సునామీ @20 ఏళ్లు: అలా జరిగి ఉంటే పెను విధ్వంసం తప్పేది! | 20 Years For Indian Ocean Tsunami Became A Wake-up Call | Sakshi
Sakshi News home page

సునామీ @20 ఏళ్లు: మహా విలయం.. నాడు అలా జరిగి ఉంటే పెను విధ్వంసం తప్పేది ఏమో!

Published Wed, Dec 25 2024 5:02 PM | Last Updated on Wed, Dec 25 2024 5:11 PM

20 Years For Indian Ocean Tsunami Became A Wake-up Call

ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. హహాకారాలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతూ చెల్లాచెదురైన జనం.. రెప్పపాటులో వాళ్లను ముంచేసిన రాకాసి అలలు.. నేలకూలిన భవనాలు-ముక్కలైన జీవనాధారాలు.. వెతికేకొద్దీ బయటపడ్డ శవాలు.. వెరసి ఎటుచూసినా కన్నీళ్లే!. సరిగ్గా.. 20 ఏళ్ల క్రితం సునామీ(Tsunami) సృష్టించిన విధ్వంసపు జ్ఞాపకాలివి. అప్పటిదాకా సాగర ఆటుపోట్లను ఆహ్లాదంగా భావించిన తీర ప్రాంత ప్రజలు.. ఘోర విపత్తును చూసింది మాత్రం అదే తొలిసారి!. ఇంతకీ ఆరోజు అసలేం జరిగింది? వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే విలయాన్ని పసిగట్టడంలో శాస్త్రవేత్తలు, అధికారుల అంచనాలు ఎక్కడ తప్పాయి?.

డిసెంబర్‌ 26, 2004.. సమయం ఉదయం 7.58నిమిషాలు.  ఇండోనేషియాలోని సుమత్రా ఉత్తర వైపున్న సముద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే.. ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’(పసిఫిక్‌ మహాసముద్రం) ప్రాంతమది. దీంతో అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు షరామాములుగా మారిందక్కడ. ఆ పూట సంభవించిన వాటిని కూడా తేలికపాటి ప్రకంపనలుగానే అధికారులు భావించి  తేలికగా తీసుకున్నారు. కానీ, ఆ ప్రకంపనలు ఒక ప్రళయాన్నే తీసుకొచ్చాయి. 

🌊తీవ్ర భూకంప ప్రభావంతో.. సముద్రంలో  50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి అలలు.  ఆ అలలు తీర ప్రాంతం నుంచి ఐదు కి.మీ పాటు భూభాగంలోకి చొచ్చుకొచ్చేశాయి.

  • ఇండోనేషియా..  అచె ప్రాంతంలోనే లక్షా యాభై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

  • శ్రీలంక.. సుమత్రాకు 1,700 కిలోమీటర్ల దూరంలోని శ్రీలంక తీర ప్రాంతాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది. వివిధ తీర ప్రాంతాల్లో రాకాసి అలల ధాటికి 35 వేల మంది మరణించారు.

  • భారత్‌.. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌లోనూ నష్టం జరిగింది. కేరళకు స్వల్ప నష్టం వాటిల్లింది.  మొత్తంగా 16, 389 మంది మరణించారు.

  • థాయ్‌లాండ్‌.. భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖావో లాక్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది. 8 వేలమంది మరణించారు. వీళ్లలో క్రిస్మస్‌, న్యూఇయర్‌ సెలవులకు వచ్చిన టూరిస్టులే అధికంగా ఉన్నారు.

🌊2004 హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ కారణంగా.. మొత్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు విడిచారు. చెల్లాచెదురైనవాళ్లు లెక్కలేనంత మంది. నిరాశ్రయులైనవాళ్లు ఇంకొందరైతే.. జీవనాధారాలను కోల్పోయారు మరికొందరు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆయా దేశాల పర్యాటక రంగం కుదేలు కావడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపెట్టింది. ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. మానవతా ధృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా అందించిన సాయం.. చరిత్రలోనే అతిపెద్ద సాయంగా నిలిచిపోయింది. అయినప్పటికీ.. తీర ప్రాంతాలు, మానసికంగా అక్కడి ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది.

10 నిమిషాల భూకంపం!
రిక్టర్‌ స్కేల్‌పై 9.1-9.3 మధ్య తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమి పది నిమిషాలపాటు కంపిస్తూనే ఉంది. ఆ కారణంతోనే సముద్రపు అలలు రాకాసి రూపం సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలను క్షణాల్లో చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్‌, థాయ్‌లాండ్‌, మాల్దీవులు.. ఇలా 14 దేశాలను సముద్రపు అలలు ముంచెత్తాయి. అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఎక్కడో 9వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్టేట్‌ ఓక్లాహామాలోనూ దీని ప్రభావం కనిపించిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సునామీ అనే పేరు మనవాళ్లు విన్నది అప్పుడే తొలిసారి!.

ఆసియాలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డు

  • 21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన భూకంపం

  • ప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన భూకంపాల్లో మూడో శక్తివంతమైంది

  • ఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం!

  • 2004 సునామీ 21వ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుగా చరిత్రకెక్కింది

*భూకంపాల కొలమానం.. సిస్మోగ్రఫీ అనేది 1900 సంవత్సరం నుంచి ప్రారంభమైంది.

 

చదవండి: ఆధునిక చరిత్రలోనే అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?.

 

🌊సునామీ.. మనిషి నిలువరించలేని ఓ ప్రకృతి విపత్తు!. తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే సునామీని ముందుగానే గుర్తించగలిగే గ్లోబల్‌ వార్నింగ్‌ వ్యవస్థ మాత్రం ఒకటి ఉంది. సముద్ర భూగర్భంలో చెలరేగే అలజడులు.. అలల తీవ్రత ఆధారంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇందుకోసం ‘సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌’(TWS)  పని చేస్తుంది. 

🌊ప్రపంచంలోనే తొలి సునామీ హెచ్చరికల వ్యవస్థ.. 1920లో హవాయ్‌లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంభవించిన విపత్తుల ఆధారంగా దానిని ఆధునీకరించుకుంటూ వచ్చారు. ఫసిఫిక్‌ సముద్రం, నార్త్‌ అమెరికా సంబంధిత వ్యవస్థలు తర్వాతి కాలంలో ఏర్పాటయ్యాయి. కానీ.. 2004 దాకా హిందూ మహాసముద్రంలో సునామీల హెచ్చరికలకు సంబంధించి ఇలాంటి వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ లేకపోవడం.. ఇంతటి విషాదానికి కారణమైందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది.

🌊2004 బాక్సింగ్‌ డే సునామీ తర్వాత.. ఆ మరుసటి ఏడాది IOTWMSను యునెస్కో ఏర్పాటు చేసింది. భారత్‌ తరఫున Indian Tsunami Early Warning Centre (ITEWC), ఈ IOTWMSతో సమన్వయం జరుపుతోంది. హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌లో ITEWCను 2007లో  ఏర్పాటు చేశారు. సముద్ర గర్భంలో చోటు చేసుకునే మార్పులు, సునామీల మీద అధ్యయనాలు.. పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ. 

🌊ప్రపంచంలో.. దాదాపు అన్ని సముద్ర రీజియన్లలో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి వ్యవస్థలు కచ్చితత్వం విషయంలోనూ కొన్ని లోపాలు బయటపడ్డాయి. దీంతో విపత్తులకు తగ్గట్లుగా మార్పులు చేస్తూ వస్తున్నారు. 2018 డిసెంబర్‌లో అగ్నిపర‍్వతం బద్ధలై సునామీ ముంచెత్తింది. దీంతో.. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి సముద్ర మట్టం స్థాయికి సెన్సార్‌లను ఏర్పాటు చేశారు.  అలా.. అప్పటినుంచి సునామీ హెచ్చరికలు తరచూ జారీ అవుతుండడం చూస్తున్నాం. అయితే ఇలాంటి వ్యవస్థ 20 ఏళ్ల కిందట ఉండి ఉంటే.. ఆనాడు అంతటి విధ్వంసం తప్పేది ఏమో!.

🌊సునామీ అంటే?..  Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. 

సాధారణంగా.. భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. సాధారణంగా సునామీలు అలల లాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు చాలా తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. ఈ రాకాసి అలలు కలిగించే నష్టం కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి.. 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల వాటిల్లిన విధ్వంసమే ఇందుకు ఉదాహరణ.

:::సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement