లక్నో : ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరగుతాయంటారు. అది నాటి మాట. కానీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు డబ్బు కోసం జరుగుతున్నాయనేది నేటి మాట’ అని అర్ధం వచ్చే ఘటన ఉత్తరప్రదేశ్ బాందా జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమ, పెళ్లి అంటూ యువకుల్ని నమ్మించడం. వారిని పెళ్లి చేసుకున్న అనంతరం డబ్బులు, బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న ఓ యువతిని, ఆమె ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల మేరకు.. వధువుగా పూనమ్, ఆమె తల్లిగా సంజనా గుప్తా, విమలేష్ వర్మ ,ధర్మేంద్ర ప్రజాపతి పెళ్లిళ్ల పేరయ్యగా ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లు ముందుగా ఒంటరిగా ఉంటూ వివాహ ప్రయత్నాల్లో ఉన్న యువకుల్ని గుర్తిస్తారు. అప్పుడే విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతిలు రంగంలోకి దిగుతారు. మేం పెళ్లిళ్ల పేరయ్యలం. మీకు సంబంధాలు చూస్తాం. కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువవుతుంది. మీకు ఓకే అయితే చెప్పండి. మేం మీకు మంచి అమ్మాయిని వెతికి పెడతాం. అంటూ పక్కా ప్లాన్ ప్రకారం బాధితులకు పెళ్లి కుమార్తెగా పూనమ్, సంజనా గుప్తా తల్లిగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అసలు కథ నడిపిస్తారు.
ముందుగా మాట్లాడుకున్నట్లుగా రిజిస్టర్ ఆఫీస్‌లో పూనమ్‌ను ఇచ్చి సదరు యువకుడితో పెళ్లి జరిపిస్తారు. అనంతరం వరుడి ఇంటికి పంపిస్తారు. అదును చూసి వరుడి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, ఇతర విలువైన వస్తువుల్ని అందిన కాడికి దోచుకుంటుంది పూనం. అక్కడి నుంచి.. మారు పేరుతో ప్రాంతాలు మార్చి తిరుగుతుంటారు. అలా ఈ గ్యాంగ్ మాస్టర్ మైండ్ పూనమ్ ఆరుగురిని వివాహం చేసుకుంది. అందరిని అలాగే మోసం చేసింది. ఏడో పెళ్లి చేసుకుందామని చూసింది. కానీ కథ అడ్డం తిరిగి జైలు పాలైంది.
శంకర్ ఉపాధ్యాయ్ అనే ఒంటరి యువకుడిని పూనమ్ ముఠా సభ్యుడు విమలేష్ సంప్రదించాడు. అతనికి పెళ్లి చేస్తానని చెప్పాడు. అమ్మాయి బాగా చదుకుంది. మీకు నచ్చితే ఉద్యోగం చేస్తుంది. కాకపోతే ఆ అమ్మాయికి తల్లి తప్ప ఇంకెవరూ లేరు. మీరు ఆ అమ్మాయికి ఎంత కట్నం ఇవ్వాలనుకుంటున్నారో అది మీ ఇష్టం . మాకు మాత్రం పెళ్లి చేసినందుకు రూ.1.5లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని మాట్లాడుకున్నారు. అసలే వయస్సు మీద పడడంతో పెళ్లి చేసుకుందామనే తొందరలో ముఠా డిమాండ్ ప్రకారం డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు.
గత శనివారం విమలేష్.. శంకర్‌ను ఓ ప్రాంతానికి పిలిచాడు. అక్కడే పూనమ్‌ను పరిచయం చేశాడు. అనంతరం రూ.1.5లక్షలు అడిగారు. దీంతో సదరు గ్యాంగ్‌పై శంకర్‌కు అనుమానం వచ్చింది. ఆమె తల్లిగా నటించిన పూనమ్, సంజనల ఆధార్ కార్డ్‌లు చూపించాలని అడిగారు. దీంతో నిందితులు బండారం బయటపడింది. తనని మోసం చేస్తున్నారని యువకుడు గుర్తించాడు. తాను ఈ పెళ్లి చేసుకోనంటూ ఖరాఖండీగా చెప్పాడు. దీంతో పూనమ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగింది. చంపేస్తామని, తప్పుడు కేసుల్లో ఇరికించామని హెచ్చరించారు. భయాందోళనకు గురైన బాధిత యువకుడు తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలంటూ మెల్లగా జారుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదుతో ఇద్దరు మహిళలతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు బాందా అదనపు పోలీసు సూపరింటెండెంట్ శివరాజ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment