#Mentoo: ఓ డాక్టర్‌.. ఓ పోలీస్‌.. ఇలా ఎందరో? | Atul Subash Justice Still Due Mentoo So Many Incidents | Sakshi
Sakshi News home page

#Mentoo: ఓ డాక్టర్‌.. ఓ పోలీస్‌.. ఇలా ఎందరో?

Published Sat, Dec 14 2024 5:59 PM | Last Updated on Sat, Dec 14 2024 5:59 PM

Atul Subash Justice Still Due Mentoo So Many Incidents

చట్టం ముందు అందరూ సమానమే.. ఇది అనుకోవడానికే తప్ప ఆచరణలో లేదనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. ఇంతకాలం పేద-ధనికలాంటి తారతమ్యాలు వినిపిస్తే.. ఇప్పుడు ఆడ-మగగా మారిందది. అతుల్‌ సుభాష్‌ అనే టెక్కీ బలవన్మరణం నేపథ్యంతో ఈ  చర్చ మరింత వేడిని రాజేస్తోంది. బెంగళూరు, ఢిల్లీ.. ఇలా మెట్రో నగరాల్లో జస్టిస్‌ ఫర్‌ అతుల్‌ పేరిట సంఘీభావ ప్రదర్శనలు చేసే స్థాయికి చేర్చింది. 

భార్య కుటుంబం పెట్టిన వేధింపులు.. తప్పుడు కేసులను భరించలేక.. వ్యవస్థతో పోరాడటంలో తడబడిన అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కానీ, అతని చివరి కోరికగా.. న్యాయం కోసం అతని తరఫున మేం పోరాడతాం అంటూ కొందరు భర్తలు రోడ్డెక్కారు. దేశ జనాభాలో ట్యాక్సులు కట్టేవాళ్లలో మగవాళ్లదే సింహభాగం. కానీ, చట్టాలు మాత్రం కేవలం మహిళల పక్షమే వ్యవరిస్తున్నాయని అంటున్నారు. సమాజంలో పురుషుల ప్రాణాలూ ముఖ్యమేనని.. వారికీ చట్టపరమైన రక్షణ కావాలని ముక్తకంఠంతో కోరుతున్నారు వాళ్లు. అయితే..

 

అతుల్‌ ఘటన తర్వాత.. ఈ బర్నింగ్‌ టాపిక్‌కు మరో రెండు ఘటనలు తోడయ్యాయి. కర్ణాటకలో  హులిమవు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ హెచ్‌సీ తిప్పన్న(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  శుక్రవారం రాత్రి రైలు పట్టాలపై పడుకుని చితికిపోయాడు. భార్య, ఆమె కుటుంబం పెట్టే నరకం భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తిప్పన్న రాసిన ఓ సూసైడ్‌ నోట్‌ చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు..

డిసెంబర్‌11వ తేదీన..  రాజస్థాన్‌లో హోమియోపతి డాక్టర్‌ అజయ్‌ కుమార్‌(35) కృతినగర్‌లోని తన క్లినిక్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య వేధింపులే కారణమంటూ లేఖ రాశాడు. భార్యను పచ్చిబూతులు తిడుతూ రాసిన ఆ లేఖలో.. ప్రస్తుత వైవాహిక వ్యవస్థను, ఆ వ్యవస్థ కారణంగా తాను ఎదుర్కొన్న న్యాయపరమైన చిక్కులను, తన నిస్సహాయతను ఆ లేఖలో ప్రముఖంగా ప్రస్తావించాడు. 
 
జస్టిస్‌ ఈస్‌ డ్యూ
బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఏఐ ఇంజినీర్‌గా పని చేస్తున్న యూపీవాసి అతుల్‌ సుభాష్‌.. నగరంలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భార్య, ఆమె కుటుంబం తనను ఎంతగా వేధించిందో పే..ద్ద సూసైడ్‌ నోట్‌ రాసి.. గంటన్నరపాటు వీడియో తీసి Justice Is Due అని శరీరానికి అంటించుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. సుప్రీం కోర్టు తన గోడును వినాలని.. తనకు న్యాయం దక్కని తరుణంలో.. తన అస్తికలను కోర్టు బయటే మురికి కాలువలో కలపాలని.. ఒకవేళ న్యాయం దక్కితే పవిత్ర గంగలో కలపాలని డెత్‌ నోట్‌లో కోరాడతను.  ఈ క్రమంలో పేజీల కొద్దీ అతుల్‌ వ్యధ.. ముఖ్యంగా తన కొడుకును ఉద్దేశించి రాసిన లేఖ.. చివరి బహుమతి.. అన్నీ చాలామందిని భావోద్వేగానికి గురి చేసింది.

ఇక.. తన సోదరుడి మరణం వెనుక ఆయన భార్య నిఖితా సింఘానియా కుటుంబ ప్రొద్భలం ఉందని అతుల్‌ సోదరుడు మారతహల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఖిత కోసం అతుల్‌ చేయగలిగిందంతా చేశాడని.. అయినా తన సోదరుడి ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడతను. ఈ కేసు దీంతో.. బెంగళూరు పోలీసులు ఆమె స్వస్థలం ఔన్‌పూర్‌కు పంపించారు. గత మూడు రోజులుగా ఆ టీం దర్యాప్తు జరుపుతోంది. అయితే.. నిందితురాలు నిఖిత ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడకు నోటీసులు అంటించారు. కచ్చితంగా పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అతుల్‌ మృతి తర్వాత.. రెండ్రోజులకు కొన్ని మీడియా సంస్థలు నిఖిత నివాసానికి చేరుకున్నాయి. ఆమె అందుబాటులో లేకపోగా.. సోదరుడు, తల్లి మాత్రం మీడియాను ఉద్దేశించి దుర్భాషలాడారు. ఆపై రెండ్రోజులకే వాళ్లు కూడా పరార్‌ కావడం గమనార్హం.

ఒక భార్య.. ‘ఏడు’ భరణం కేసులు

వైవాహిక చట్టాల దుర్వినియోగంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. అలాంటి ఘటనలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టులో చట్టంతో ఆడుకున్న ఓ భార్య ఉదంతం చర్చనీయాంశమైంది..

ఒకావిడ తన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ భర్త ఆమెకు ఏడో భర్త. అప్పటికే ఆరుగురు మాజీ భర్తల నుంచి విడాకులు తీసుకుని. భరణం కోసం కోర్టును ఆశ్రయించింది. ఇక.. ఏడో భర్త నుంచి భరణం అడిగిన కేసులో న్యాయమూర్తి ఆ అంశాన్ని ప్రస్తావించారు.

ప్రతీ భర్తతో ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఆమె కాపురం చేసి.. విడాకులకు వెళ్లిందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రస్తావిస్తూ.. చట్టంతో మీరు ఆడుకుంటున్నారు అని మహిళను సదరు జడ్జి మందలించారు. అలాగే.. ఆ ఆరుగురి నుంచి ఆమె భరణం భారీగానే పుచ్చుకుందట. ఈ మేరకు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది కూడా. 

కర్ణాటకలోనే మరో ఉదంతంలో..
ఓ మహిళ తన మాజీ భర్త నుంచి నెలకు రూ.6,16,300 భరణం ఇప్పించమని కోర్టును కోరింది. అయితే ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి.. అంత ఖర్చులు ఉంటే డబ్బులు సంపాదించుకోవాలంటూ ఆ మహిళకు సూచించింది. ఇదే సమయంలో భరణం అనేది భర్తకు శిక్ష కాదని గుర్తు చేసింది.

ఇదీ చదవండి: అతుల్‌ మృగంలా ప్రవర్తించాడు: నికిత ఆరోపణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement