అతుల్ సుభాష్ మృతిలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి ప్రమేయం లేదని భార్య నిఖితా సింఘానియా చెబుతోంది. ప్రస్తుతం బెంగళూర్ పోలీసుల అదుపులో ఉన్న నిఖిత.. విచారణలో పదే పదే ఈ విషయాన్ని చెబుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో టెక్కీగా పని చేసిన అతుల్ సుభాష్.. తన భార్య, ఆమె కుటుంబం డబ్బు కోసం వేధించడం వల్లే చనిపోతున్నానంటూ.. ఓ సుదీర్ఘమైన డెత్‌నోట్ రాసి బలవనర్మణానికి పాల్పడ్డాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..
బెంగళూరు: అతుల్ ఆత్మహత్యపై దుమారం రేగాక.. ఇటు నిఖిత, అటు ఆమె తల్లి, సోదరుడు పరారీలో ఉన్నారు. ఎవరికీ దొరక్కుండా వాట్సాప్ కాల్స్‌తో మాట్లాడుకుంటూ వచ్చారు. చివరకు.. నిఖిత ఓ బంధువుకు రెగ్యులర్ కాల్ చేయడంతో ఆమె ఆచూకీని కనిపెట్టగలిగారు. ఓ కాల్ ఆధారంగా తొలుత నిఖితను, ఆపై నిఖిత ద్వారా ఆమె తల్లి, సోదరుడ్ని పోలీసులు టట్రేస్ చేయగలిగారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి బెంగళూరు తరలించిన.. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కి పంపించారు. అయితే..
తన భర్త నుంచి తాను దూరంగా ఉండబట్టి మూడేళ్లు అవుతోందని.. అలాంటప్పడు తాను అతన్ని ఎలా వేధించగలనని ఆమె వాదిస్తోంది. ‘‘డబ్బు కోసమే అతన్ని వేధించి ఉంటే.. అతనికి దూరంగా నేను ఎందుకు ఉంటా?. అతని వెంటే ఉండి వేధించే దాన్ని కదా!’’ అని ఆమె పోలీసులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. పైగా అతుల్ తనను అదనపు కట్నం కోసం వేధించాడని.. అందుకే 2022లో తాను కేసు పెట్టిన విషయాన్ని ఆమె పదే పదే ప్రస్తావిస్తోంది.
2022లో ఏం జరిగిందంటే..
2019లో అతుల్‌తో మా వివాహం జరిగింది. అయితే రెండేళ్లు గడిచాక అదనపు కట్నం కోసం అతుల్, అతని కుటుంబ సభ్యులు తనను శారీరకంగా హింసిస్తున్నారని నిఖితా సింఘానియా యూపీ జౌన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు అసహజ శృంగారం కోసం అతుల్ తనను వేధించేవాడని ఆమె కేసు పెట్టింది. ఇక.. కట్నం కోసం తనను హింసించడాన్ని తట్టుకోలేకే తన తండ్రి గుండె జబ్బుతో మరణించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే..
నిఖిత అభియోగాల్ని అతుల్ తన డెత్‌నోట్‌లో ఖండించాడు. తనపై ఆమె పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని.. ఆమె తండ్రికి గుండె జబ్బు దీర్ఘకాలికంగానే ఉందని.. కేవలం డబ్బు కోసమే తనను బ్లాక్‌మెయిల్ చేసేవారని పేర్కొన్నాడతను.
ఇంతకీ అతుల్ కొడుకు ఎక్కడ?
అతుల్ సుభాష్ కేసులో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న వినిపిస్తోంది. అతుల్ నాలుగేళ్ల చిన్నారి ఎక్కడా? అని. ఇదే విషయాన్ని వ్యక్తం చేస్తూ.. అతుల్ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తన మనవడ్ని తనకు అప్పగించాలని.. తన కొడుకు చివరి కోరిక తీర్చాలంటూ ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే.. అతుల్ మరణం వార్త తెలియగానే ఓ దగ్గరి బంధువు ఇంట్లో ఆ చిన్నారిని నిఖిత తల్లి వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు చిన్నారిని బెంగళూరుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
పరారీలో మేనమామ!
అతుల్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. బెంగళూరు మరథహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. చాకచక్యంగా.. నిఖిత(29), నిషా(54), సోదరుడు అనురాగ్(27) అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా బెంగళూరుకు తీసుకురాగలిగారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో.. పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. అయితే నిఖిత మేనమామ పరారీలో ఉండడంతో.. అతని కోసం గాలింపు చేపట్టారు. #Justiceisdue
Comments
Please login to add a commentAdd a comment