వివిధ పనుల నిమిత్తం నిత్యం బ్యాంకులకు (Banks) వెళ్తుంటారా..? అయితే ఈ వార్త మీకోసమే. బ్యాంక్ తెరిచే వేళలు, మూసే సమయం ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడానికి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ బ్యాంకుల పని వేళలు (Bank Timings) ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంది.
ఈ మార్పులు 2025 జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడంలో ఈ చర్య సహాయపడుతుందని కమిటీ అభిప్రాయపడింది.
మార్పు ఎందుకంటే..
వివిధ బ్యాంకులకు వేర్వేరు సమయాల కారణంగా ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరుచుకోగా, మరి కొన్ని బ్యాంకులు 10:30 లేదా 11 గంటలకు తెరుచుకుంటున్నాయి. ఈ వ్యత్యాసం కారణంగా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు వెళ్లాల్సిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కస్టమర్‌లు ఇప్పుడు వివిధ బ్యాంక్ షెడ్యూల్‌ల ప్రకారం ప్రణాళిక లేకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఏ బ్యాంకుకు అయినా వెళ్లవచ్చు. ఏకరీతి పని వేళలు ఉండటం వల్ల గందరగోళం తగ్గుతుంది. వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
అన్ని బ్యాంకులు ఒకే సమయంలో పని చేయడం వల్ల ఇంటర్-బ్యాంక్ లావాదేవీలు, కస్టమర్ రిఫరల్స్ వంటి సేవల్లో మెరుగైన సమన్వయం ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆఫీసు షిఫ్ట్‌ల మెరుగైన ప్రణాళికలో సహాయపడుతుంది. మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ చర్యను దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అనుసరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment