లండన్ : బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకుంటున్న పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడంపై బ్రిటన్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు మోపారని, భారత జైళ్లలో దారుణ పరిస్థితులు ఉంటాయని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో వాదించారు. బ్యాంకులకు రుణ బకాయిల్లో అసలు మొత్తాన్ని చెల్లిస్తానని, తన ఆఫర్‌ను స్వీకరించాలని విజయ్ మాల్యా పదేపదే బ్యాంకులను కోరుతున్నారు. కాగా, సెటిల్‌మెంట్‌కు అంగీకరించాలని బ్యాంకులను కోరుతూ తనపై చర్యల తీవ్రతను తగ్గించడంతో పాటు ఆస్తుల స్వాధీన ప్రక్రియను అడ్డుకునేందుకు మాల్యా ప్రయత్నిస్తున్నారు.
మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ సీబీఐ, ఈడీలు బ్రిటన్ కోర్టులో బలంగా వాదించాయి. మాల్యా అప్పగింతపై కీలక నిర్ణయం వెలువడుతున్న నేపథ్యంలో సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు లండన్‌కు తరలివెళ్లారు. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.
వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడితే దాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని మాల్యా సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు మాల్యా అప్పగింతకు కోర్టు నిరాకరిస్తే నిర్ధిష్ట గడువులోగా సీబీఐ హైకోర్టులో వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పును సవాల్ చేసే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment