అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు?. ‘‘ఇదేం ప్రశ్న!. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ మీద నెగ్గిన డొనాల్డ్ ట్రంప్‌దే’’ అని మీరు అనొచ్చు. కానీ, గత వారం పదిరోజులుగా అమెరికాలో సోషల్ మీడియాలో మరో తరహా చర్చ నడుస్తోంది. ట్రంప్ పేరుకే వైట్‌హౌజ్‌లో అధ్యక్ష స్థానంలో ఉంటారని.. కానీ ఎలాన్ మస్క్ మొత్తం నడిపిస్తారనే ప్రచారం నడిచింది. అయితే..
మస్క్ అధ్యక్షుడని.. ట్రంప్ ఉపాధ్యక్షుడంటూ ప్రచారం తారాస్థాయికి చేరడం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఏమాత్రం భరించలేకపోతున్నారట!. అందుకే ఎలాన్ మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారట!.ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఓ సందేశం వైరల్ అయ్యింది. దాని సారాంశం పరిశీలిస్తే..
‘‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడ్ని నేనే. ఇంకెవరో కాదు. మీడియాగానీ, ఇంకెవరైనాగానీ ఎలాన్ మస్క్ అంతా తానై నడిపిస్తారని ప్రచారం చేయొచ్చు. కానీ, ఇది నా విజన్.. నా నాయకత్వం.. నా అమెరికా. ఎలాన్ మస్క్ నా ఎన్నికల ప్రచారం కోసం సాయం చేసి ఉండొచ్చు.అతను గొప్ప మేధావే కావొచ్చు. కానీ, రాజకీయాలకొచ్చేసరికి నా ఇష్టప్రకారమే నడుస్తుంది. ఎలాన్.. నీ మద్దతుకు కృతజ్ఞతలు. కానీ, అదే సమయంలో నువ్వు గీత దాటొద్దు. అమెరికాను మరింత గొప్పగా తీర్చిదిద్దడమే ఇప్పుడు నా ముందున్న ఆశయం. ఇది అమెరికన్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అంతేగానీ మస్క్ ఇగోకు సంబంధించిన అంశం కాదు’’ అంటూ ఓ సందేశం గత ఐదు రోజులుగా చక్కర్లు కొడుతోంది.
అయితే.. ఆ సందేశానికి డొనాల్డ్ ట్రంప్‌నకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అలాంటి సందేశమూ ఒకటి వైరల్ కాలేదు. ఆ ఇమేజ్‌ను వెరిఫై చేయగా.. ఉత్తదేనని ఫ్యాక్ట్ చెక్(Fact Check)లో తేలింది. అయితే ప్రస్తుత పరిణామాల ఆధారంగానే ఆ సందేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరో వైరల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.
అసలు విషయం ఏంటంటే..
సాధారణంగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎవరినీ లెక్కచేయరు. గతంలో అది చూశాం. కానీ, ఈసారి అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్‌కు ప్రపంచదేశాధినేతలు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్‌తోనూ మాట్లాడించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై స్వయంగా మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని స్వయంగా హాజరై వీక్షించారు ట్రంప్. ఇక.. కొత్తగా సృష్టించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)కు సహ సారథిగా కొనసాగాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లో కలగజేసుకుంటున్నారనేది ఆ ఆరోపణల సారాంశం.
సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా నడుచుకునే ఓ టెక్ బిలియనీర్ ఆలోచనలే.. జనవరి 20వ తేదీ నుంచి ప్రభుత్వ నిర్ణయాలుగా అమలుకాబోతున్నాయని డెమొక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ వాదనకు బలం చేకూరేలా..
డోజ్‌తో మొదలుపెట్టి ఆపై వేలుపెట్టి..
అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని ట్రంప్ తన భుజాలకెత్తుకున్నారు. ఇది అంతటితో ఆగలేదు. అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. బిల్లు తెచ్చిన దిగువసభ స్పీకర్ మైక్ జాన్సన్‌పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేశారు. అమెరికా తలపై షట్‌డౌన్ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని మస్క్ తెగేసి చెప్పారు. ట్రంప్ సైతం మస్క్ అభిప్రాయంతో ఏకీభవించడంతో రిపబ్లికన్లు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. ద్రవ్య బిల్లులో ఏముందో ఆ పార్టీ సెనేటర్లు మస్క్‌కు చెందిన ఎక్స్(ట్విటర్) ద్వారానే తెలుసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ట్రంప్ ఏన్నారంటే..
ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ సిటీలో ట్రంప్ పాల్గొన్న అమెరికాఫీస్ట్ కార్యక్రమంలో ప్రేక్షకులు ‘అధ్యక్షుడు మస్క్’అంటూ నినాదాలు ఇవ్వడంతో ట్రంప్ స్పందించారు. పీఎం కాకపోతే ఏకంగా ప్రెసిడెంట్ అవుతారని డెమొక్రాట్ల చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ట్రంప్ మాట్లాడారు. ‘‘మస్క్(Musk) ఏనాటికీ అధ్యక్షుడు కాలేడు. నా సీటు భద్రం. ఆయన అమెరికాలో పుట్టలేదుగా. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంటుంది’’అని ట్రంప్ అన్నారు.
మస్క్ మనసులో..
ఎలాన్ మస్క్(Elon Musk) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ ప్రకటించలేదు. అలాగే.. ట్రంప్‌నకు తన మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. కానీ, దేశ ప్రయోజనాలకంటే మస్క్ సొంత వ్యాపారాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలను మాత్రం ఎందుకనో ఖండించడం లేదు. పైగా ‘అధ్యక్షుడు’ అనే ట్యాగ్ మీద కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగినా.. ఆర్థిక వ్యవస్థ మస్క్ చేతుల్లోకి వెళ్తుందని ఇటు డెమోక్రాట్లు.. అటు రిపబ్లికన్‌లు కూడా గుసగుసలాడుకుంటున్నారు. త్వరలో కొలువుతీరే కొత్త ప్రభుత్వంలో మస్క్ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే.. రిపబ్లికన్ పార్టీలో కలకలం రేగడం, వాళ్లిద్దరి మధ్య స్నేహ బంధానికి బీటలు వారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు!.
Comments
Please login to add a commentAdd a comment