లండన్\న్యూఢిల్లీ : బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాల ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యాకు చుక్కెదురైంది. రుణాల ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించాలని 2018లో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించడాన్ని సవాల్ చేస్తూ యూకే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు మాల్యాకు అనుమతి లభించలేదు. ఈ నిర్ణయంతో తన అప్పగింతను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేసేందుకు మాల్యాకు అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో భారత్-బ్రిటన్ ఒప్పందం ప్రకారం 28 రోజుల్లో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కోర్టు ఉత్తర్వులను బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ధ్రువీకరిస్తారని భావిస్తున్నారు.
బ్రిటిష్ చట్టాల ప్రకారం 28 రోజుల వ్యవధి తక్షణమే కౌంట్‌డౌన్ ప్రారంభవుతుందని, నెలరోజుల లోపే మాల్యా భారత్‌లో ఉంటారని భారత దర్యాప్తు సంస్ధల వర్గాలు వెల్లడించాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తరపున రూ 9000 కోట్లు రుణాలు పొందిన విజయ్ మాల్యాకు వాటిని తిరిగి చెల్లించే ఉద్దేశం లేదని బ్యాంకులు ఆరోపిస్తుండగా, రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాల్యా చెబుతున్నారు. రుణ ఎగవేత కేసులో అరెస్టయిన మాల్యా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయంపై బ్రిటన్ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. మాల్యాపై అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా రుణ ఎగవేత కేసుల్లో నిందితులు విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో మాల్యా అప్పగింత మోదీ ప్రభుత్వానికి సానుకూల పరిణామంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment