Bengaluru police
-
రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు
బనశంకరి: బెంగళూరు నగర శివారులోని హెబ్బగోడిలో ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. ఈ పార్టీలో తెలుగు సినీ నటులు ఉన్నారని, అయితే ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘‘రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ ఉన్నారు. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ అని ఈ రేవ్‌పార్టీకి పేరుపెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలనుకున్నారు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న వారి పేర్లలో హేమ పేరు వినబడగానే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్‌లో ఫాంహౌస్‌లో ఉన్నాను అని చెప్పింది. ఆమె వీడియో గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం. ..పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్యపరీక్షలు చేపట్టాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రేవ్‌పార్టీ జరిగిన స్థలం బెంగళూరు రూరల్‌లోని హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును ఎల్రక్టానిక్ సిటీ పీఎస్ నుంచి హెబ్బగోడి పీఎస్‌కు బదిలీ చేశాం. డ్రగ్స్ విసిరేశారు: రేవ్‌పార్టీలో వందమందికి పైగా పాల్గొన్నారు. దాడి సమయంలో మాదక ద్రవ్యాలు లభించాయి. కొందరు దొరికిపోతామనే భయంతో స్విమ్మింగ్‌పూల్, టాయ్‌లెట్ తదితర స్థలాల్లోకి డ్రగ్స్ విసిరేశారు, వాటిని వెతకడానికి జాగిలాలను ఉపయోగించాం. రణదీర్, మహమ్మద్‌సిద్దికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబులను అరెస్టు చేసి విచారిస్తున్నాం. పార్టీలో సిద్దిక్, రణ«దీర్, రాజ్‌బావ డ్రగ్స్ విక్రయించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీబీ అదికారులు దాడి చేశారు. నటి హేమ కూడా పార్టీలో ఉంది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. ప్రతి ఒక్కరిని విచారించి సీసీబీ వాంగ్మూలం సేకరిస్తుంది. అందరితో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలుస్తాం’అని దయానంద్ తెలిపారు.నిందితుల అరెస్ట్రేవ్పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. రేవ్‌పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.వాసుది విజయవాడబెంగుళూరు డ్రగ్స్ పార్టీ వెనుక ఏపీ మూలాలు ఉన్నట్లు తేలింది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసు స్వస్థలం విజయవాడగా పోలీసులు ధృవీకరించారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో భాగమైన వాసు.. క్రికెట్ బెట్టింగ్‌లో ఆరితేరాడు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థ నడిపిస్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఈ మధ్యే ఖరీదైన స్థలాలు కొన్న వాసు గ్యాంగ్.. బెంగుళూరు పార్టీ కేంద్రంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. -
Bengaluru: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. మాజీ సీఎం రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైంది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇంటికి వస్తే సాయం చేశాను.. పోలీసులు కేసు పెట్టారు.. తనపై లైంగిక దాడి కేసు నమోదవడంపై యడ్యూరప్ప స్పందించారు. ఒక మహిళ కూతురిని తీసుకొని ఫిబ్రవరి 2వ తేదీన తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని చెప్పారు. ఆమెకు ఒక కేసు విషయంలో సాయం అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు స్వయంగా ఫోన్ చేశానని చెప్పారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆమె తనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించిందన్నారు. తర్వాత పోలీసులు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయా లేదా అనేది చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఇదీ చదవండి.. అవినీతి నిర్మూళనే మా సిద్ధాంతం.. మోదీ -
టెకీలకు మరో గండం..! ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే..
దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కఠినమైన నిబంధనలను అమలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కేరళ ఏఐ కెమెరాలతో ట్రాఫిక్ చలానాలు జారీ చేస్తూ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటే.. కర్ణాటక ఓ వినూత్న ఆలోచనను తెరమీదకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. వారికే చలానా జారీ చేయడం ఆనవాయితీ.. అయితే ఇప్పుడు బెంగళూరులో వచ్చిన ఓ కొత్త రూల్ ప్రకారం ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి ట్రాఫిక్ నియమాలను పాటించకుంటే ఆ సంస్థ బాస్‌కు చలాన్ అందజేస్తారు. ఈ విధానం త్వరలోనే అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ప్రయత్నంలో, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రత్యేకమైన చొరవతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ చొరవ కింద, సంస్థలో పనిచేసే వ్యక్తులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఉద్యోగుల ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి కంపెనీలకు తెలియజేస్తారు. 15 రోజుల కింద ప్రారంభమైన ఈ కొత్త కార్యక్రమం రోడ్డుకు రాంగ్ సైడ్‌లో టూ వీలర్ నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఐటీ కంపెనీ సిబ్బందిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుంది. నియమాలను అతిక్రమించిన వారి ఐడీ కార్డును తనిఖీ చేయడం ద్వారా వారు ఎక్కడ పనిచేస్తారనేది తెలుసుకుంటున్నారు. మహదేవపుర ట్రాఫిక్ పోలీస్ డివిజన్ పరిధిలోకి వచ్చే బెంగళూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్ మీదుగా ప్రస్తుతం డ్రైవ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. రైడర్లు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి స్పృహతో ఉన్నారో లేదో చూడటానికి మేము ఈ చొరవతో ప్రయోగాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఈ చొరవ మంచిదేనా? బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ కొత్త చొరవ చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ఇదో మార్గం అని తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నగానే ఉన్నప్పటికీ.. ఉద్యోగి భద్రత గురించి కంపెనీ అవగాహనా కల్పించే అవకాశం ఉంటుంది. -
రూ. 854 కోట్ల భారీ సైబర్ స్కామ్.. వేలాది మంది బాధితులు
పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి రూ.వందల కోట్లు కాజేసిన భారీ సైబర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. రూ. 854 కోట్ల సైబర్ ఫ్రాడ్ స్కామ్‌ను బెంగళూరు పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులను మోసం చేసిన ఆరుగురిని అరెస్టు చేసిన అధికారులు వారి నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వల.. నిందితుల ముఠా వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా బాధితులను ఆకర్షించింది. మొదట్లో రోజుకు రూ.1,000 నుంచి 5,000 వరకు లాభం వస్తుందని నమ్మించి బాధితుల నుంచి రూ.1,000 నుంచి 10,000 వరకు చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టించుకున్నారని పోలీసు అధికారి తెలిపారు. ఇలా వేలాది మంది బాధితులు రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారని వివరించారు. బాధితులు పెట్టుబడి పెట్టిన సొమ్మును కేటుగాళ్లు ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వివిధ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. అయితే, పెట్టుబడి ప్రక్రియ పూర్తయిన తర్వాత, బాధితులు ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు, వారికి ఎలాంటి వాపసు రాలేదని అధికారి తెలిపారు. మొత్తం సేకరించిన తర్వాత, నిందితులు ఏకీకృత డబ్బును మ్యూల్ ఖాతాలకు (మనీలాండరింగ్‌కు సంబంధించిన) మళ్లించారని పేర్కొన్నారు. బాధితుల నుంచి సేకరించిన మొత్తం రూ.854 కోట్లు క్రిప్టో (బినాన్స్), పేమెంట్ గేట్‌వే, గేమింగ్ యాప్‌ల ద్వారా వివిధ ఆన్లైన్ చెల్లింపు మోడ్‌లలోకి డంప్ చేశారని వివరించారు. -
అరేయ్.. ఏం మనుషులు రా మీరు!
బెంగళూరు: రోడ్డున పోతుంటే.. తమను చూసి మొరిగిందని ఓ శునకంపై దారుణానికి తెగబడ్డారు ఇద్దరు. దాని మెడకు ఉన్న చెయిన్‌తో ముందరి కాళ్లను బంధించి.. దుడ్డు కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక బాధతో అది మూలుగుతున్నా.. అడ్డుకునేందుకు చుట్టు పక్కలవాళ్లు ప్రయత్నించినా.. ఆ మూర్ఖుల తగ్గలేదు. ఈ ఘటనను వీడియో తీసేందుకు యత్నించిన వాళ్లను సైతం తోసేసి.. ఆ మూగజీవిపై దాడి చేశారు. ఇంతలో ఓనర్ అక్కడికి చేరుకుని నిలదీయడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈస్ట్ బెంగళూరు కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ లేఅవుట్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ శునకాన్ని.. యజమాని వెటర్నరీ హాస్పిటల్లో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇక వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. ఓనర్‌ను సంప్రదించగా ఫిర్యాదు చేయడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన వైరల్ కావడంతో.. ఆ మూర్ఖులను మూగజీవి ప్రేమికులు తిట్టిపోస్తున్నారు. -
బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
సాక్షి, బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి తిలక్‌నగరలో ఉంటున్న అస్సాంకు చెందిన అఖ్తర్ హుస్సేన్ లష్కర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. పదో తరగతి వరకు చదువుకున్న అఖ్తర్ యువతకు ఉగ్రవాద సంస్థలతో గల సంబంధాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఇతడి నుంచి ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సోమవారం మరో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. మంత్రికి షాక్ ఇచ్చిన కూతురు!
ప్రేమించిన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి కూతురని తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. హై ప్రొఫైల్ కేసుగా ఇప్పుడిది మీడియాకు ఎక్కింది. ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత.. తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె డాక్టర్ జయకళ్యాణి ప్రేమవివాహం చేసుకుంది. బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో సోమవారం సతీష్‌ను ఆమె వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఆరేళ్లుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ పని చేశామని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ కొత్త జంట.. బెంగళూరు సిటీ కమిషనర్ కమల పంత్‌ను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కిడ్నాప్ కేసు! కూతురు కనిపించకుండా పోయేసరికి మంత్రి శేఖర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో మంత్రి కూతురి కిడ్నాప్ తమిళ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారింది. ఇంకోపక్క పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈ లోపు పక్క రాష్ట్రంలో పోలీసుల ముందు ప్రత్యక్షమై ట్విస్ట్ ఇచ్చింది జయకళ్యాణి. బంధించారు.. వేధించారు సతీష్ ఆ ఇంటి డ్రైవర్. పైగా దళితుడు. కొన్ని నెలల క్రితం జయకళ్యాణిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి మంత్రి శేఖర్‌ను అడిగాడు. డ్రైవర్, పైగా కులాంతర వివాహం కావడంతో మంత్రి ఒప్పుకోలేదు. పైగా సతీష్‌ను రెండు నెలల పాటు తమిళనాడు పోలీసుల సాయంతో అక్రమంగా నిర్బంధించాడు కూడా. ఇందుకు సంబంధించి గతంలో సతీష్ రిలీజ్ చేసిన ఓ వీడియో మీడియా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని తెలిపింది జయకళ్యాణి. The News Minute సౌజన్యంతో వీడియో తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని.. కాబట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు ఆమె మీడియా ముందు పోలీసులను వేడుకుంటోంది. కాగా తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ మినిస్టర్ అయిన శేఖర్‌బాబు.. సీఎం స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్‌కు క్లీన్ చిట్
Hero Arjun Sarja Gets Clean Chit In Me Too Case After Three Years: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్ సర్జాకు క్లీన్ చిట్ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో అర్జున్‌పై అభియోగాలు వీగిపోయినట్లు బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించారు. కాగా మూడేళ్ల క్రితం అర్జున్‌పై శృతి హరిహరన్ అనే హీరోయిన్ మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగులో రిహార్సల్ సాకుతో అర్జున్ తనను కౌగిలించుకున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం తాజాగా అర్జున్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున అతనిపై ఉన్న అభియోగాలు ఎత్తివేస్తున్నట్లు తమ నివేదికలో రూపొందించారు. -
డ్రగ్ కేసు; వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు
ముంబై : నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో బెంగళూరు పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. శాండల్ డ్రగ్స్ కేసులో వివేక్ బావమరిది అదిత్య అల్వాకు సంబంధాలు ఉండటంతో పోలీసులు నేడు ముంబైలోని వివేక్ ఇంట్లో ఈ సోదాలు చేశారు. ఆదిత్య అల్వా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు బెంగుళూరు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. అదే విధంగా అతని బంధువైన వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సందీప్ ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అందుకే తనిఖీ చేసినట్లు వెల్లడించారు. కోర్టు నుంచి వారెంట్ పొందిన తర్వాతే క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం ముంబైలోని ఒబెరాయ్ ఇంట్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. కాగా అదిత్య సోదరి ప్రియాంకను అల్వాను 2010లో వివేక్ వివాహం చేసుకున్నారు. చదవండి: నేరస్తురాలిని కాను: అనుశ్రీ ఆవేదన కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు అయిన ఆదిత్య అల్వా కన్నడ సినీ ప్రముఖలకు, సింగర్స్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన శాండల్‌వుడ్ డ్రగ్స్ కుంభకోణం కేసులో పోలీసులు చర్య ప్రారంభించినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. మరోవైపు అధికారులు బెంగళూరులోని అదిత్య అల్వా ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది అరెస్ట్ అవ్వగా వీరిలో నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ ఉన్నారు. అలాగే రేవ్ పార్టీ నిర్వాహకుడు వీరెన్ ఖన్నా, రియల్టర్ రాహుల్ థోన్స్ కూడా ఉన్నారు. చదవండి: డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లకు షాక్ -
ఆ సమయంలో రెండో ఆప్షన్ ఉండదు: సీపీ
బెంగళూరు : షాద్‌నగర్ దిశ హత్యకేసులో నిందితులైన నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడాన్ని బెంగుళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావు సమర్థించారు. ‘సరైన సమయంలో సరైన చర్య’ అంటూ హైదరాబాద్ పోలీసులను ఆయన ప్రశంసించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్రిస్తే రెండవ అభిప్రాయం ఉండదని, నిందితులను చంపేయడమే సరైన పని అన్నారు. నవంబర్ 27న దిశను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు నిందితులను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెంగుళూరు కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజధానిలో జరిగిన ఈ దారుణ సంఘటన ఎక్కడైనా జరగవచ్చని, ఇలాంటి ఘటనల్లో నేరస్థులను పట్టుకుని సమస్యలను పరిష్కరించడానికి పోలీసులు తీవ్ర కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ కస్టడీ నుంచి నేరస్థులు తప్పించుకుంటే పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారని, హైదరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయం అనివార్యమని తెలిపారు. అలాగే సైబర్‌బాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కర్ణాటకలోని హుబ్బల్లి ప్రాంతానికి చెందినవారని గుర్తు చేశారు. ఒకప్పుడు తాను, సజ్జనార్ కలిసి పని చేశామని భాస్కర్ రావు ప్రస్తావించారు. చదవండి : చట్టం తన పని చేసింది, అంతా 5-10 నిమిషాల్లో దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ నలుగురు మృగాళ్ల కథ ముగిసింది.. -
తాగి కొడుతుంటే.. కాల్చేశాను!
బొమ్మనహళ్లి: నేనెందుకు నా భర్తపై కాల్పులు జరుపుతాను? తాగిన మైకంలో భర్త కొడుతుంటె నన్ను నేను రక్షించుకోవడం కోసం ఫైరింగ్ చేశానని శుక్రవారం సాయంత్రం భర్త సాయిరామ్ పైన కాల్పులు జరిపిన అతని భార్య హంసవేణి పోలీసుల విచారణలో తెలిపారు. శనివారం విచారణ కోసం చందాపుర సమీపంలోఉన్న సూర్య సిటి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆ విధంగా చెప్పారు. భర్త ఆరుపెగ్గులు, నేను బీర్లు తాగా ‘బ్యాంకు పని మీద నేను, నా భర్త సాయిరామ్ తో కలిసి హోసూరు వెళ్ళి హరళూరులో ఉన్న మా నివాసానికి తిరిగి వస్తున్నా. చందాపుర సమీపంలో రెస్టారెంటులో ఇద్దరం మద్యం తాగాం. భర్త ఆరు పెగ్గుల విస్కీ, నేను రెండు బీర్లు తాగాను. మద్యం తాగుతున్న సమయంలోనే మా ఇద్దరి మధ్య గొడవైంది. రెస్టారెంటులోనే రివాల్వర్ తీసి నా ముఖం మీద కొట్టాడు. దాంతో నాకు నోట్లోంచి, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. కారులో వెళ్తుంటే మళ్లీ గొడవైంది. నన్ను నేను రక్షించుకోవడం కోసం కాల్పులు జరిపాను. నాది బెంగళూరు, నా భర్తది ఆంధ్రప్రదేశ్. 27 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరివీ శ్రీమంతుల కుటుంబాలు కావడంతో ఇద్దరం కలిసి మందు తాగుతాం’ అని హంసవేణి చెప్పుకొచ్చింది. ఖాకీలకు ముప్పుతిప్పలు ప్రస్తుతం సాయిరామ్ చందాపుర స్పర్శ ఆస్పత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్నాడు. ఎద, కడుపులో మూడు బుల్లెట్లు దిగాయి. మరో 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. మద్యం మత్తులో, భర్త పైన ఫైరింగ్ చేసిన మత్తులో ఉన్న హంసవేణి పోలీసులతో కూడా గొడవకు సిద్ధపడ్డారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలం నుంచి తీసుకుని వెళ్తుండగా పోలీసులపై ఆమె మండిపడింది. భర్తను ఎందుకు షూట్ చేశావు చెప్పమ్మా అంటే నేనేమైనా మీకు అమ్మనా అంటూ, సరే, చెప్పండి మేడం అంటే.. నేనేమైనా మీకు టీచర్నా, స్కూళ్లో పాఠాలు చెప్పానా? అని ఆమె ఖాకీలనే నిందితురాలు ముప్పుతిప్పలు పెట్టింది. -
'వివస్త్రను చేయలేదు.. వీధుల్లో పరుగెత్తించలేదు'
బెంగళూరు: బెంగళూరులో టాంజానియాకు చెందిన విద్యార్థినిని వివస్త్రను చేశారని వచ్చిన వార్తలను కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర కొట్టిపారేశారు. అసలు ఆమెను వివస్త్రను చేయలేదని, వీధుల వెంట పరుగెత్తించలేదని చెప్పారు. బాధితురాలి పేరును కూడా ఆయన పత్రికా సమావేశంలో వెల్లడించారు. అయితే, మీరిలా బహిరంగంగా ఆ విద్యార్థిని పేరును వెల్లడించడం తప్పని అనిపించడం లేదా అని మీడియా ప్రశ్నించగా.. తానేమి అబద్ధం చెప్పడం లేదని అన్నారు. నిజాలే చెప్తున్నానని, ఇవన్నీ కూడా ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్నవేనని తెలిపారు. 'నేను చెప్పింది ఆమె పేరే. నేను నిజాలు ఎలా దాచగలను? ఆవిషయాలన్ని కూడా ఫిర్యాదులో ఉన్నాయి' అని ఆయన చెప్పారు. కొంతమంది పేర్కొంటున్నట్లు అది వివక్ష పూరిత దాడి కాదని, అది కేవలం ఒక రోడ్డు ప్రమాదంపట్ల అక్కడ ఉన్న జనం స్పందించిన తీరు కాస్తంత హింసాత్మకంగా మారిందని అన్నారు. భావోద్వేగానికి లోనవడంవల్లే అక్కడ దాడి జరిగిందని చెప్పారు. 'బెంగళూరులో మొత్తం 12వేలమంది విదేశీ విద్యార్థినులున్నారు. వారందరి రక్షణకు మేం పూర్తి హామీ ఇస్తున్నాం' అని హోంమంత్రి చెప్పారు. హోమంత్రి ప్రకటనకు ముందు తమ దేశ విద్యార్థినిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని టాంజానియా రాయభారి డిమాండ్ చేశారు. బెంగళూరులో రోడ్డు ప్రమాదానికి కారణమైన మరో వ్యక్తిని టాంజానియాకు చెందిన యువతి, ఆమె స్నేహితులు అని అనుకొని పొరబడి కొందరు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆ యువతిని వివస్త్రను చేశారని, వీధుల్లో పరుగెత్తించారని కూడా వార్తలు రావడంతో పెద్ద సంచలనంగా మారి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
బెంగళూరు ఘటనలో ఐదుగురి అరెస్ట్
బెంగళూరు: టాంజానియా యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి భౌతిక దాడికి పాల్పడిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం హెసరగట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో కూర్చున్న టాంజానియా యువతిపై స్థానికులు అవమానకరరీతిలో దాడి చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాంజానియా హై కమిషనర్ జాన్ కిజాజీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. టాంజానియా యువతిపై దాడి చేయడాన్ని అవమానకర ఘటనగా విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ పేర్కొన్నారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు.