Traffic rules awareness
-
రాంగ్రూట్లో వెళ్తే.. ఇకపై కేసులే!
నిజామాబాద్: వాహనాలను రాంగ్రూట్లో నడిపినా, సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ హెచ్చరించారు. నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నగరంలోని 18 చోట్ల ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని సీపీ కేటాయించారని తెలిపారు. నగరంలోని వాహనాదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలన్నారు. అత్యవసరంగా ఫోన్ ఎత్తాల్సి వస్తే రోడ్డుపక్కన నిలిపి మాట్లాడాలని సూచింంచారు.మొదటి రోజు సోమవారం ఐదుచోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. మంగళవారం నుంచి 18 చోట్ల స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
టెకీలకు మరో గండం..! ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే..
దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కఠినమైన నిబంధనలను అమలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కేరళ ఏఐ కెమెరాలతో ట్రాఫిక్ చలానాలు జారీ చేస్తూ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటే.. కర్ణాటక ఓ వినూత్న ఆలోచనను తెరమీదకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. వారికే చలానా జారీ చేయడం ఆనవాయితీ.. అయితే ఇప్పుడు బెంగళూరులో వచ్చిన ఓ కొత్త రూల్ ప్రకారం ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి ట్రాఫిక్ నియమాలను పాటించకుంటే ఆ సంస్థ బాస్‌కు చలాన్ అందజేస్తారు. ఈ విధానం త్వరలోనే అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ప్రయత్నంలో, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రత్యేకమైన చొరవతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ చొరవ కింద, సంస్థలో పనిచేసే వ్యక్తులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఉద్యోగుల ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి కంపెనీలకు తెలియజేస్తారు. 15 రోజుల కింద ప్రారంభమైన ఈ కొత్త కార్యక్రమం రోడ్డుకు రాంగ్ సైడ్‌లో టూ వీలర్ నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఐటీ కంపెనీ సిబ్బందిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుంది. నియమాలను అతిక్రమించిన వారి ఐడీ కార్డును తనిఖీ చేయడం ద్వారా వారు ఎక్కడ పనిచేస్తారనేది తెలుసుకుంటున్నారు. మహదేవపుర ట్రాఫిక్ పోలీస్ డివిజన్ పరిధిలోకి వచ్చే బెంగళూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్ మీదుగా ప్రస్తుతం డ్రైవ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. రైడర్లు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి స్పృహతో ఉన్నారో లేదో చూడటానికి మేము ఈ చొరవతో ప్రయోగాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఈ చొరవ మంచిదేనా? బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ కొత్త చొరవ చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ఇదో మార్గం అని తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నగానే ఉన్నప్పటికీ.. ఉద్యోగి భద్రత గురించి కంపెనీ అవగాహనా కల్పించే అవకాశం ఉంటుంది. -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్ న్యూస్.. ఇక ఇంటికొస్తారు!
‘ఖెరతాబాద్ చౌరస్తాలో సిగ్నల్ జంపింగ్ చేసిన ఓ యువకుడు అదే జోష్‌లో రాయదుర్గంలోని తన ఇంటికి చేరుకున్నాడు. మర్నాటి మధ్యాహ్నం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అతడి ఇంటికి వచ్చారు. కౌన్సిలింగ్ చేయడంతో పాటు అతడి వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు కట్టించారు’. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ స్థితిగతులను మెరుగుపరచడం, రోడ్డు ప్రమాదాలను నిరోధించడం దృష్టి పెట్టిన ట్రాఫిక్ విభాగం అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని చౌరస్తాలు, జంక్షన్లలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారికి చెక్ చెప్పే విషయంలో వినూత్నంగా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా ఆ తరహా ఉల్లంఘనుల ఇంటికి పంపడానికి ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నామని సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రమాదాలు మూడు తరహాలు... ట్రాఫిక్ విభాగం అధికారులతో పాటు రహదారి భద్రత నిపుణులు సైతం రోడ్డు ప్రమాదాలను మూడు తరహాలకు చెందినవిగా చెబుతుంటారు. వాహనం నడిపే వ్యక్తి మాత్రమే ప్రమాదకరంగా పరిగణించేవి మొదటి రకమైతే.. ఎదుటి వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నవి రెండో తరహాకు చెందినవి. ఈ రెంటికీ మించి వాహన చోదకుడితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం జరగడానికి కారణమయ్యే వాటిని మూడో కేటగిరీగా పరిగణిస్తారు. సాధారణంగా ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ మూడో కోవకు చెందిన వాటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ నిరోధానికి చర్యలు తీసుకుంటూ ఉంటారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ.. నగరంలోని కొన్ని జంక్షన్లలో ఉల్లంఘనలకు పాల్పతుడున్న వారి వల్ల.. వారితో పాటు ఎదుటి వారికీ ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధానంగా సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, జిగ్‌జాగ్ డ్రైవింగ్ వంటి వైలేషన్స్ ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నట్లు గుర్తించారు. చౌరస్తాలు, జంక్షన్లలో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, ఫొటో, వీడియోలు తీయడానికి బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అదనపు సిబ్బందిని మోహరించనున్నారు. వీరు ఆ తరహా ఉల్లంఘనులను, వారి వాహనం నంబర్ ఆధారంగా చిరునామా గుర్తిస్తారు. వైలేషన్ చోటు చేసుకున్న మరుసటి రోజే ఉల్లంఘనుడి ఇంటికి వెళ్లడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. అక్కడిక్కడే వెరిఫై చేయడం ద్వారా ఆ వాహనంపై ఉన్న చలాన్లు గుర్తించి కట్టిస్తారు. జంక్షన్లలోనూ ప్రమాదాలు.. నగరంలో 2019– 21 మధ్య కాలంలో నగరంలో చోటుచేసుకున్న ప్రమాదాలను ట్రాఫిక్ విభాగం అధికారులు అధ్యయనం చేశారు. అవి జరిగిన సమయాలతో పాటు ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సిటీలోని అనేక జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద పెద్ద సంఖ్యలోనే ప్రమాదాలు జరిగినట్లు తేల్చారు. ద్విచక్ర వాహనచోదకులు జంక్షన్లలో చేస్తున్న ఉల్లంఘనల కారణంగానూ ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ వైలేషన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండింటికీ సమ ప్రాధాన్యం నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నిరోధానికీ సమ ప్రాధాన్యమిస్తున్నాం. అందులో భాగంగానే జంక్షన్లలో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, వారి ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ చేయడానికి ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తున్నాం. వాహన చోదకుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతో పాటు వారిలో బాధ్యత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
తల్లిదండ్రులు చేసే తప్పులపై చిన్నారుల నిఘా
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం మరో సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. తల్లిదండ్రులు పాల్పడే ఉల్లంఘనలు గుర్తించడానికి, వారికి ‘కౌన్సెలింగ్’ ఇవ్వడానికి ఉద్దేశించి ‘వీకాప్’ అనే విధానంతో ముందుకు వస్తోంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సంయుక్తంగా ఈ కాన్సెప్ట్‌ను అమలులోకి తీసుకువస్తున్నారు. దీన్ని నగర పోలీసు విభాగం మంగళవారం తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐఎన్) ఆడిటోరియంలో అధికారికంగా ఆవిష్కరించనుంది. నగరంలో రోజు రోజుకూ వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య పెరుగుతూపోతోంది. దీన్ని నిరోధించడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. వైలేషన్స్ చేసే వారిని గుర్తించి చలాన్లు జారీ చేయడం, తీవ్రమైన వాటిలో వాహనాలు సీజ్ చేయడంతో పాటు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపటం, మైనర్ డ్రైవింగ్ వంటి వైలేషన్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు బాధ్యుల్ని కోర్టుకు తరలిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిలో అనేక మంది ఎవరైనా తమ తప్పుల్ని ఎత్తి చూపితే వాటిని వీడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ బాధ్యతల్ని కేవలం పోలీసు విభాగమే భుజాన వేసుకోకుండా.. చిన్నారులకూ అప్పగించాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వీకాప్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రాథమికంగా ఐదు, ఆరు, ఏడు తరగతులు చదువుతున్న విద్యార్థుల్ని టార్గెట్‌గా చేసుకున్నారు. స్థానిక ట్రాఫిక్ విభాగం అధికారులు, విద్యాశాఖ, ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు కలిసి ఈ తరగతుల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, వాటి అమలుకు ఉన్న ప్రాధాన్యం ఉల్లంఘనలకు పాల్పడితే కలిగే నష్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఆపై తల్లిదండ్రులతో కలిసి, వారి వాహనాల్లో ప్రయాణించేప్పుడు ‘వీకాప్’ చిన్నారులే పోలీసుల పాత్ర పోషిస్తారు. డ్రైవింగ్ చేస్తున్న తన తల్లి లేదా తండ్రి చేసిన ఉల్లంఘనల్ని గుర్తిస్తారు. ఈ వివరాలను తమ వద్ద ఉండే రిపోర్ట్ కార్డ్‌లో నమోదు చేయడమే కాకుండా.. తమ తల్లిదండ్రులు చేస్తున్న ఉల్లంఘనలపై వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, లాభనష్టాలను వివరించి మరోసారి ఉల్లంఘనలకు పాల్పడకుండా అవగాహనకు ప్రయత్నించడం ఈ వీకాప్స్ ప్రధాన విధి. ఉల్లంఘనల్ని నమోదు చేసిన రిపోర్ట్ కార్డ్స్‌ను పాఠశాలతో సంబంధిత వారి ద్వారా స్థానిక ట్రాఫిక్ పోలీసులకు అందిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత వీకాప్స్ ఎంపిక, శిక్షణ చేపట్టనున్నారు. ఈ విధానం ఎంతో ఉపయుక్తం భద్రమైన ఇల్లు ఉంటేనే భద్రమైన సమాజం సాకారం అయ్యే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిఘా అనేది చిన్నారులకు అప్పగిస్తున్నాం. దీనికోసమే ప్రత్యేకంగా సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి వీకాప్ విధానం అమలు చేస్తున్నాం. వాహనం కలిగి ఉన్న ప్రతి తల్లిదండ్రీ కచ్చితంగా తమ పిల్లల్ని తీసుకుని వాటిపై ప్రయాణిస్తూ ఉంటారు. ప్రతి రోజూ పాఠశాలల వద్ద పిల్లల్ని దింపడానికే లక్షల మంది సొంత వాహనాల్లో బయటకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ చేసే తల్లిదండ్రులపై నిఘా ఉంచడానికి, వారు చేసిన ఉల్లంఘనల్ని గుర్తించడానికి, కౌన్సెలింగ్ ఇవ్వడంపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ విధానం వల్ల ఆయా చిన్నారులకూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఏర్పడి వాటి ప్రాధాన్యం తెలుస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో వాళ్లు బాధ్యతగల వాహనచోదకులుగా మసలుకుంటారు. – నగర పోలీసు అధికార -
హెల్మెట్ పెట్టుకోని వాళ్లకు బంపర్ ఆఫర్!
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంలో తమ రూటే సపరేటు అంటున్నారు భోపాల్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి వ్యాస రచన పోటీలు నిర్వహించి.. విజేతలకు ‘ప్రత్యేక బహుమతులు’ కూడా ప్రదానం చేయనున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వారు... ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ విషయమేమిటంటే... మధ్యప్రదేశ్‌లో శనివారం నుంచి 31 రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హెల్మెట్ ధరించకుండా బైకులు నడపడం, సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణించడం తరహా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను గురువారం రోడ్లపై నిలిపివేశారు. అనంతరం వారి చేతిలో పెన్ను- పేపర్ పెట్టి తామెందుకు హెల్మెట్ పెట్టుకోలేదో.. సీటు బెల్టు ఎందుకు ధరించలేదో తదితర కారణాలను వ్యాస రూపంలో రాయాల్సిందిగా కోరారు. వంద పదాల్లో వ్యాసం ముగించాలని.. ఈ పోటీలో అత్యుత్తమ వ్యాసాన్ని ఎంపిక చేసి వారికి హెల్మెట్లను ప్రదానం చేస్తామని చెప్పారు. ఈ విధంగా గురువారం ఒక్కరోజే దాదాపు 150 మంది చేత భోపాల్ ట్రాఫిక్ పోలీసులు వ్యాసం రాయించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి జరిమానా విధించే కంటే.. ఇలా సున్నితంగా అర్థమయ్యేలా చెప్పడమే సులభమైన మార్గంగా తోచిందని డీఐజీ ఇర్షాద్ వలీ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు వాహనదారుల్లో తప్పక మార్పు తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ ‘వ్యాస రచన పోటీ’లకు సంబంధించిన వార్తలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక మోటారు వాహన సవరణ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నిబంధనలు ఉల్లంఘించిన వారి జేబుకు చిల్లులు పడుతున్న సంగతి తెలిసిందే. -
నా కొడుకు అయినా సరే.. మంత్రి పేర్ని నాని
సాక్షి, విజయవాడ : రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అందరూ అవగాహన పెంచుకోవాలని రవాణ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం ఆయన విజయవాడలో రవాణ శాఖ, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేఫ్టి డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... సేఫ్టి డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సెంటర్లో ప్రతి రోజు సురక్షిత ప్రయాణం ఎలా అనే అంశంపై శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. రోజుకి వంద మందికి శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ క్లాసులన్ని ఉచితంగా అందిస్తామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ట్రైనింగ్ తీసుకోకుండా ఎవరికి ఎల్ఎల్ఆర్(లర్నింగ్ లైసెన్స్) ఇవ్వటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. చివరకు తన కొడుకు అయినా సరే కోచింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎల్ఎల్ఆర్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంది : ఎమ్మెల్యే మల్లాది ప్రమాదాలు నివారించడానికి, ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువస్తున్న సంస్కరణ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. -
ఈ సైనికుడు మంచి సేవకుడు
సాక్షి,కాకినాడ : విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని ఏ ఉద్యోగి అయినా కోరుకుంటారు. దేశ సేవలో 13 ఏళ్లు పనిచేసిన ఆ సైనికుడు విశ్రాంత జీవితాన్నీ సమాజం కోసం వెచ్చించాలని భావించి పోలీసు శాఖలో చేరి ట్రాఫిక్ విభాగంలో ఇతోథికంగా సేవ చేస్తున్నారు. కాకినాడ నగరానికి చెందిన బులుసు విశ్వేశ్వరరావు బీఎస్ఎఫ్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన సేవా దృక్పథం, సైనికుడిగా పొందిన శిక్షణలో క్రమశిక్షణను ప్రజలలో ఇసుమంతైనా అలవాటు చేయాలని తలచారు. అందుకు పోలీసు శాఖను ఎంచుకుని స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకు వచ్చి ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే కాకినాడ టౌన్‌హాల్ వద్ద జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ సేవకుడిగా తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారికి ఆ నిబంధనలు బంధనాలు కావని, స్వీయ రక్షణ కోసమని ఎంతో వినయంగా వారికి వివరిస్తున్నారు. దీంతో నిత్యం ఆ మార్గంలో వచ్చి వెళ్లే వాహనచోదకులకు ఆయన సుపరిచితుడయ్యారు. జీతం ఇస్తామన్నా వద్దని.. ట్రాఫిక్ నియంత్రణకు స్వచ్ఛందంగా వచ్చిన విశ్వేశ్వరరావు ఎటువంటి జీతం, భత్యం ఆశించకుండానే తన విధి నిర్వహణను కొనసాగిస్తున్నారు. నెలవారీ జీతం వచ్చే ఏర్పాటు చేస్తామని ఎందరు ఎస్పీలు సూచించినా ఆయన ససేమిరా అంటారు. నిబంధనలు అతిక్రమించి వెళ్లేవారికి తన సూచనలు సలహాలు నచ్చి కృతజ్ఞతతో శభాష్ సార్, థాంక్యూ సార్ అంటూ ఇచ్చే మెచ్చుకోళ్లే తనకు సంతృప్తిని ఇస్తాయని, ప్రోత్సాహాన్నిస్తాయని అంటారు విశ్వేశ్వరరావు. దేశ సేవలో ఒక రకమైన సంతృప్తి ఉంటే, ట్రాఫిక్ నియంత్రణ ద్వారా సమాజ సేవలో లభించే సంతృప్తి మరో రకమైనదని ఆయన గర్వంగా చెప్తారు. -
ట్రాఫిక్ పాఠాలు చెప్పిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతహాగా ఐపీఎస్ అధికారి. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొరడా ఝుళిపిస్తున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ సర్కారుకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు చాలా కాలం తర్వాత తనలోని ఐపీఎస్‌ను బయటకు తీశారు కిరణ్ బేడీ. సోమవారం నుంచి పుదుచ్చేరిలో హెల్మెట్ తప్పనిసరి చేశారు. అలాగే, సీట్ బెల్ట్ ధరించాల్సిందేనన్న హుకుం జారీ అయింది. ఉదయం నుంచే హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అన్నది అమల్లోకి రావడంతో కిరణ్ ఐపీఎస్ అవతారం ఎత్తక తప్పలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా, అవగాహన కల్పించే విధంగా పుదుచ్చేరిలోని పలు మార్గాల్లో ఆమె తిష్ట వేశారు. పోలీసులతో కలిసి వాహనదారులను బెంబేలెత్తించారు. హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్లను పిలిచి మరీ క్లాస్ పీకారు. పరిమితిని మించి ఓవర్ లోడింగ్‌తో సాగే వారి భరతం పట్టారు. ఓ మోటార్ సైకిల్ మీద ఇద్దరు మహిళల్ని ఎక్కించుకుని ఓ యువకుడు రాగా, అతిడికి తీవ్రంగానే క్లాస్ పీకారు. వెనుక ఉన్న మహిళల్లో ఓ యువతిని కిందకు దించేశారు. బస్సులో వెళ్లమని సలహా ఇచ్చారు. ఇక పిల్లల్ని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్లకు అయితే, కిరణ్ క్లాస్ ముచ్చెమటలు పట్టించక తప్పలేదు. సీట్ బెల్ట్ ధరించకుండా కార్లు నడిపిన వాళ్లను వదలి పెట్టలేదు. మంగళవారం నుంచి హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని హెచ్చరించి పంపించారు. -
ప్రమాదాల నుంచి కాపాడేందుకే ఈ–చలాన్
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడేందుకే ఈ–చలాన్ ప్రారంభించినట్లు ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. శుక్రవారం మెదక్‌లోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద గల ప్రధాన రహదారి చౌరస్తాలో ఈ–చలాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో శుక్రవారం నుండి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు, ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఈ–చలాన్ అనే కొత్త వ్యవస్థ ద్వారా జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రజలను ప్రమాదాల నుండి కాపాడేందుకు, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఈ–చలాన్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ–చలాన్ ద్వారా రెండు పద్ధతుల్లో జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. కాంటాక్ట్ పద్ధతి, రెండోవది ట్రాఫిక్ నిబందనలు అతిక్రమించిన వారి ఫొటోలను ట్యాబ్‌లో తీసి ఈ టికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మూడుసార్లకు మించినట్లయితే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాన్ని గుర్తించి, వాహనదారుడికి సంబంధించిన ఏదైనా గేట్వేస్ ద్వారా చెల్లించిన తరువాతే వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ–చలాన్లు చెల్లించని వారికి స్పీడ్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఆ వాహనదారులు ఫైన్ చెల్లించకుంటే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామన్నారు. ఈ టికెట్లో చూపించిన జరిమానాను ఏడు రోజుల్లో మీసేవ, ఈ సేవల ద్వారా చెల్లించాలని చెప్పారు. వాహనదారుడు మూడుసార్లు చెల్లించనట్లయితే 4వ సారి వాహనం సీజ్ చేస్తామన్నారు. ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో నాన్ కాంటాక్ట్ పద్ధతిలోనే ఈ–చలాన్ విధించనున్నట్లు చెప్పారు. ఈ–చలాన్ ద్వారా విధించిన టికెట్‌ను డైరెక్ట్ ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్బీ సీఐ మల్లికార్జున్‌రెడ్డి, ఐటీకోర్ సీఐ గోవర్ధన్‌గిరి, డీసీఆర్బీ సీఐ చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మెదక్‌లో ఈ–చలాన్ ప్రారంభం
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రం మెదక్‌లో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని, అందుకే రోడ్డుపై తోపుడు బండ్లు, ఇతర వాహనాలు పెట్టకుండా చేస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పట్టణ సీఐ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మెదక్‌పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి జె.ఎన్.రోడ్డు, పెద్దబజార్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలోనే అధికంగా ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని ఆయన తెలిపారు. ఈ విషయమై రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లు, ఇతర పుట్‌పాత్ వ్యాపారులతో చర్చించారు. రెండు, మూడు రోజుల్లో ఈ–చలాన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎవరైన రోడ్డుపై తోపుడు బండ్లుగాని, ఇతర వాహనాలు పెడితే జరిమాన విధిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య నివారణకోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై రాందాస్ చౌరస్తా నుంచి జె.ఎన్.రోడ్డు వరకు వన్‌వేగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి చమన్ మీదుగా రాందాస్చౌరస్తాకు కలుపనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లో పూర్తి ప్రణాళిక విడుదల చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు ఉన్నారు. -
మీకో దండం.. ఎందుకీ ‘గండం’
మడకశిర: అనంతపురం జిల్లాలో రోడ్డు నిబంధనలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. మడకశిర సీఐ శుభకుమార్ కూడా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. సోమవారం ఆయన ఓ కేసు విచారణ నిమిత్తం మడకశిర నుంచి అమరాపురం మండలంలోని వి.అగ్రహారానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నలుగురిని కూర్చోబెట్టుకుని మడకశిరకు వస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన సీఐ వెంటనే వాహనాన్ని ఆపి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తా.. ఇలా చేయొద్దు.. అని వేడుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు వాహనదారుల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు, సీట్ బెల్టులు పెట్టుకోని కారు డ్రైవర్లకు ఇంధనాన్ని సరఫరా చేయరాదంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించని వారికి పెట్రోల్, డీజిల్ పోయరాదని పెట్రోల్ బంకుల యాజమన్యాలను సూచించింది. -
ఇదో రకం శిక్ష
సాక్షి, లక్నో : నిబంధనలు మన మంచికేనన్నది తెలిసి కూడా వాటిని ఉల్లంఘించటం కొందరికి అలవాటుగా మారింది. గతేడాది దేశవ్యాప్తంగా నమోదయిన రోడ్డు ప్రమాదాల్లో 84 శాతం ఉత్తర ప్రదేశ్‌లోనే నమోదయి జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. వీటిలో 55 శాతం హెల్మెట్ ధరించకపోవటంతో జరిగినవే. ఈ నేపథ్యంలో ఆదివారం అక్కడి పోలీస్ శాఖ ఓ పని చేసింది. హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారికి ఫైన్ వేయకుండా వారి భార్యలను అక్కడికి పిలిపించింది. ఆపై మహిళల చేతుల మీదుగా వారి భర్తలకు హెల్మెట్లు తొడిగించింది. కర్వా చౌత్ పండగ సందర్భంగా పోలీసులు ఈ పని చేయించారు. ఇందుకోసం తమ సొంత నిధులనే ఖర్చు చేశారు పోలీసులు. ‘భర్తలు బాగుండాలని కోరుకుంటూ పెళ్లయిన ఆడవాళ్లంతా తప్పనిసరిగా చేసుకునే పెద్ద పండుగ ఇది. అందుకే వారి చేతుల మీదుగా ప్రాణాల విలువ తెలియజేసేలా ఈ పని చేయించాం. వాహనదారులకు మేం చేసే సూచన ఒక్కటే దయచేసి హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకండి’ అని ఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు. -
పూలు పంచి... చైతన్యం పెంచి!
పంజగుట్ట: కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని గ్రేటర్ తెలంగాణ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పంజగుట్ట కూడలి వద్ద అమరవీరులను స్మరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య చిత్రపటాన్ని చూపుతూ వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, హెల్మెంట్, కార్ సీటు బెల్ట్ పెట్టుకోవాలని కోరుతూ పూలు, కరపత్రాలు పంచిపెట్టారు. అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జోగీందర్ సింగ్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.