'వివస్త్రను చేయలేదు.. వీధుల్లో పరుగెత్తించలేదు'
బెంగళూరు: బెంగళూరులో టాంజానియాకు చెందిన విద్యార్థినిని వివస్త్రను చేశారని వచ్చిన వార్తలను కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర కొట్టిపారేశారు. అసలు ఆమెను వివస్త్రను చేయలేదని, వీధుల వెంట పరుగెత్తించలేదని చెప్పారు. బాధితురాలి పేరును కూడా ఆయన పత్రికా సమావేశంలో వెల్లడించారు. అయితే, మీరిలా బహిరంగంగా ఆ విద్యార్థిని పేరును వెల్లడించడం తప్పని అనిపించడం లేదా అని మీడియా ప్రశ్నించగా.. తానేమి అబద్ధం చెప్పడం లేదని అన్నారు. నిజాలే చెప్తున్నానని, ఇవన్నీ కూడా ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్నవేనని తెలిపారు.
'నేను చెప్పింది ఆమె పేరే. నేను నిజాలు ఎలా దాచగలను? ఆవిషయాలన్ని కూడా ఫిర్యాదులో ఉన్నాయి' అని ఆయన చెప్పారు. కొంతమంది పేర్కొంటున్నట్లు అది వివక్ష పూరిత దాడి కాదని, అది కేవలం ఒక రోడ్డు ప్రమాదంపట్ల అక్కడ ఉన్న జనం స్పందించిన తీరు కాస్తంత హింసాత్మకంగా మారిందని అన్నారు. భావోద్వేగానికి లోనవడంవల్లే అక్కడ దాడి జరిగిందని చెప్పారు. 'బెంగళూరులో మొత్తం 12వేలమంది విదేశీ విద్యార్థినులున్నారు. వారందరి రక్షణకు మేం పూర్తి హామీ ఇస్తున్నాం' అని హోంమంత్రి చెప్పారు.
హోమంత్రి ప్రకటనకు ముందు తమ దేశ విద్యార్థినిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని టాంజానియా రాయభారి డిమాండ్ చేశారు. బెంగళూరులో రోడ్డు ప్రమాదానికి కారణమైన మరో వ్యక్తిని టాంజానియాకు చెందిన యువతి, ఆమె స్నేహితులు అని అనుకొని పొరబడి కొందరు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆ యువతిని వివస్త్రను చేశారని, వీధుల్లో పరుగెత్తించారని కూడా వార్తలు రావడంతో పెద్ద సంచలనంగా మారి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.