
సియాటెల్: అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత ఆర్భాటంగా ట్రంప్ ఇచ్చిన ‘జన్మతః పౌరసత్వం రద్దు’ కార్యనిర్వాహక ఉత్తర్వు అమల్లోకి రాకమునుపే అమెరికా కోర్టులో అవరోధాన్ని ఎదుర్కొంది. ఉత్తర్వు అమల్లోకి రాకుండా ఆపాలంటూ 4 రాష్ట్రాలు చేసిన అభ్యర్థనను అమెరికా డిస్ట్రిక్ జడ్జి జాన్ సి. కఫెనర్ నిలిపివేశారు.
ఈ సందర్బంగా.. ‘ట్రంప్ ఉత్తర్వులు అమల్లోకిరాకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలిస్తున్నా. ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం’ అని కేసు విచారణ సందర్భంగా జడ్జి కఫెన్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయీస్, ఒరేగాన్ రాష్ట్రాలు సంయుక్తంగా వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన జడ్జి ఆ తర్వాత ఈ ఉత్తర్వులిచ్చారు. ఉత్తర్వును వ్యతిరేకిస్తూ విపక్షపార్టీ పాలిత 22 రాష్ట్రాలు విడిగా వేసిన ఐదు పిటిషన్లలో ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి వేసిన సియాటెల్ కోర్టులో వేసిన ఈ పిటిషన్ కూడా ఉంది. మరోవైపు.. ఈ కేసులో ప్రాథమిక విజయం సాధించాం అని వాషింగ్టన్ అటార్నీ జనరల్ నికొలస్ బ్రౌన్ వ్యాఖ్యానించారు.
అనంతరం, దీనిపై ట్రంప్ స్పందించారు. తాము అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేశారు. గురువారం ఓవల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయమూర్తి ఉత్తర్వులపై మా కార్యవర్గం అప్పీల్ చేస్తుందని తెలిపారు. ఇక, అంతకుముందు.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు
ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావం చూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం’’అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ‘‘ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే’’అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment