ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాను తీహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని చెప్పుకొచ్చారు. అయితే, తాను బీజేపీ ఆఫర్‌ను నిరాకరించినందుకే ఎక్కువ సమయంలో జైలు ఉన్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపాయి.
తాజాగా ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ఆప్‌పై బీజేపీ చేసిన కుట్రలు ఎవరికీ తెలియవు. ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ వారి విధానం. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకుంటారు.. వాళ్ల మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. ప్రజా సంక్షేమం, స్కూల్స్, ఆసుపత్రులు, ప్రజల అవసరాలతో కాషాయ పార్టీ నేతలకు అవసరం లేదు. కేవలం అధికారం కోసమే బీజేపీ ఆరాటపడుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో నన్ను అన్యాయంగా జైలులో పెట్టారు.
నేను జైలులో ఉన్న సమయంలో బీజేపీ నాకు సీఎం పదవిని ఆఫర్ చేసింది. బీజేపీలో చేరాలని.. అలా అంగీకరిస్తే , ఆప్ ఎమ్మెల్యేలను విడగొట్టి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ నిరాకరిస్తే ఎక్కువ కాలం కటకటాల వెనుక ఉంచుతామని బీజేపీ చెందిన ఒంక నేత బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. బీజేపీ ఆఫర్ నిరాకరించిన కారణంగానే ఎక్కువ రోజులు జైలులో ఉన్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశరాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు జైలుకు వెళ్లారు. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా 2023లో అరెస్ట్ అయ్యారు. దాదాపు 17 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంలో జైలు నుంచి విడుదలయ్యారు. ఇక, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాంగ్‌పురా నుంచి సిసోడియా పోటీ చేస్తున్నారు.
మరోవైపు.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో కొద్దిరోజులే సమయంలో ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. ఎనిమిదో తేదీన తుది ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment