భర్త బలవన్మరణం.. భార్య నిఖిత రియాక్షన్‌ ఏంటంటే..! | Atul Subhash Case: How May Wife Nikita Singhania Reacts | Sakshi
Sakshi News home page

భర్త సుభాష్‌ బలవన్మరణం: భార్య నిఖిత రియాక్షన్‌ ఏంటంటే..

Published Wed, Dec 11 2024 5:12 PM | Last Updated on Sat, Dec 14 2024 6:02 PM

Atul Subhash Case: How May Wife Nikita Singhania Reacts

మీడియాకు నిఖిత తల్లి, సోదరుడి వార్నింగ్‌(ఇన్‌సెట్‌లో అతుల్‌ సుభాష్‌)

అతుల్‌ సుభాష్‌.. బలవన్మరణంతో దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీసిన వ్యక్తి.  భార్య కుటుంబం బ్లాక్‌మెయిలింగ్‌తో మానసిక వేధింపులకు గురైన భర్తగా..  మూడేళ్లుగా కన్నకొడుకును కళ్లారా చూసుకోలేని తండ్రిగా.. డబ్బు కోసం కుటుంబాన్ని ఇబ్బందిపెట్టలేని కొడుకుగా.. చివరకు నిస్సహాయస్థితిలో ఉన్న వ్యక్తి ఆత్మహత్యే గతి అనుకున్నాడు. అతుల్‌ సుభాష్‌ కేసుతో.. మగవాళ్ల కోసం #Mentoo ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ కేసు గురించి తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భార్య నిఖితా సింఘానియా Nikita Singhania పేరు ట్రెండ్‌ అవుతోంది.

నిఖితా సింఘానియా.. 2019లో ఓ మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా అతుల్‌ సుభాష్‌కు పరిచయమైంది. ఈ ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్‌. అదే ఏడాది ఇద్దరికీ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత బెంగళూరుకు ఈ జంట మకాం మార్చింది. వీరిద్దరికి ఓ బాబు పుట్టాడు. అయితే.. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

కొడుకును తీసుకుని నిఖిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. గత మూడేళ్లుగా ఆమె సుభాష్‌కు దూరంగానే ఉంటోంది. ఈ క్రమంలోనే జౌన్‌పూర్‌ కోర్టులో ఆమె విడాకుల కోసం కేసు వేసింది. అలాగే.. అతుల్‌, ఆయన కుటుంబ సభ్యులపై మొత్తం 9 కేసులు నమోదు చేయించింది. శారీరకంగా హింసించడం, అసహజ శృంగారం, పైగా వరకట్న వేధింపులతో తన తండ్రిని కుంగదీసి గుండెపోటుతో చనిపోయేలా చేయడం.. లాంటి అభియోగాలు అందులో ఉన్నాయి.  ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తోంది. అయితే అతుల్‌ మరణంతో.. అతన్ని అంతగా వేధించిన ఆమెను ఉద్యోగం తొలగించాలంటూ సదరు కంపెనీలకు పలువురు రిక్వెస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తన సోదరుడిని అతని భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పారని ఆరోపిస్తూ అతుల్‌ సోదరుడు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. నిఖిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిపి ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణ కోసం ఓ దర్యాప్తు బృందాన్ని బెంగళూరు పోలీసులు జౌన్‌పూర్‌కు పంపారు. నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు విచారించనున్నారు. మరోవైపు.. తన డెత్‌నోట్‌లో ఓ జడ్జిపైనా ఆయన సంచలన ఆరోపణలు చేశాడు. అయితే..

ఈ పరిణామాలపై నిఖిత స్పందించాల్సి ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఓ మీడియా సంస్థ జౌన్‌పూర్‌లోని నిఖిత ఇంటికి వెళ్లింది. కానీ, వాళ్లు మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. పైగా నిఖిత తల్లి, ఆమె సోదరుడు మీడియా ప్రతినిధులను దుర్భాషలాడారు. మరోవైపు..

సుభాష్‌ చేసిన ఆరోపణలకు ఆమె దగ్గర సమాధానం ఉందని, అతిత్వరలోనే స్పందిస్తుందని నిఖిత మేనమామ చెబుతున్నాడు. అతుల్‌ చేసిన ఆరోపణలన్నీ నిరాధరమైనవేనని అంటున్నారాయన. ‘‘నిఖిత ప్రస్తుతం అందుబాటులో లేదు. ఆమె రాగానే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. అతుల్‌ సుభాష్‌ తన డెత్‌నోట్‌లో చేసినవన్నీ ఉత్త ఆరోపణలే. నా పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉందని మీడియా కథనాలను బట్టే తెలిసింది. కానీ, ఇందులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నిఖిత కుటుంబ సభ్యులే అందిస్తారు’’ అని చెప్పారాయన.

ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ను కదిలించిన భర్త గాథ ఇది!

కొడుక్కి అతుల్‌ సందేశం
యూపీకి చెందిన అతుల్‌ సుభాష్‌.. బెంగళూరులో ఓ  ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. తనపై తప్పుడు కేసులు వేసి.. భారీగా డబ్బులు గుంజేందుకు తన భార్య నిఖిత కుటుంబం ప్రయత్నించిందన్నది ఆయన ఆరోపణ. ఈ మేరకు సూసైడ్‌ నోట్‌లోనూ ఆయన ఆ వివరాలను రాశారు. అలాగే గంటన్నరపాటు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. తన 24 పేజీల డెత్‌నోట్‌లో నాలుగేళ్ల కొడుకు కోసం ఆయన ఓ సందేశం ఉంచారు. మూడేళ్లుగా దూరంగా ఉన్న తన బిడ్డ మొహం కూడా తనకు గుర్తు లేదని.. కొడుకును అడ్డుపెట్టుకుని తనలాంటి నిస్సహాయుడైన తండ్రి నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నించారని.. అందుకే ఈ వ్యవస్థను నమ్మొద్దంటూ తన కొడుకుకు సూచిస్తూ ఆయన ఆ సందేశంలో పేర్కొన్నారు. అలాగే.. తన కొడుకు కోసం చివరిసారిగా తాను కొన్న కానుకను ఎలాగైనా అందించాలంటూ లేఖలో ప్రాధేయపడుతూ.. దానిని అక్కడే ఓ కుర్చీలో ఉంచాడు.

కొడుకును చూడాలంటే 30 లక్షలా?
అతుల్‌ సుభాష్‌ తన భార్య నిఖిత కుటుంబం ఎంతగా వేధించింది.. ఆయన తన నోట్‌లో ప్రస్తావించారు. నిఖిత తండ్రికి పదేళ్లుగా గెండు జబ్బు, డయాబెటిక్‌ ఉందని.. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయనకు చికిత్స అందిందని.. ఈ క్రమంలోనే ఆయన మరణించాడే తప్ప వరకట్న వేధింపులు కాదని అతుల్‌ చెప్పారు. అలాగే.. తనపై పెట్టిన తప్పుడు కేసుల సెటిల్‌మెంట్‌కు భార్య నిఖిత మొదట కోటి రూపాయలు అడిగిందని, ఆపై ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్‌ చేసిందని ఆరోపించారాయన. 

తన కొడుకు మెయింటెనెన్స్‌ కోసం నెలకు కోర్టు 40,000 చెల్లించమని ఆదేశిస్తే.. తాను రూ.80 వేలు ఇచ్చేవాడినని.. ఒకానొక టైంలో రూ.2 లక్షలు ఇచ్చానని, అయినా కూడా నిఖిత తనను కొడుకును చూసేందుకు అనుమతించలేదని చెప్పారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. కొడుకును చూడాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని నిఖిత తల్లి నిషా తనను డిమాండ్‌ చేసిందని అతుల్‌ లేఖలో పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో కేసులా?.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

‘‘నువ్వింకా చావలేదా?(నవ్వుతూ). కోర్టుల చుట్టూ తిరగడం కంటే చావే మేలని ఈపాటికే నువ్వు అనుకుని ఉంటావేమో. అయినా నువ్వు చచ్చినా.. ఆ సొమ్ము నీ తల్లిదండ్రుల నుంచి రాబడతాం. ఈ దేశంలో మొగుడు చచ్చినా.. పెళ్లాలకు రావాల్సినవన్నీ కరెక్ట్‌గానే అందుతాయి’’ అంటూ నిఖిత తల్లితో జరిగిన సంభాషణను యధాతథంగా సూసైడ్‌ లేఖలో పేర్కొన్నారాయన.

జౌన్‌పూర్‌ ఫ్యామిలీ కోర్టులో.. 

నిఖిత వేసిన కేసుల విచారణ సందర్భంగా జరిగిన ఉదంతాన్ని కూడా అతుల్‌ తన లేఖలో ప్రస్తావించారు. 

ఇలాంటి తప్పుడు కేసుల వల్ల ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు: అతుల్‌

అయితే నువ్వింకా చావలేదేం: నిఖిత

జడ్జి నవ్వుతూ.. నిఖితను బయటకు పంపించి.. ‘‘ఐదు లక్షలు ఇస్తే కేసులో నీకు అనుకూలంగా తీర్పు ఇస్తా’’. 

ఇలాంటి న్యాయవ్యవస్థలో మనం బతుకుతున్నామని.. రాష్ట్రపతి దృష్టికి ఈ విషయం వెళ్లాలని అతుల్‌ తన డెత్‌నోట్‌లో పేర్కొన్నారు.

 

మృగంలా ప్రవర్తించారు: నికిత 
అతుల్‌ ఆత్మహత్య కేసు నేపథ్యంలో.. 2022లో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాలు బయటకొచ్చాయి. జౌన్‌పూర్‌కు చెందిన నికితకు 2019లో బిహార్‌కు చెందిన సుభాష్‌తో వివాహం జరిగింది. వీరు బెంగళూరులో ఉంటూ అక్కడే పనిచేసేవా రు. తన భర్త అతుల్‌ తనను కొట్టేవాడని, భార్యాభర్తల సంబంధం విషయంలో మృగంలా ప్రవర్తించేవాడని నికితా సింఘానియా ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లిలో ఇచి్చన కట్నంతో సంతృప్తి పొందక మరో 10 లక్షలు డిమాండ్‌ చేశారన్నారు. కట్నంకోసం తనను శారీరకంగా, మానసికంగా హింసించారని పేర్కొన్నారు. 

తన తల్లిదండ్రులకు చెబితే సర్దుకుని పోవాలని సూచించేవారని ఫిర్యాదులో వెల్లడించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదని, మద్యం తాగి భర్త తనను కొట్టడం ప్రారంభించాడని, బెదిరించి తన జీతం మొత్తాన్ని అతని ఖాతాకు బదిలీ చేసుకునేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అత్తామామలు పదేపదే వేధించడం వల్లే తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, 2019 ఆగస్టు 17న గుండెపోటుతో మరణించారని ఆమె తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement