ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపించేలా పరిస్థితులు ఏర్పడుతుండడం దురదృష్టకరం. వేలాది మందికి ఆధారంగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి..
కొత్త సంవత్సరంలో సంక్రాంతి(Sankranti) సందర్భంగా విడుదల కావల్సి ఉన్న సినిమాలపై ఈ ఉదంతం.. పరిణామాల ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. దానికి కారణం వీరిలో కొందరు భారీ వ్యయంతో సినిమాలు తీయగా, ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షో లు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించం అని ప్రకటించడమే అని చెబుతున్నారు.
వినోద మాద్యమ రంగంలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం ఆ పరిశ్రమను అతలాకుతలం చేస్తోందని చెప్పవచ్చు. ఆ దశలో అల్లు అర్జున్ ఘటన వ్యవహారాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది రేవంత్ ఈగో సమస్యగా మారినట్లుగా ఉంది. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులను తప్పుపట్టారు. అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండి ఇంటికి వస్తే సినీ ప్రముఖులు, ఇతరులు క్యూ కట్టి పరామర్శిస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తొక్కిసాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించ లేదని ఆయన అన్నారు. నిజమే!
ఆ బాలుడిని పరామర్శించాలని చెప్పడం తప్పు లేదు.కాని ఆ కారణంగా అర్జున్ ఇంటి వద్దకు వెళ్లడం తప్పన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అంత సముచితంగా లేదు.పైగా కాలు పోయిందా?చేయి పోయిందా? కిడ్నీ పోయిందా?ఏమి జరిగిందని అర్జున్ వద్దకు వెళ్లారని ప్రశ్నించడం మరీ తప్పు అని చెప్పకతప్పదు. తమకు సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన సన్నిహితులు,అదే రంగానికి చెందినవారు వెళ్లి పలకరించి వస్తుంటారు.అంతెందుకు! ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయినప్పుడు జైలువద్దకు వచ్చినవారితో కలిసి ఆయన ర్యాలీనే తీశారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు.
అల్లు అర్జున్ పై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసి పశ్చాత్తాప్తం ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోరు పారేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపోవాలట..! ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాపారాలు చేయాలట!. ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ సమర్దిస్తారా? సమర్దించరు. ఎందుకంటే స్వయానా ఆయన అల్లుడు ఆంధ్రకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఈ మాత్రం సోయ లేకుండా భూపాల్ రెడ్డి వంటి వారు వ్యర్ద ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ కు మరింత చేటు తెస్తుంది.
మంత్రి సీతక్క అయితే.. పుష్ప సినిమాకుగానూ అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. అది తప్పయితే.. రేవంత్ ప్రభుత్వం ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, ధరల పెంపుదలకు ఎందుకు అనుమతి ఇచ్చింది?. ఆ మాటకు వస్తే నక్సల్స్ కు సానుభూతిగా కొన్ని సినిమాలు వచ్చాయి.వాటిలో కొన్నిటికి అవార్డులు కూడా లభించాయి. కాని నక్సల్స్ ను ఏ ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?. సీతక్క(Seethakka) ఎందుకు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు?. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదని గుర్తించాలి. ఇదే టైంలో..
👉బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, రఘునందన్ తదితరులు అల్లు అర్జున్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని,పగ పట్టినట్లు వ్యవహరిస్తోందని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ వాళ్లే దీనిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు కస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యత్నిస్తోంది. భవిష్యత్తులో అల్లు కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది చూడాలి.
ఇక.. అర్జున్ పై కాంగ్రెస్ కాక తగ్గించకపోతే.. ఆ దిశగా అడుగులు పడ్డా ఆశ్చర్యం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అర్జున్ దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వానికి మంటపుట్టించింది. అది అర్జున్ కు ఉన్న స్వేచ్చ అని ప్రభుత్వం భావించలేదు. పోలీసు ఉన్నతాధికారులంతా రంగంలో దిగి అర్జున్ ఏదో ఘోరమైన నేరం చేశారని చెప్పడానికి యత్నించారు. లేకుంటే ఈ కేసులో పదివేల వీడియోలు సేకరించవలసినంత అవసరం ఏముంది?. ఎక్కడో చోట అర్జున్ తప్పు దొరకకపోదా? అని వెతికారన్నమాట. దీనిని ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టగా భావించారన్నమాట!. ఇదే సందర్భంలో..
👉పోలీసులు సంధ్య థియేటర్ వద్ద అర్జున్ కు స్వాగతం చెప్పిన రీతిలో వ్యవహరించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సస్పెండెడ్ పోలీస్ అధికారి అయితే మరీ రెచ్చిపోయి ఆంధ్ర-తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం, అర్జున్ నటన గురించి వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమవారికి ఇచ్చిన భూముల ప్రస్తావన తేవడం, ఏకంగా తాటతీస్తాం,తోలు తీస్తాం అని హెచ్చరించడం శోచనీయంగా ఉంది. అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చి మూడున్నర గంటలు విచారించడం కూడా వేధింపులో భాగమే అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా అర్జున్ ‘‘అలా జవాబిచ్చారు..ఇలా సమాధానం ఇచ్చారు..’’ అంటూ లీకులు ఇచ్చిన తీరు కూడా దీనిని ధృవపరుస్తుంది.
ఏపీలో రెడ్ బుక్(Red Book) రాజ్యాంగం మాదిరి తెలంగాణలో కూడా పోలీసులు ప్రజల తోలు తీసే రాజ్యాంగం వచ్చిందేమో తెలియదు.మరో వైపు కొందరు ఓయూ జేఏసీ పేరుతో అర్జున్ ఇంటిపై దాడి చేయడం మరింత దారుణం. పేరుకు జేఏసీ అయినా.. అక్కడకు వెళ్లినవారంతా కాంగ్రెస్ వారేనని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వీడియోలు వచ్చాయి. దీనిని ఖండించి , ఏకోన్ముఖంగా నిరసన చెప్పవలసిన సినిమా పరిశ్రమ పెద్దలు జడిసిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ శాసనసభలో చేసిన విమర్శలతో వీరంతా భయపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే..
👉అర్జున్ ఇంటిపై దాడి చేసినవారు అరాచకంగా రాళ్లు వేసి,పూలకుండీలు మొదలైనవాటిని ధ్వంసం చేసినా ఇంటిలో పనిచేసేవారిపై దౌర్జన్యానికి దిగినా సినీ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అర్జున్ కు ,ఆయన తండ్రి అరవింద్ కు సంఘీబావం తెలపలేదు. ఇది పరిశ్రమ బలహీనతగా ఉంది. రేవంత్ కూడా అర్జున్ ఇంటిపై దాడిని నేరుగా ఖండించకుండా, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పారనుకోవాలి.. ఇదే సందర్భంలో సడన్ గా బెనిఫిట్ షో లు రద్దు చేస్తామని సీఎం చెప్పడం సినీ పరిశ్రమ ప్రముఖులలో గుబులు రేపుతోంది.
వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో ప్రముఖ నటుడు వెంకటేష్ తదితరుల సినిమాలు విడుదల కావల్సి ఉంది. వీటిలో ఒక సినిమాకు ఐదువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయిందట!. అలాగే మరో సినిమాకు 150 కోట్లు ఖర్చు పెట్టారట!. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ షో లు, ధరల పెంపు,బెనిఫిట్ షో లు వంటివి లేకపోతే.. సత్వరమే వారు పెట్టిన పెట్టుబడి రావడం కష్టం అయిపోతుంది.
👉ప్రముఖ నిర్మాత ,తెలంగాణ చలనచిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రేవంత్ ను ఒప్పించి మళ్లీ బెనిఫిట్ షో లు, ధరల పెంపుదలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకువస్తారన్న ఆశతో ఉన్నారట!. అందుకే ఇప్పుడు అర్జున్ తప్పుచేసినా, చేయకపోయినా.. ఆ ఘటన జోలికి వెళ్లకపోవడం బెటర్ అని భావిస్తున్నారట!.
ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ ధరల గురించి చర్చించి, షూటింగ్ లు కూడా జరిపేలా షరతులు పెడితే.. ఇంకేముంది సినిమావారిపై దాడి చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటివారు కాని, ఇటు ఎల్లో మీడియా కాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించి విందు ఇచ్చి పంపితే, ఆయనకు ఏదో అవమానం జరిగిందంటూ కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు స్వయానా చిరంజీవి మేనల్లుడు ఇంటిపైనే దాడి జరిగితే పవన్ కల్యాణ్‌తో సహా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎందుకంటే.. పవన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటాయి కాబట్టి.
👉నిజంగానే రేవంత్ తననిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒకరకంగా ప్రయోజనం, మరో రకంగా నష్టం వాటిల్లవచ్చు. నిర్మాతలు చిన్న బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్దం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచాలని కోరవలసిన అవసరం ఉండదు. కానీ అగ్ర నిర్మాతలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఇది ముదిరితే సినీ పెద్దలు రేవంత్ ప్రభుత్వంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేయవచ్చు!. అంతేకాక తాము ఇక్కడ షూటింగ్ లు చేయలేమని,వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని ప్రకటించినా, రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందువల్ల పరిశ్రమకు ఇబ్బంది రాకుండా, అలాగే ప్రేక్షకులకు సౌలభ్యంగా రాజీ కుదుర్చుకోవడం మంచిదని చెప్పాలి.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment