న్యూఢిల్లీ : వేల కోట్ల రూపాయల ఎగవేతదారు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తాను భారత్ నుంచి వెళ్లడానికంటే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపూ ప్రతిపక్షాలన్ని ఈ విషయం గురించి తీవ్రంగా విమర్శిస్తుండగా మరోవైపూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన పజిల్ హల్‌చల్ చేస్తోంది. పాపులర్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో గురించి తెలియని భారతీయుడు ఉండడు. ఇప్పటికే పలు భారతీయ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ కార్యక్రమంలో ఈసారి ఎదురయ్యే ప్రశ్న అంటూ ఓ వెరైటీ ప్రశ్నను, దానికి సంబంధించిన ఆప్షన్స్‌ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది.
ఆ ప్రశ్న దేనికి సంబంధించిందో ఈ పాటికే అర్థమయ్యి ఉంటుంది కదా.. అవును విజయ్ మాల్యా, అరుణ్ జైట్లీల గురించి. ఇంతకు ప్రశ్న ఏంటంటే ‘విజయ్ మాల్యా భారత్ నుంచి తప్పించుకోవడానికి ఎవరూ సాయం చేశారు’ అనేది ప్రశ్న.. దానికి సమాధానాలుగా అరుణ్, జైట్లీ, అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖ మంత్రి అనేవి ఆప్షన్స్‌గా ఇచ్చారు. అంతేకాక ‘ఇది చాలా కఠినమైన ప్రశ్న.. దీని విలువ 9000 కోట్ల రూపాయలు.. అందుకే మేము ఆడియన్స్ పోల్‌కి వెళ్తున్నాం’.. అంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ఇలా షేర్ చేసిన కొన్ని గంటల్లోనే దీన్ని వేల మంది వీక్షించడమే కాక రకారకాల కామెంట్స్ కూడా చేశారు.
అయితే కాంగ్రెస్ షేర్ చేసిన పజిల్‌కు పోటీగా అమిత్ అనే బీజేపీ అభిమాని ఒకరు మరో ప్రశ్నను పోస్ట్ చేశారు. అమిత్ పోస్ట్ చేసిన ఫోటోలో ‘దేశాన్ని దోచుకుంది ఎవరూ..?’ అనే ప్రశ్న ఇచ్చి దానికి ఆప్షన్స్‌గా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబ పార్టీ, నెహ్రూ పార్టీ, పైవన్ని అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ పొలిటికల్ పజిల్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇదిలా ఉండగా దేశం విడిచి వెళ్లిపోయే ముందు తాను అరుణ్ జైట్లీని కలిసినట్లు విజయ్‌మాల్యా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. అంతేకాక ‘జైట్లీపై ప్రధాని వెంటనే విచారణకు ఆదేశించాలి. తనపై విచారణ కొనసాగుతున్నంత కాలం ఆయన తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయాలి’’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment