జీఎస్టీ రేట్లపై కుదరని ఏకాభిప్రాయం
నవంబర్ 3, 4 తేదీల్లో తుది నిర్ణయం
రాష్ట్రాలకు పరిహార నిధిపై తేలాకే: జైట్లీ
ఎటూ తేలని సెస్ విధింపు ప్రతిపాదన
ఉమ్మడి నియంత్రణ అంశాలపైనా విభేదాలు
న్యూఢిల్లీ : రెండ్రోజుల పాటు సాగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్ భేటీలో పన్నురేట్లపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని అంశాలపై స్పష్టత వచ్చినా... తుది నిర్ణయానికి రావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. విలాస వస్తువులు, పొగాకు వంటి ఉత్పత్తులపై సెస్సు విధింపు అంశంలో కొంత ఏకాభిప్రాయం వచ్చినా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నియంత్రణలోని 11 లక్షల సేవా పన్ను అంచనాలపై కూడా ఏకాభిప్రాయం రాలేదు. 6, 12, 18, 26 శాతం శ్లాబ్‌ల విభజన, నిత్యావసరాలపై తక్కువ, విలాస వస్తువులు, పొగాకు వంటి వస్తులపై ఎక్కువ పన్ను విధింపుపై రాష్ట్రాలు చాలావరకూ అనుకూలంగానే ఉన్నా... నవంబర్ 3, 4 తేదీల్లో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రామాణిక రేట్లుగా 12, 18 శాతం: జైట్లీ
వచ్చే నెల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై పన్ను రేట్లపై నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ‘శ్లాబ్ తక్కువ ఉండాలన్న చర్చ మంచిదే. అయితే పన్ను ఆదాయం కోల్పోవడం, అలాగే తక్కువ పన్ను రేటు కోసం ఎక్కువ రేటు పెట్టడం సరికాదు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహార నిధికి అవసరమైన మొత్తంపై ఏకాభిప్రాయం కోసం కౌన్సిల్ చర్చించింది. రాష్ట్రాలకు పరిహార మొత్తం ఎక్కడి నుంచి ఇవ్వాలన్నది నిర్ణయించాక పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటాం’ అని జైట్లీ విలేకరుల సమావే శంలో వెల్లడించారు. ‘పన్ను నుంచే పరిహారం ఉండాలా లేక ప్రత్యేక సెస్సు రూపంలో వసూలు చేయాల లేదా ఇతర వనరుల నుంచా అన్నది నిర్ణయమవ్వాలి. ప్రామాణిక రేట్లుగా 12, 18 శాతం ఉండాలని ప్రధానంగా చర్చించారు. జీఎస్టీ రేట్లు నిర్ణయమైతే... నవంబర్ 9, 10 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ మళ్లీ సమావేశమైన చట్టసభల డ్రాఫ్ట్‌లను ఖరారు చేస్తుంది’ అని చెప్పారు.
ఏ శ్లాబులో పెట్టాలో అధికారులు నిర్ణయిస్తారు
మూడు రోజుల పాటు జరగాల్సిన కౌన్సిల్ భేటీ ఒక రోజు ముందుగానే బుధవారం ముగిసింది. పన్ను శ్లాబులపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని, అనంతరం ఏ వస్తువు ఏ శ్లాబులో పెట్టాలనేది అధికారులు నిర్ణయిస్తారని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. నవంబర్ 22 లోపు చర్చలు ముగుస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని, మంచి పురోగతితో సాగుతున్నామన్నారు. సెస్ విధించకుండా, పొగాకు వంటి ఉత్పత్తులపై పన్ను పెంచితే... అప్పడు శ్లాబ్‌లు పెరిగిపోతాయని అధియా పేర్కొన్నారు.