సాక్షి, కామారెడ్డి జిల్లా: ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్‌ఐ సాయి, మహిళా కానిస్టేబుల్ శ్రుతి మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా, ముగ్గురు కుటుంబాల నుంచి ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల బంధువులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఎస్‌ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్‌లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్‌ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి కూడా ఎస్‌ఐ, కానిస్టేబుల్ వైపు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఆత్మహత్య నేపథ్యంలో కాపాడబోయి చనిపోయారా? లేక ముగ్గురివి ఆత్మహత్యలేనా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఎస్‌ఐ సాయి, కానిస్టేబుల్ శ్రుతి మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో శాఖాపరమైన దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. మరోవైపు.. మృతులు ముగ్గురి కాల్ లిస్ట్‌లు, సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటినుంచి మాట్లాడుతున్నారు.. ఎక్కడ కలిశారు.. ఎటువైపు నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో ఎంక్వైరీ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు బయటకు వస్తాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు..
కాగా, భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్‌ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్‌ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీశారు.
అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్‌ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్‌ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది.
బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది సస్పెన్స్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment