Justiceisdue: సోషల్‌ మీడియాను కదిలించిన ఓ భర్త గాథ | Justice For Atul Subhash: How Indian Judicial System handling Marital Law cases | Sakshi
Sakshi News home page

కదిలించిన ఓ భర్త గాథ.. వైవాహిక చట్టాల దుర్వినియోగం ఇంకెన్నాళ్లు?

Published Wed, Dec 11 2024 11:53 AM | Last Updated on Wed, Dec 11 2024 1:24 PM

Justice For Atul Subhash: How Indian Judicial System handling Marital Law cases

#JusticeForAtulSubhash.. #Justiceisdue ఎక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన అంశం. భార్య పెట్టిన వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఓ భర్తకు మద్దతుగా సోషల్‌ మీడియాలో నడుస్తున్న క్యాంపెయిన్‌ ఇది. మేధావులు, న్యాయ నిపుణులు, పేరు మోసిన జర్నలిస్టులు ఈ క్యాంపెయిన్‌లో భాగం అవుతున్నారు. అయితే ఇలాంటి కేసులు కొత్తేం కాదు కదా!. మరి దీనినే ఎందుకు అంతలా హైలైట్‌ చేయడం?. ఎందుకంటే.. అతుల్‌ కేసులో తీవ్రత అంతలా ఉంది కాబట్టి.

‘‘ఒకవేళ నాకు న్యాయం జరిగితే.. నా అస్తికలను పవిత్రంగా గంగలో నిమజ్జనం చేయండి. లేకుంటే కోర్టు బయట మురికి కాలువలో కలిపేయండి’’ అంటూ.. చివరి కోరికలతో సహా సుదీర్ఘమైన సూసైడ్‌ నోట్‌ రాశారు 34 ఏళ్ల అతుల్‌ సుభాష్‌. అది సుప్రీం కోర్టు దాకా చేరాలని ఆయన చేసిన విన్నపం, చనిపోవడానికి ముందు ఆయన చేసుకున్న ఏర్పాట్లు.. తన నాలుగేళ్ల కొడుకు కోసం ఇచ్చిన గిఫ్ట్‌.. ఇవన్నీ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. భార్య, ఆమె కుటుంబం డబ్బు కోసం ఎలా హింసించింది.. ఆఖరికి న్యాయమేంటో చెప్పాల్సిన జడ్జి కూడా తనకు అన్యాయం చేశారంటూ.. ఆ వీడియోలో వివరించి చెప్పారు.

👉ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్‌ సుభాష్‌కు 2019లో నిఖితా సింగ్‌తో వివాహమైంది. ఈ జంటకు ఒక బాబు. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో మంచి పొజిషన్‌లో పని చేశారాయన. భార్య నిఖితా సింగ్‌ కూడా టెక్కీనే. మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్‌లో ఈ కుటుంబం నివసించేది. అయితే.. కొంతకాలంగా భార్య నిఖితా సింగ్‌ కుటుంబంతో ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె యూపీలోని తన సొంతూరుకు వెళ్లిపోయింది. ఆపై అతుల్‌పై కేసులు పెట్టింది. ఆపై విడాలకు కోసం కోర్టును ఆశ్రయించిందామె.

👉ఈ కేసు విషయమై బెంగళూరు నుంచి యూపీకి 40సార్లు తిరిగాడాయన. వెళ్లిన ప్రతీసారి ఓ కొత్త కేసు కోర్టు ముందుకు వచ్చింది. తీవ్ర మానసిక వేదనకు గురైన ఆయన.. డిసెంబర్‌ 8వ తేదీన బెంగళూరులోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు.. తన సోదరుడికి ఓ మెయిల్‌ పెట్టాడు. అలాగే తన వైవాహిక జీవితంలో తాను ఎంతలా నరకం అనుభవించింది గంటన్నర పాటు వీడియోగా చిత్రీకరించారు.

సంబంధిత వార్త: భార్య కేసు పెట్టిందని.. డెత్‌నోట్‌ రాసి! 

 

👉నిఖిత, అతుల్‌ను విడిచి వెళ్లి 8 నెలలపైనే అవుతోంది. యూపీ జౌన్‌పూర్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందామె. విడాకులకు కారణాలుగా.. అతుల్‌ మీద గృహ హింస, అసహజ శృంగారం లాంటి అభియోగాలతో తొమ్మిది కేసులు నమోదు చేయించింది. అంతేకాదు అతుల్‌పై కేసులు వెనక్కి తీసుకోవాలంటే.. రూ.3 కోట్ల రూపాయల డబ్బు ఇప్పించాలంటూ కోర్టు బయట బేరసారాలకు దిగింది. ఒకవైపు మానసికంగా.. మరోవైపు కోర్టు చుట్టూ తిరిగి శారీరకంగా అలసిపోయాడు. చివరకు.. తనకు ఎదురైన వేదనను భరించలేక బలవనర్మణానికి పాల్పడ్డారు.

న్యాయమూర్తే అపహాస్యం చేస్తే..
న్యాయవ్యవస్థ.. నేర వ్యవస్థగా మారితే ఎలా ఉంటుంది?.. ఆ వ్యవస్థలో అవినీతి ఏస్థాయిలో పేరుకుపోయిందో చెబుతూ.. సుభాష్‌ తన సూసైడ్‌ నోట్‌లో ఆవేదన వెల్లగక్కారు. ఈ క్రమంలో  జౌన్‌పూర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఒకరు.. తనను ఎంతగా హింసించింది పేర్కొన్నారు. తన కేసును విచారించిన ఓ మహిళా జడ్జి.. తను నుంచి భారీగా లంచం డిమాండ్‌ చేశారనే విషయాన్ని ప్రస్తావించారాయన. కోర్టులో విచారణకు వెళ్లినప్పుడల్లా.. నిఖిత తనపై కొత్త ఆరోపణలు చేసేదని.. ఒకానొక టైంలో సదరు జడ్జి తనను అపహాస్యం చేస్తూ నవ్వేవారని చెప్పారాయన.

 అంతేకాదు.. తనకు అనుకూలంగా తీర్పు కోసం ఇవ్వడం కోసం లక్షల సొమ్మును డిమాండ్‌ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. విచారణ తేదీలను షెడ్యూల్ చేయడానికి కూడా లంచం అడిగారని, ఇవ్వకపోవడంతో గతంలో తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఈ ఆరోపణల సంగతి చూడాలంటూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన కోరారు. 

👉ప్రతీ చట్టం ఆడవాళ్ల కోసమేనా?. మగవాళ్ల కోసం ఏమీ ఉండదా? అని అతుల్‌ సోదరుడు బికాస్‌ వేసిన ప్రశ్న.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన భార్య కోసం తన సోదరుడు చేయగలిగిదంతా చేశాడని.. అయినా ఇలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 

మహిళల రక్షణ కోసం మన దేశంలో చట్టాల్లో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అందునా.. వివాహితల కోసం వైవాహిక చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ,  ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తే..  ఏం చేయాలనే దానిపైనే  న్యాయవ్యవస్థకు స్పష్టత కొరవడింది. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

  • వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడం కోసం.. చట్టాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు కొందరు.

  • సరైన ఆధారాలు లేకుండా.. అడ్డగోలు ఆరోపణలతో నిందితులుగా చట్టం ముందు నిలబెడుతున్నారు. ఇలాంటి కేసుల వల్ల కోర్టుకు పనిభారం పెరిగిపోతోంది.

  • కొన్ని కేసుల్లో.. అతిశయోక్తితో కూడిన ఆరోపణల వల్ల బంధువులు సైతం చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆ న్యాయస్థానాలు కచ్చితంగా న్యాయ పరిశీలనలు జరపాలనే అభిపప్రాయం వ్యక్తమవుతోంది.అన్నింటికి మించి..

  • ఇలాంటి తప్పుడు కేసులు సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. బాధితులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అతుల్‌ లాంటివాళ్లెందరో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.  

‘‘నా కేసులో ఎలాంటి వివరాలు దాచకండి. ప్రతీ విషయం అందరికీ తెలియాలి. అప్పుడే మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత భయానకంగా ఉందో, చట్టాల దుర్వినియోగం ఎంత ఘోరంగా జరుగుతుందో తెలుస్తుంది’’ అంటూ అతుల్‌ తన చివరి నోట్‌లో రాశారు. అతుల్‌ నోట్‌ ఆధారంగా నిఖిత, ఆమె కుటుంబ సభ్యులపై బెంగళూరులో కేసు నమోదైంది. మరోపక్క అతుల్‌ సూసైడ్‌ నోట్‌లో  ప్రస్తావించినట్లే.. తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని.. ఈ కేసు వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా కొందరు తెలియజేస్తున్నారు. ఎలాగైనా బాధితుడికి న్యాయం జరగాలని కోరుకుంటూ చిన్నపాటి ఉద్యమాన్నే నడిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement