సాక్షి, న్యూఢిల్లీ : ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లుగా మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దేశం విడిచి లండన్ పారిపోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సీబీఐ, ఆఖరికి అత్యధికంగా ఆయనకు అప్పు ఇచ్చిన భారతీయ స్టేట్ బ్యాంక్ కారణమయ్యాయి. తాను దేశం విడిచి రావడానికి ముందు అరుణ్ జైట్లీని కలుసుకున్నానని విజయ్ మాల్యా ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెల్సిందే. అరుణ్ జైట్లీ, విజయ్ మాల్యా కలుసుకొని ఏం మాట్లాడుకున్నారో ఇటు పార్లమెంట్‌తోని, అటు ప్రజలతో పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. పైగా తాను లండన్‌ను వెళుతున్నట్లు అరుణ్ జైట్లీకి చెప్పానని విజయ్ మాల్యా చెప్పడం మరింత తీవ్రమైన అంశం.
అదే నిజమైతే విజయ్ మాల్యాను దేశం విడిచి వెళ్లకుండా ఆపాల్సిన పూర్తి బాధ్యత దేశ ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీపై ఉంది. ఆ దిశగా ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది కోటి రూకల ప్రశ్న. లండన్ వెళతానన్న విషయం తనకు చెప్పారా, లేదా? అన్న అంశాన్ని ఇప్పటి వరకు జైట్లీ ఖండించక పోవడం గమనార్హం. జైట్లీ, తనను కలసుకున్నానని విజయ్ మాల్యా ప్రకటించిన వెంటనే స్పందిస్తూ తన అప్పాయింట్‌మెంట్ కోరిన మాట వాస్తవమేగానీ, అయితే ఆయనకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని ముందుగా చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి మాల్యా తన రాజ్యసభ హోదాను దుర్వినియోగం చేసి పార్లమెంట్ ఆవరణలో తనను కలుసుకున్నారని, రుణాల చెల్లింపుల గురించి తనతో మాట్లాడుతానంటే తాను నేరుగా బ్యాంకులతో మాట్లాడాల్సిందిగా సూచించానని చెప్పారు.
బ్యాంకుల అలసత్వం
2016, ఫిబ్రవరి 28వ తేదీన సుప్రీం కోర్టు న్యాయవాది దుశ్వంత్ దేవ్ ఇంట్లో విజయ్ మాల్యాకు రుణాలిచ్చిన బ్యాంకర్లంతా సమావేశమయ్యారు. విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని బ్యాంకర్లు అనుమానం వ్యక్తం చేయగా, ఆయన్ని ఆపడం కోసం మరుసటి రోజు అంటే, ఫిబ్రవరి 29న సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాల్సిందిగా ఎస్‌బీఐ అధికారులకు దుశ్వంత్ దేవ్ సూచించగా వారు అందుకు అంగీకరించారు. ఆ మరుసటి రోజు దుశ్వంత్ సుప్రీం కోర్టుకు ఇదే విషయమై వెళ్లినా ఎస్‌బీఐ అధికారులు రాలేదు. ‘నేను సలహా ఇచ్చిన తర్వాత ఏదో జరిగింది’ అని దుశ్వంద్ దేవ్ ఇప్పుడు మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం. మాల్యా మార్చి 2వ తేదీన దేశం విడిచి లండన్ వెళ్లాక, మార్చి ఐదోతేదీన ఎస్‌బీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అదే ఏడాది మార్చి 10వ తేదీన పార్లమెంట్‌లో అరుణ్ జైట్లీని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ ఇదే విషయమై ప్రశ్నించారు. అప్పుడు కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. అంతటితో మాల్యా పరారీ విషయాన్ని పాలకపక్షంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా మరచిపోయింది. ఇప్పుడు మాల్యా స్వయంగా చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది.
సీబీఐ చేసిన సాయం ఎక్కువ
విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోకుండా ‘ఇమ్మిగ్రేషన్ బ్యూరో’కు జారీ చేసిన ‘లుకౌట్ నోటీసు’ మాల్యాపై ఆర్థిక నేరాల కేసులను విచారిస్తున్న సీబీఐ సడలించిన కారణంగా మాల్యా దర్జాగా దేశం విడిచి లండన్ వెళ్లగలిగారన్నది నిర్వివాద అంశం. మాల్యా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు నిర్బంధంలోకి తీసుకొని తమకు అప్పగించాల్సిందిగా మొదట సీబీఐ ‘లుకౌట్’ నోటీసు జారీ చేయగా, ఆ తర్వాత దాన్ని మాల్యా దేశం విడిచి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తమకు సమాచారం ఇస్తే చాలునని ఆ నోటీసును సడలించింది. ఈ విషయం సీబీఐ డైరెక్టర్‌కు తెలియకుండా సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సవరించడం అసాధారణ విషయం. గుజరాత్ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన ఏకే శర్మ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు సన్నిహితుడనే విషయం తెల్సిందే. గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రిగా అమిత్ షా ఉన్నప్పుడు వారికి బాగా పరిచయం. అమిత్ షా కారణంగానే సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా శర్మ ఐదేళ్ల కాలానికి నియమితులయ్యారనే ప్రచారం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment