7; ఒవర్టన్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) అక్షర్‌ 2; అట్కిన్‌సన్‌ (స్టంప్డ్‌) సామన్‌ (బి) అక్షర్‌ 2; ఆర్చర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) పాండ్యా 12; రషీద్‌ (నాటౌట్‌) 8; వుడ్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 132. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–65, 4–65, 5–83, 6–95, 7–103, 8–109, 9–130, 10–132. బౌలింగ్‌: అర్ష్ దీప్ ‌ సింగ్‌ 4–0–17–2, హార్దిక్‌ పాండ్యా 4–0–42–2, వరుణ్‌ చక్రవర్తి 4–0–23–3, అక్షర్‌ పటేల్‌ 4–1–22–2, రవి బిష్ణోయ్‌ 4–0–22–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) అట్కిన్సన్‌ (బి) ఆర్చర్‌ 26; అభిషేక్‌ శర్మ (సి) బ్రూక్‌ (బి) రషీద్‌ 79; సూర్యకుమార్‌ (సి) సాల్ట్‌ (బి) ఆర్చర్‌ 0; తిలక్‌వర్మ (నాటౌట్‌) 19; పాండ్యా (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.5 ఓవర్లలో 3 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–125. బౌలింగ్‌: జోఫ్రా ఆర్చర్‌ 4–0–21–2, అట్కిన్సన్‌ 2–0–38–0, మార్క్‌ వుడ్‌ 2.5–0–25–0, రషీద్‌ 2–0–27–1, ఒవర్టన్‌ 1–0–10–0, లివింగ్‌స్టోన్‌ 1–0–7–0. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement