అతుల్ సుభాష్ కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై దేశసర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనవడిని తమకు అప్పగించాలంటూ అతుల్ తల్లి అంజు దేవి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో.. నాలుగేళ్ల అతుల్ కొడుకు ఎక్కడ ఉన్నాడన్నదానిపై నిఖితా సింఘానియా తరఫు న్యాయవాది స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతం ఆ చిన్నారి ఫరిదాబాద్(హర్యానా)లోని బోర్డింగ్‌స్కూల్‌లో చదువుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం నిఖిత షరతులతో బెయిల్ మీద ఉన్న దృష్ట్యా.. ఆ పిల్లాడిని బెంగళూరుకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపాడాయన. అయితే.. వచ్చే విచారణ టైంలో ఆ చిన్నారిని కోర్టులో ప్రవేశపెట్టాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అయితే..
అంజు దేవీ(Anju Devi) తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆరేళ్లలోపు పిల్లలను బోర్డింగ్ స్కూల్‌కు పంపడం ఎడ్యుకేషన్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని, కాబట్టి అతని సంరక్షణను నాయనమ్మకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుని.. ‘‘ఆ చిన్నారి నాయనమ్మతో గడిపిన సమయం చాలా తక్కువ. ఒకరకంగా చూసుకుంటే పిటిషనర్ ఆ పిల్లాడికి కొత్త ముఖమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో.. అంజుదేవి తరఫు లాయర్ గతంలో ఆ నానమ్మ-మనవడు కలిసి దిగిన ఫొటోలను బెంచ్‌కు సమర్పించారు.
అయితే నిఖితా సింఘానియా(Nikita Singhania) ఈ కేసులో దోషిగా ఇంకా నిరూపించబడాల్సి ఉందని, కేవల మీడియా కథనాల ఆధారంగా ఆమెను దోషిగా గుర్తించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున పిల్లాడి సంరక్షణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉందని పేర్కొంటూ.. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో..
మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్(Atul Subash) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్‌టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.
అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. అయితే.. వాళ్లకు కోర్టు తాజాగా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఒకవైపు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో, మరోవైపు కర్ణాటక హైకోర్టులో.. ఇంకోవైపు సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment