puducherry leftinent governor
-
కిరణ్ బేడీకి షాక్!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాలను ఎంతో సన్నిహితంగా గమనిస్తున్నవారిని సైతం ఆశ్చర్యపరిచే పరిణామం ఇది. అక్కడ ముఖ్యమంత్రి నారాయణస్వామి సారథ్యంలో కొనసాగుతున్న ప్రభుత్వం మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వరకూ వుంటుందా...ఈలోగానే ఎమ్మెల్యేల రాజీనామాలతో కుప్పకూలుతుందా అని అందరూ ఆసక్తికరంగా చూస్తుండగా, ఎవరూ ఊహించని విధంగా అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పదవి కోల్పోయారు. వాస్తవానికి ఆమె అయిదేళ్ల పదవీకాలం కూడా మరో మూడు నెలల్లో ముగియాల్సివుంది. కానీ ఆమెను అలా సజావుగా రిటైర్ కానీయకుండా... కనీసం రాజీనామా చేయమని కూడా కోరకుండా ఉద్వాసన పలికి కేంద్రం భిన్నంగా వ్యవహరించింది. గవర్నర్లుగా వున్నవారికీ, ముఖ్యమంత్రులకూ పడని సంద ర్భాలు చోటుచేసుకోవటం కొత్తేమీ కాదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి చెందిన ప్రభు త్వాలుంటే ఈ వివాదం వుండదు. అలాగని విపక్షాలు ఏలుతున్న రాష్ట్రాలన్నిటా కూడా ఆ పరిస్థితి లేదు. గతంలో ఢిల్లీలో తరచుగా, ఈమధ్య పశ్చిమ బెంగాల్లో అప్పుడప్పుడు ఆ మాదిరి సమస్యలు ఏర్పడ్డాయి. ఇటీవలికాలంలో ఢిల్లీలో వివాదాలేమీ లేవనే చెప్పాలి. కానీ పుదుచ్చేరిలో అలా కాదు. 2016 మే నెలలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా వచ్చింది మొదలు కిరణ్ బేడీ నిరంతరం వివాదాల్లోనే వున్నారు. తనను తొలగించాక రాష్ట్ర ప్రజలనుద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో లెఫ్టినెంట్ గవ ర్నర్గా రాజ్యాంగపరమైన, నైతికపరమైన బాధ్యతల్ని పవిత్ర కర్తవ్యంగా భావించి నిర్వర్తించినట్టు చెప్పుకున్నారు. ఆమె నిజంగా అలా అనుకునే ఈ నాలుగున్నరేళ్లూ పనిచేసివుండొచ్చు. కానీ ప్రజ లంతా అలా అనుకునేలా వ్యవహరించివుంటే వేరుగా వుండేది. దేశంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ అందరికీ గుర్తుండిపోతారు. ఐపీఎస్ అధికారిగా ఆమె అందరి మన్ననలూ పొందిన సందర్భాలున్నాయి. అలాగే శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన అతి చిన్న అంశాల్లో అతిగా స్పందించి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలున్నాయి. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బ్రహ్మాండమైన రాజకీయ ఎత్తుగడగా లెక్కేసుకుని కిరణ్ బేడీని పార్టీలో చేర్చు కోవటమేకాక, ఆమెను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించి బీజేపీ అధిష్టానం భంగపడింది. అయినా ఆ మరుసటి సంవత్సరం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ అవకాశం వచ్చింది. కానీ అక్కడ కూడా అంచనాలకు తగినట్టు ఆమె వ్యవహరించలేకపోయారు. కిరణ్ బేడీ తీరును నిరసిస్తూ 2019 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి వారం రోజులపాటు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట ధర్నా సాగించిన సంగతిని ఎవరూ మరిచి పోరు. చివరకు సుదీర్ఘ చర్చలు నడిచి రాజీ కుదిరింది. కానీ ఆ తర్వాతైనా పెద్దగా మారిందేమీ లేదు. ప్రజలెన్నుకున్నవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాలా, లెఫ్టినెంట్ గవర్నర్‌గా వున్నవారు సొంత చొరవతో దూసుకుపోతూ సమాంతరంగా పెత్తనం సాగించాలా అన్న వివాదం పుదుచ్చేరిలో చాన్నాళ్లుగా సాగుతోంది. పారిశుద్ధ్యం నుంచి అవినీతి వరకూ సమస్యలు తలెత్తినచోటల్లా కిరణ్ బేడీయే ప్రత్యక్షమవుతూ అధికారులకు ఆదేశాలు జారీచేయటం, వారిని మందలించటం వంటివి చేస్తుంటే జనం దృష్టిలో ప్రభుత్వం దోషిగా మారిన సందర్భాలున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నత్తనడకన పనులు సాగుతుండటం కిరణ్ బేడీలో అసహనం కలిగించి వుండొచ్చు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే వేరుగా వుండేది. అధికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరించేవారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీరు జన సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆటంకంగా మారిందని నారాయణస్వామి ఒకమారు ఆరోపించారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఇద్దరి మధ్యా కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధానికి అంతేలేదు. ఆఖరికి నూతన సంవత్సర వేడుకలు ప్రజలు జరుపు కోవాలా, వద్దా అనే అంశంలోనూ ప్రభుత్వానికీ, ఆమెకూ మధ్య ఏకాభిప్రాయం లేదు. కరోనా కారణంగా ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని కిరణ్ బేడీ విజ్ఞప్తి చేయగా... కొన్ని శక్తులు ఈ వేడుకలను అడ్డుకోవాలని చూసినా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారంటూ ఆ మర్నాడు నారాయణస్వామి ప్రకటించారు. కిరణ్ బేడీని తొలగించాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు వినతిపత్రం కూడా ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తీరు పెద్ద చర్చనీయాంశంగా మారితే అది అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి నష్టం చేకూరుస్తుందని కేంద్రంలోని పెద్దలు భావించటం వల్లే తాజా పరిణామం చోటుచేసుకుందన్నది కొందరి విశ్లేషణ. అందులో నిజం లేకపోలేదు. ద్విచక్ర వాహనదారులకు తక్షణం హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలనడం, రేషన్ దుకాణాల్లో సరుకులిచ్చే బదులు నగదు బదిలీ చేయాలని కిరణ్ బేడీ పట్టుబట్టడం అధికార కూటమికి మాత్రమే కాదు... విపక్షానికి కూడా మింగుడు పడలేదు. ఎన్నికలు ముంగిట్లో వుండగా ఆమె ఇలా వ్యవహరించటం వల్ల కొంపమునుగుతుందని, కేందమ్రే ఆమెతో అలా చేయిస్తున్నదని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విపక్షం భయపడింది. మొత్తానికి కిరణ్‌బేడీ పదవిలో వున్నçప్పటిలాగే పోగొట్టుకోవటంలోనూ సంచలనం సృష్టిం చారు. ఇక ఇన్నాళ్లూ ఆమెతో ఎడతెగని వివాదాల్లో చిక్కుకుని ప్రస్తుతం మైనారిటీలో పడిన నారాయణస్వామి సర్కారు పూర్తి పదవీకాలం పూర్తి చేసుకుంటుందా... కిరణ్ బేడీ తరహాలో ముందుగానే అధికారం నుంచి వైదొలగవలసి వస్తుందా అన్నది ఒకటి రెండురోజుల్లో తేలిపోతుంది. -
పాపాయితో హైలెవల్ మీటింగ్‌కి
పుదుచ్చేరిలోని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆఫీస్‌లో మంగళవారం అత్యవసర సమావేశం జరుగుతోంది. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడి! వివిధ శాఖల కార్యదర్శులు ఈ హైలెవల్ మీటింగ్‌కి హాజరయ్యారు. వారిలో ఐటీ శాఖ నుంచి వచ్చిన ఓ మహిళా కార్యదర్శి కూడా ఉన్నారు. సమావేశం గంభీరంగా సాగుతోంది. అంతలో.. మీటింగ్ హాలు బయట నుంచి పసిబిడ్డ ఏడుపు! ఆ ఏడుపు వింటూ మహిళా కార్యదర్శి స్థిమితంగా ఉండలేకపోయారు. అది గమనించారు కిరణ్ బేడి. ‘ఏమైంది?’ అన్నట్లు ఆమె వైపు చూశారు. ‘‘బయట ఏడుస్తున్నది నా కూతురే. పది నెలలు. నేను కనిపించకపోతే ఏడ్చేస్తుంది. వాళ్ల అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టి వచ్చాను’’ అని చెప్పారు ఆ ఆఫీసర్. పసికందు ఏడుపు ఆపడం లేదు. ‘‘వెళ్లి పాపను తెచ్చుకోండి’’ అన్నారు కిరణ్ బేడీ. ఆమె ముఖంలో సంతోషం. పరుగున వెళ్లి, పాపను ఎత్తుకుని తనతోపాటు లోపలికి తెచ్చుకుంది. ఆమె రాగానే మళ్లీ మీటింగ్ మొదలైంది. తల్లి ఒడిలో కూర్చొని ఉన్న పాప కూడా ఏడుపు మాని కిరణ్ బేడీ వైపే గంభీరంగా చూడ్డం మొదలు పెట్టింది. ఆ తల్లీ బిడ్డల ఫొటోను కిరణ్ బేడీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అని కామెంట్ రాశారు. స్ట్రిక్ట్ ఆఫీసర్ అని కిరణ్‌బేడీకి పేరు. దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారి. కుటుంబ బాధ్యతల వల్ల మహిళలు ఉద్యోగాలను సరిగా చేయలేరు అనే మాటను కిరణ్ ఒప్పుకోరు. బిడ్డ ఏడుస్తుంటే పనిపై ధ్యాసపెట్టడం తల్లికి కష్టమే. బిడ్డ దగ్గర ఉంటే ఆ తల్లి ఇంకా బాగా పనిచేస్తుంది అంటారు ఆమె. ఇప్పుడీ ట్విట్టర్లో కూడా కిరణ్ బేడీ ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అన్నారు కానీ.. ‘మదర్ ఈజ్ హ్యాపీ’ అని అనలేదు. దానర్థం.. పిల్లల లాలన కూడా డ్యూటీలో భాగమేనని. పిల్లల బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. వాళ్లసంతోషం తల్లిని సంతోషంగా ఉంచుతుంది. పనిలో తల్లి సామర్థ్యాన్ని పెంచుతుంది. -
గవర్నర్ల పంచాయతీ
మన దేశంలో గవర్నర్ల వ్యవస్థ తీరుతెన్నులెలా ఉన్నాయో చెప్పడానికి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు–ఢిల్లీ, పుదుచ్చేరిలను ఎప్పుడైనా ఉదాహరించవచ్చు. ఆ రెండుచోట్లా ముఖ్యమంత్రు లకూ, లెఫ్టినెంట్ గవర్నర్లకూ మధ్య సయోధ్య వాతావరణం కనబడటం చాలా అరుదు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంతో అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు ఎప్పుడూ పొసగదు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ నేతృత్వంలోని నారాయణ స్వామి ప్రభుత్వానికీ, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకీ మధ్య కూడా ఇదే తీరు ఉంటుంది. సివిల్ సర్వీస్ అధికారులపై ఎవరికి నియంత్రణ ఉండాలన్న వివాదంలో ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఢిల్లీ వివాదం మొదటికొచ్చింది. తమకు కనీసం బంట్రోతును నియమించుకునే అధికారం సైతం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశమని, ఇది అత్యంత అప్రజాస్వామికమని కేజ్రీవాల్ అంటున్నారు. యధాప్రకారం ఈ తీర్పు బీజేపీకి, అనిల్ బైజాల్‌కు నచ్చింది. అటు పుదుచ్చేరిలో ఆరు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి నారాయణస్వామి సాగిస్తున్న ధర్నా సోమవారం అర్థరాత్రి చర్చల పర్యవసానంగా రాజీ కుదరడంతో ముగిసింది. తమ ప్రభుత్వం ప్రారంభించతలపెట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రతిపాదనలను కిరణ్ బేడీ బుట్టదాఖలా చేస్తున్నారని ఆరోపిస్తూ మొన్న 13న ఆయన ఈ ధర్నా ప్రారంభించారు. స్వయంగా సుప్రీంకోర్టే చెప్పినా, సర్కారియా కమిషన్ వంటివి మొత్తుకున్నా కాస్తయినా మారకుండా కొనసాగుతున్నది గవర్నర్ల వ్యవస్థే. మిగిలిన వ్యవస్థలు కాలానుగుణంగా ఏదోమేరకు మార్పు చెందుతూ వచ్చాయి. గవర్నర్ పదవి రాజ్యాంగపరమైనది. ఆ పదవిలో రాజకీయ నాయ కులుంటే సమస్యలెదురవుతున్నాయని భావించి, వాటికి అతీతంగా ఉండేవారిని గవర్నర్లుగా ఎంపిక చేయడం ఉత్తమమని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఆ పదవికుండే ఔన్నత్యం నిల బడాలంటే భిన్న రంగాల్లో నిష్ణాతులైనవారిని ఎంచుకోవాలని, వారు తటస్థులైతే మంచిదని సర్కా రియా కమిషన్ అభిప్రాయపడింది. అటు తర్వాత కొన్ని రాష్ట్రాలకు అలాంటివారిని ఎంపిక చేసిన మాట వాస్తవమే. కానీ వారిలో చాలామంది తాము రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోబో మని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో అనిల్ బైజాల్, పుదుచ్చేరిలో కిరణ్‌బేడీలు ఆ కోవలోని వారే. సాధారణంగా ప్రభుత్వాలు రిటైరైన ఐఏఎస్, ఐపీఎస్‌లను ‘భిన్నరంగాల్లో నిష్ణాతులు’గా భావిస్తాయి. సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నచోట గవర్న ర్లకూ, ముఖ్యమంత్రులకూ మధ్య విభేదాలు తలెత్తవు. ఉన్నా అవి తెరవెనకే సమసిపోతాయి. కానీ అక్కడా, ఇక్కడా వేర్వేరు ప్రభుత్వాలున్నప్పుడు... వాటి మధ్య రాజకీయంగా తీవ్ర స్థాయిలో విభే దాలున్నప్పుడు గవర్నర్ల పనితీరు ప్రశ్నార్థకమవుతోంది. గతంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ దాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా, అటుపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు వచ్చినా ఢిల్లీలో సీఎం–లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య లడాయి కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకునే ప్రభుత్వాలకు అధికారాలుండి తీరాలి. ఆ విషయంలో రెండో మాట ఉండకూడదు. కానీ ఢిల్లీలో నెలకొన్న ‘ప్రత్యేక పరిస్థితుల’వల్ల అక్కడ ఎన్నికైన ప్రభు త్వానికి సంపూర్ణ అధికారాలీయడం సాధ్యం కాదని నిబంధనలు చెబుతున్నాయి. వాటినే సుప్రీం కోర్టు ధ్రువీకరించింది. అయితే ఉన్నంతలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అభిప్రాయాలకు విలువీయా లని, దాని సూచనలు పాటించాలని నిరుడు జూలైలో ఇచ్చిన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదన్నది ఆ తీర్పు సారాంశం. కానీ అందులో ఓ మెలిక ఉంది. కేబినెట్ తీసుకునే ఏ నిర్ణయాన్నయినా ఆయన తన కున్న రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతిరేకించడానికి, తుది నిర్ణయం కోసం రాష్ట్రపతికి నివే దించడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆ అధికారాన్ని యాంత్రికంగా వినియోగించరాదని హితవు చెప్పింది కూడా. కానీ ఏది యాంత్రికమో, ఏది కాదో చెప్పేదెవరు? దాని సంగతలా ఉంచి గత జూలైలో ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీ ప్రభుత్వంలో ఏర్పడ్డ ఉత్సాహం కాస్తా తాజా తీర్పుతో ఆవిరైంది. అవినీతి నిరోధక విభాగంపైనా, విచారణ కమిషన్ల ఏర్పాటుపైనా, ఉన్నతాధికార వర్గం బదిలీలు, నియామకాలైనా కేంద్రం పరిధిలోనే ఉంటాయని ఇద్దరు న్యాయ మూర్తులూ తేల్చారు. అయితే జాయింట్ సెక్రటరీకన్నా కిందిస్థాయి సిబ్బంది ఎవరి నియంత్రణలో ఉండాలన్న అంశంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్యా ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల విషయం విస్తృత ధర్మాసనానికి వెళ్లింది. రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారు పరిధులు అతిక్రమించే పరిస్థితులు ఉత్పన్నమైతే తప్ప వారి అధికారాలకు పరిమితులు విధించడం సరికాదు. ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతమే అయినా దేశ రాజధానిగా దానికి ప్రత్యేకత ఉన్నదని భావించి అక్కడి భూముల వ్యవహారం, పోలీస్ శాఖ, శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రం పరిధికింద ఉంచారు. అలాగని ఢిల్లీ ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ స్థాయికి దిగజార్చడం ప్రజల తీర్పును అవమానించడమే. ఆచరణలో నిబంధనలు ప్రతిబంధ కంగా మారితే వాటిని మార్చుకోవాలి. అంతేతప్ప వాటిని సాకుగా చూపి ఆధిపత్య ధోరణులు ప్రదర్శించకూడదు. వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చి ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన కాలంలో అధికారాలను తమ గుప్పెట్లో ఉంచుకోవాలని ఎవరికి వారు తహతహలాడటం అనా రోగ్యకరమైన ధోరణి. ఢిల్లీ, పుదుచ్చేరివంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోనైనా, రాష్ట్రాల్లోనైనా పాలన సజావుగా, మెరుగ్గా సాగాలంటే ఘర్షణ వైఖరికి స్వస్తిచెప్పాలి. -
ట్రాఫిక్ పాఠాలు చెప్పిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతహాగా ఐపీఎస్ అధికారి. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొరడా ఝుళిపిస్తున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ సర్కారుకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు చాలా కాలం తర్వాత తనలోని ఐపీఎస్‌ను బయటకు తీశారు కిరణ్ బేడీ. సోమవారం నుంచి పుదుచ్చేరిలో హెల్మెట్ తప్పనిసరి చేశారు. అలాగే, సీట్ బెల్ట్ ధరించాల్సిందేనన్న హుకుం జారీ అయింది. ఉదయం నుంచే హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అన్నది అమల్లోకి రావడంతో కిరణ్ ఐపీఎస్ అవతారం ఎత్తక తప్పలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా, అవగాహన కల్పించే విధంగా పుదుచ్చేరిలోని పలు మార్గాల్లో ఆమె తిష్ట వేశారు. పోలీసులతో కలిసి వాహనదారులను బెంబేలెత్తించారు. హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్లను పిలిచి మరీ క్లాస్ పీకారు. పరిమితిని మించి ఓవర్ లోడింగ్‌తో సాగే వారి భరతం పట్టారు. ఓ మోటార్ సైకిల్ మీద ఇద్దరు మహిళల్ని ఎక్కించుకుని ఓ యువకుడు రాగా, అతిడికి తీవ్రంగానే క్లాస్ పీకారు. వెనుక ఉన్న మహిళల్లో ఓ యువతిని కిందకు దించేశారు. బస్సులో వెళ్లమని సలహా ఇచ్చారు. ఇక పిల్లల్ని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్లకు అయితే, కిరణ్ క్లాస్ ముచ్చెమటలు పట్టించక తప్పలేదు. సీట్ బెల్ట్ ధరించకుండా కార్లు నడిపిన వాళ్లను వదలి పెట్టలేదు. మంగళవారం నుంచి హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని హెచ్చరించి పంపించారు. -
గవర్నర్ కిరణ్ బేడీ ఎమ్మెల్యే అంబలగన్ మధ్య తీవ్ర వాగ్వాదం
-
లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఎమ్మెల్యే లెఫ్ట్‌రైట్..
ఉప్పలం : పుదుచ్చేరిలో గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వేదికపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే అంబలగన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కిరణ్ బేడీ సమక్షంలోనే ఆమె పనితీరును ఎమ్మెల్యే ఆక్షేపించడంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. కిరణ్ బేడీ పర్యవేక్షణలో తన నియోజకవర్గంలో ఎలాంటి పనులూ జరగలేదన్నారు. ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించినా ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనకు సర్ధిచెప్పేందుకు కిరణ్ బేడీ ప్రయత్నించినా అంబలగన్ వినిపించుకోకుండా విమర్శల దాడి కొనసాగించారు. ఎమ్మెల్యే మైక్‌ను కట్ చేయాలని ఆమె అధికారులకు సూచించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆమెపై బిగ్గరగా కేకలు వేశారు. వేదిక దిగి వెళ్లిపోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ పదేపదే కోరినా నిరాకరించిన ఎమ్మెల్యే కిరణ్ బేడీనే సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కిరణ్ బేడీపై ఎమ్మెల్యే అంబలగన్ విమర్శల దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. పుదుచ్చేరిలో అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తున్న బేడీని కేంద్రం వెనక్కిపిలవాలని ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
పుదుచ్చేరిలో కిరణ్ బేడీ హల్చల్
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హల్ చల్ చేశారు. తన సర్వీసులో అసాంఘిక శక్తులు, రౌడీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ.. లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలోనూ అదే మార్క్ చూపుతున్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానని, అవినీతి పరుల అంతం చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. పుదుచ్చేరి మంత్రులు, అధికారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో ఆక్రమణలను వారంలోగా తొలగిస్తామని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం 1031 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. కిరణ్ బేడీ తీరు, వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.