సాక్షి, న్యూఢిల్లీ : తాను దేశం విడిచేముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుసుకున్నానని, బ్యాంకు రుణాలు తీర్చే విషయంలో ఓ ఒప్పందానికి వద్దామని కూడా ప్రతిపాదన తీసుకొచ్చానని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా బుధవారం ప్రకటించడం రాజకీయ ప్రకంపనలు సష్టిస్తోంది. ఆయన పారిపోవడానికి బాధ్యత వహిస్తూ అరుణ్ జైట్లీని రాజీనామా చేయాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దేశీయ బ్యాంకులకు దాదాపు 9.000 కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న విషయం తెల్సిందే. భారతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను విజయ మాల్యా కేసు సూచిస్తోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అలసత్వం వల్లనే విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన సమీప బంధువు మెహుల్ చోక్సీలు పారిపోయారన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టం అవుతోంది. మనీ లాండరింగ్ కేసులో దేశం దాటి ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీకి ‘మానవతా దక్సథం’తోనే ట్రావెల్ డాక్యుమెంట్లు ఇచ్చానని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా ఒప్పుకోవడం తెల్సిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న ఓ అధికారి చలువ వల్లనే విజయ్ మాల్యా పారిపోయారని, ప్రముఖ ఆయుధాల డీలరు సంజయ్ భండారీ పలు దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి పారిపోయారంటే ప్రభుత్వం చలువ వల్లనేనంటూ వస్తున్న వార్తలపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడాన్ని ఏమనాలి? అధికార రహస్యాల చట్టం కింద 2016, అక్టోబర్ 16వ తేదీన ఢిల్లీ పోలీసులు కేసు దాఖలు చేసినా,
ఆయన పాస్‌పోర్టును ఆదాయం పన్ను శాఖ స్వాధీనం చేసుకున్నా సంజయ్ భండారి దేశం విడిచి లండన్ పారిపోయారంటే అందుకు ఎవరు బాధ్యులు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే నిరర్థక ఆస్తులు వసూలవుతాయని, కచ్చితంగా ఒకరిద్దరు పెద్ద చేపలను కటాకటాలకు పంపించడం అవసరమంటూ 2015లో ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ ర ఘురామ్ రాజన్ సూచించినప్పటికీ ప్రధాని కార్యాలయం నుంచి కూడా స్పందన లేదంటే ఏమనుకోవాలి? ఇలా ప్రధాని కార్యాలయానికి సూచించిన విషయాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీకి తాజాగా రాసిన 17 పేజీల లేఖలో రాజన్ స్పష్టంగా పేర్కొన్నారు.
తన హయంలో నిరర్థక ఆస్తుల వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాల్సిందిగా మురళీ మనోహర్ జోషి జారీ చేసిన నోటీసుకు సమాధానంగా ఆయన ఈ సుదీర్ఘ లేఖను రాశారు. ఆయన ఏయే సంవత్సరంలో బడా బాబులకు బ్యాంకులు ఎంతెంత సొమ్మును రుణాలుగా ఇచ్చారో కూడా పేర్కొన్నారు. అందులో 2007–2008 సంవత్సరంలో పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేసినట్లు తేలడంతో అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటూ నిరర్థక ఆస్తులకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దంటూ బీజేపీ సభ్యులు గోల చేస్తున్నారు. మరి 2015లో పీఎంవోకు రఘురామ్ రాజన్ లేఖ రాసినప్పటికీ కేంద్రం ఎందుకు స్పందించ లేదంటూ పార్లమెంటరీ కమిటీలోని కాంగ్రెస్ సభ్యులు నిలదీయడంతో కమిటీ ముందుకు ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నపేంద్ర ముశ్రా, పీఎం ఆర్థిక కార్యదర్శి హాష్ముక్ అధియాను పిలిపించి విచారించాలని నిర్ణయించింది.
రుణ బకాయిల వసూళ్లకు ఉద్దేశించిన ‘రికవరీ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూట్స్ యాక్ట్–1993, సెక్యూరిటైజేషన్ అండ్ రికన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటి ఇంటరెస్ట్ యాక్ట్–2002’ చట్టాల్లోని లొసుగును బడా బాబులు ఉపయోగించుకుంటున్నారని తెలిసి, వాటిని సవరించాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ‘ఇన్‌సాల్వేన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ కోడ్’ను తీసుకొచ్చిందని రాజన్ తన లేఖలో పేర్కొన్నారు. వేల కోట్ల రుణాలకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతున్న బడాబాబులను పట్టుకోవడానికి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలిగానీ చట్టాలను సవరించినంత మాత్రాన సరిపోదు.
Comments
Please login to add a commentAdd a comment