దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కఠినమైన నిబంధనలను అమలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కేరళ ఏఐ కెమెరాలతో ట్రాఫిక్ చలానాలు జారీ చేస్తూ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటే.. కర్ణాటక ఓ వినూత్న ఆలోచనను తెరమీదకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. వారికే చలానా జారీ చేయడం ఆనవాయితీ.. అయితే ఇప్పుడు బెంగళూరులో వచ్చిన ఓ కొత్త రూల్ ప్రకారం ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి ట్రాఫిక్ నియమాలను పాటించకుంటే ఆ సంస్థ బాస్‌కు చలాన్ అందజేస్తారు. ఈ విధానం త్వరలోనే అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ప్రయత్నంలో, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రత్యేకమైన చొరవతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ చొరవ కింద, సంస్థలో పనిచేసే వ్యక్తులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఉద్యోగుల ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి కంపెనీలకు తెలియజేస్తారు.
15 రోజుల కింద ప్రారంభమైన ఈ కొత్త కార్యక్రమం రోడ్డుకు రాంగ్ సైడ్‌లో టూ వీలర్ నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఐటీ కంపెనీ సిబ్బందిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుంది. నియమాలను అతిక్రమించిన వారి ఐడీ కార్డును తనిఖీ చేయడం ద్వారా వారు ఎక్కడ పనిచేస్తారనేది తెలుసుకుంటున్నారు.
మహదేవపుర ట్రాఫిక్ పోలీస్ డివిజన్ పరిధిలోకి వచ్చే బెంగళూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్ మీదుగా ప్రస్తుతం డ్రైవ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. రైడర్‌లు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి స్పృహతో ఉన్నారో లేదో చూడటానికి మేము ఈ చొరవతో ప్రయోగాలు చేస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఈ చొరవ మంచిదేనా?
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ కొత్త చొరవ చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ఇదో మార్గం అని తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నగానే ఉన్నప్పటికీ.. ఉద్యోగి భద్రత గురించి కంపెనీ అవగాహనా కల్పించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment