సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతహాగా ఐపీఎస్ అధికారి. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొరడా ఝుళిపిస్తున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ సర్కారుకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు చాలా కాలం తర్వాత తనలోని ఐపీఎస్‌ను బయటకు తీశారు కిరణ్ బేడీ. సోమవారం నుంచి పుదుచ్చేరిలో హెల్మెట్ తప్పనిసరి చేశారు. అలాగే, సీట్ బెల్ట్ ధరించాల్సిందేనన్న హుకుం జారీ అయింది. ఉదయం నుంచే హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అన్నది అమల్లోకి రావడంతో కిరణ్ ఐపీఎస్ అవతారం ఎత్తక తప్పలేదు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా, అవగాహన కల్పించే విధంగా పుదుచ్చేరిలోని పలు మార్గాల్లో ఆమె తిష్ట వేశారు. పోలీసులతో కలిసి వాహనదారులను బెంబేలెత్తించారు. హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్లను పిలిచి మరీ క్లాస్ పీకారు. పరిమితిని మించి ఓవర్ లోడింగ్‌తో సాగే వారి భరతం పట్టారు. ఓ మోటార్ సైకిల్ మీద ఇద్దరు మహిళల్ని ఎక్కించుకుని ఓ యువకుడు రాగా, అతిడికి తీవ్రంగానే క్లాస్ పీకారు. వెనుక ఉన్న మహిళల్లో ఓ యువతిని కిందకు దించేశారు. బస్సులో వెళ్లమని సలహా ఇచ్చారు.
ఇక పిల్లల్ని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్లకు అయితే, కిరణ్ క్లాస్ ముచ్చెమటలు పట్టించక తప్పలేదు. సీట్ బెల్ట్ ధరించకుండా కార్లు నడిపిన వాళ్లను వదలి పెట్టలేదు. మంగళవారం నుంచి హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని హెచ్చరించి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment