శవం దొరకలేదని అమాయకుణ్ని చంపేశాడా?
తులసిని భయపెట్టేందుకు డెడ్‌బాడీని పార్శిల్ చేశాడా?
రెండో చెక్కపెట్టే ఎవరి కోసం చేయించాడు?
డెడ్‌బాడీ పార్శిల్ కేసులో నమ్మలేని నిజాలు
శ్రీధర్ వర్మకు అతని భార్యలు సహకరించారా?
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసులకే ఈ కేసు పెను సవాలుగా మారింది. ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి..
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డెడ్‌బాడీ పార్సిల్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో అనుమానితుడు శ్రీధర్‌వర్మను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ జరుగుతున్నకొద్దీ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. సాగి తులసి ఇంటికే డెడ్‌బాడీని శ్రీధర్‌వర్మ ఎందుకు పార్శిల్ చేశాడన్నదానిపై క్లారిటీ వస్తోంది.
తన వదిన ఆస్తిని కాజేసేందుకే ఈ స్కెచ్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. జులై నుంచే ఈ కుట్రకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. తులసికి శవాలంటే భయమన్న విషయం తెలుసుకున్న శ్రీధర్‌వర్మ.. ఆమెను భయటపెట్టేందుకు డెడ్‌బాడీని పంపించినట్టు సమాచారం.
వదిన తులసిని భయపెట్టాలంటే.. డెడ్‌బాడీ కావాలి. మృతదేహమంటే.. అదేదో అంగట్లో దొరికే వస్తువు కాదు. అందుకే అమాయకుడైన బర్రె పర్లయ్యను టార్గెట్ చేశాడు శ్రీధర్‌వర్మ. ఈ నెల 17న హత్య చేసి ఉంటే 19 వరకు మృతదేహాన్ని ఎక్కడ దాచారు? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రీధర్ వర్మకు గతంలోనే నేరచరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీధర్ వర్మకు మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర్ వర్మ రెండో భార్య అక్క అయిన సాగి తులసితో ఆస్తి గొడవలు నడుస్తున్నాయని.. ఈ క్రమంలో ఆమెను బెదరించడానికి పక్కా స్కెచ్‌తో పర్లయ్యను హత్య చేసి డెడ్‌బాడీని పార్శిల్‌లో పంపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
పర్లయ్యను హత్య విషయంలోనూ శ్రీధర్‌వర్మ ముందుగానే పెద్ద ప్లానే వేసుకున్నాడు. ఇందులో భాగంగా రెండు శవపేటికలను తయారు చేయించాడు. రోజు వారీ కూలీలైన పర్లయ్య, రాజు ఇద్దరికి పని ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఇద్దరిలో ఒకరిని చంపి పార్శిల్ చేయాలని భావించాడు. అయితే రాజుకు కుటుంబసభ్యులు ఉన్నందును అతడిని చంపితే గొడవలు అవుతాయని భావించిన శ్రీధర్ వర్మ.. పర్లయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. పర్లయ్యకు కుటుంబసభ్యుల ఉన్నా వారు పట్టించుకోరని భావించిన శ్రీధర్.. అనుకున్న ప్రకారం పర్లయ్యను హతమార్చాడు.
బర్రె పర్లయ్య హత్య అంతా శ్రీధర్‌వర్మ మూడో భార్య ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. పర్లయ్యను హత్య చేసి ఆపై అప్పటికే తాను ముందే సిద్ధం చేసిపెట్టుకున్న శవపేటికలో మృతదేహాన్ని ఉంచాడు. అయితే ఈ మొత్తం వ్యహారంలో శ్రీధర్ వర్మ మూడో భార్య ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 17న బర్రె వర్లయ్యను హత్య చేసేందుకు శ్రీధర్ వర్మ పక్కా ప్రణాళికతో చెక్క పెట్టెను సిద్ధం చేసుకున్నాడు. మద్యం తాగించి అనంతరం ఉండి మండలం వాండ్రం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని చెక్కపెట్టెలో పార్శిల్ చేయడానికి గాంధీనగర్ తీసుకువెళుతుండగా వర్షం కురవడంతో, కారు ముందుకు వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో శవాన్ని కారులోనే ఉంచి, మరొక పెట్టెను కైకలూరు నుంచికొని తెచ్చాడు. అనంతరం మృత దేహాన్ని గణపవరం మండలం సాగిపాడు వద్దకు పెట్టెలో తీసుకువెళ్లి మూడో భార్య సుష్మ సాయంతో ఆటోడ్రైవర్‌కు అప్పగించి తులసికి డోర్ డెలివరీ చేశారు.
ఇప్పటి వరకు అనుమానాస్పద కేసుగా విచారణ చేసిన పోలీసులు దీనిని హత్య కేసుగా మార్పు చేశారు. తులసికి చెందిన ఆస్తిని కాజేయడం కోసమే శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి పన్నాగం పన్నారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి భీమవరంలోని పలు నగల దుకాణాల్లో బంగారం తాకట్టు పెట్టి, మరికొంత విక్రయించినట్లు తెలియడంతో మూడు బంగారం దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్‌లో మొదటి భార్య ఇంట్లో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు, పుస్తకాలు పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా మల్లంపూడిలో శ్రీధర్ వర్మ తల్లిదండ్రులను, ఆయన ముగ్గురు భార్యలు, పిల్లలు, యండగండికి చెందిన ముదునూరి రంగరాజు, అతడి భార్య హైమావతి, సాగి తులసిలను పోలీసులు వేర్వేరుగా పలు ప్రదేశాల్లో విచారిస్తున్నారు. ఒకట్రెండ్రోజుల్లో వివరాలు పూర్తిగా వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ నయీం అస్మి అంటున్నారు.
ఇదీ చదవండి: కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?
మరోవైపు అమాయకుడైన బర్రె పర్లయ్యను.. శ్రీధర్‌వర్మ హతమార్చడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వివాదరహితుడిగా ఉన్న పర్లయ్యను ఇంత దారుణంగా హత్య చేయడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపేశారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మూడో భార్య ఇంట్లో మరో శవపేటికను కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఇంకో శవపేటికను శ్రీధర్ వర్మ ఎందుకు తీసుకువచ్చాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే శ్రీధర్‌వర్మ ఇంట్లో పోలీసులు సెర్చ్ చేయగా చేతబడి చేసే సామాగ్రి కూడా లభించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు శ్రీధర్ వర్మ వృత్తి ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా తులసిని ఆస్తి కోసం బెదిరించడానికి ఎలాంటి సంబంధం లేని పర్లయ్యను ఎందుకు హత్య చేశాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు శ్రీధర్ వర్మ సహకరించడం లేదని.. పోలీసులు వేస్తున్న ప్రశ్నలకు శ్రీధర్ వర్మ సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. మొత్తానికి డెడ్ బాడీ పార్శిల్ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇందులో ఎవరెవరు ఉన్నారనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment