మన దేశంలో గవర్నర్ల వ్యవస్థ తీరుతెన్నులెలా ఉన్నాయో చెప్పడానికి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు–ఢిల్లీ, పుదుచ్చేరిలను ఎప్పుడైనా ఉదాహరించవచ్చు. ఆ రెండుచోట్లా ముఖ్యమంత్రు లకూ, లెఫ్టినెంట్ గవర్నర్లకూ మధ్య సయోధ్య వాతావరణం కనబడటం చాలా అరుదు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంతో అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు ఎప్పుడూ పొసగదు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ నేతృత్వంలోని నారాయణ స్వామి ప్రభుత్వానికీ, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకీ మధ్య కూడా ఇదే తీరు ఉంటుంది. సివిల్ సర్వీస్ అధికారులపై ఎవరికి నియంత్రణ ఉండాలన్న వివాదంలో ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఢిల్లీ వివాదం మొదటికొచ్చింది. తమకు కనీసం బంట్రోతును నియమించుకునే అధికారం సైతం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశమని, ఇది అత్యంత అప్రజాస్వామికమని కేజ్రీవాల్ అంటున్నారు. యధాప్రకారం ఈ తీర్పు బీజేపీకి, అనిల్ బైజాల్‌కు నచ్చింది. అటు పుదుచ్చేరిలో ఆరు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి నారాయణస్వామి సాగిస్తున్న ధర్నా సోమవారం అర్థరాత్రి చర్చల పర్యవసానంగా రాజీ కుదరడంతో ముగిసింది. తమ ప్రభుత్వం ప్రారంభించతలపెట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రతిపాదనలను కిరణ్ బేడీ బుట్టదాఖలా చేస్తున్నారని ఆరోపిస్తూ మొన్న 13న ఆయన ఈ ధర్నా ప్రారంభించారు.
స్వయంగా సుప్రీంకోర్టే చెప్పినా, సర్కారియా కమిషన్ వంటివి మొత్తుకున్నా కాస్తయినా మారకుండా కొనసాగుతున్నది గవర్నర్ల వ్యవస్థే. మిగిలిన వ్యవస్థలు కాలానుగుణంగా ఏదోమేరకు మార్పు చెందుతూ వచ్చాయి. గవర్నర్ పదవి రాజ్యాంగపరమైనది. ఆ పదవిలో రాజకీయ నాయ కులుంటే సమస్యలెదురవుతున్నాయని భావించి, వాటికి అతీతంగా ఉండేవారిని గవర్నర్లుగా ఎంపిక చేయడం ఉత్తమమని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఆ పదవికుండే ఔన్నత్యం నిల బడాలంటే భిన్న రంగాల్లో నిష్ణాతులైనవారిని ఎంచుకోవాలని, వారు తటస్థులైతే మంచిదని సర్కా రియా కమిషన్ అభిప్రాయపడింది. అటు తర్వాత కొన్ని రాష్ట్రాలకు అలాంటివారిని ఎంపిక చేసిన మాట వాస్తవమే. కానీ వారిలో చాలామంది తాము రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోబో మని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో అనిల్ బైజాల్, పుదుచ్చేరిలో కిరణ్‌బేడీలు ఆ కోవలోని వారే. సాధారణంగా ప్రభుత్వాలు రిటైరైన ఐఏఎస్, ఐపీఎస్‌లను ‘భిన్నరంగాల్లో నిష్ణాతులు’గా భావిస్తాయి. సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నచోట గవర్న ర్లకూ, ముఖ్యమంత్రులకూ మధ్య విభేదాలు తలెత్తవు. ఉన్నా అవి తెరవెనకే సమసిపోతాయి. కానీ అక్కడా, ఇక్కడా వేర్వేరు ప్రభుత్వాలున్నప్పుడు... వాటి మధ్య రాజకీయంగా తీవ్ర స్థాయిలో విభే దాలున్నప్పుడు గవర్నర్ల పనితీరు ప్రశ్నార్థకమవుతోంది. గతంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ దాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా, అటుపై బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు వచ్చినా ఢిల్లీలో సీఎం–లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య లడాయి కొనసాగుతూనే ఉంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకునే ప్రభుత్వాలకు అధికారాలుండి తీరాలి. ఆ విషయంలో రెండో మాట ఉండకూడదు. కానీ ఢిల్లీలో నెలకొన్న ‘ప్రత్యేక పరిస్థితుల’వల్ల అక్కడ ఎన్నికైన ప్రభు త్వానికి సంపూర్ణ అధికారాలీయడం సాధ్యం కాదని నిబంధనలు చెబుతున్నాయి. వాటినే సుప్రీం కోర్టు ధ్రువీకరించింది. అయితే ఉన్నంతలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అభిప్రాయాలకు విలువీయా లని, దాని సూచనలు పాటించాలని నిరుడు జూలైలో ఇచ్చిన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదన్నది ఆ తీర్పు సారాంశం. కానీ అందులో ఓ మెలిక ఉంది. కేబినెట్ తీసుకునే ఏ నిర్ణయాన్నయినా ఆయన తన కున్న రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతిరేకించడానికి, తుది నిర్ణయం కోసం రాష్ట్రపతికి నివే దించడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆ అధికారాన్ని యాంత్రికంగా వినియోగించరాదని హితవు చెప్పింది కూడా. కానీ ఏది యాంత్రికమో, ఏది కాదో చెప్పేదెవరు? దాని సంగతలా ఉంచి గత జూలైలో ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీ ప్రభుత్వంలో ఏర్పడ్డ ఉత్సాహం కాస్తా తాజా తీర్పుతో ఆవిరైంది. అవినీతి నిరోధక విభాగంపైనా, విచారణ కమిషన్ల ఏర్పాటుపైనా, ఉన్నతాధికార వర్గం బదిలీలు, నియామకాలైనా కేంద్రం పరిధిలోనే ఉంటాయని ఇద్దరు న్యాయ మూర్తులూ తేల్చారు. అయితే జాయింట్ సెక్రటరీకన్నా కిందిస్థాయి సిబ్బంది ఎవరి నియంత్రణలో ఉండాలన్న అంశంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్యా ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల విషయం విస్తృత ధర్మాసనానికి వెళ్లింది.
రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారు పరిధులు అతిక్రమించే పరిస్థితులు ఉత్పన్నమైతే తప్ప వారి అధికారాలకు పరిమితులు విధించడం సరికాదు. ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతమే అయినా దేశ రాజధానిగా దానికి ప్రత్యేకత ఉన్నదని భావించి అక్కడి భూముల వ్యవహారం, పోలీస్ శాఖ, శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రం పరిధికింద ఉంచారు. అలాగని ఢిల్లీ ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ స్థాయికి దిగజార్చడం ప్రజల తీర్పును అవమానించడమే. ఆచరణలో నిబంధనలు ప్రతిబంధ కంగా మారితే వాటిని మార్చుకోవాలి. అంతేతప్ప వాటిని సాకుగా చూపి ఆధిపత్య ధోరణులు ప్రదర్శించకూడదు. వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చి ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన కాలంలో అధికారాలను తమ గుప్పెట్లో ఉంచుకోవాలని ఎవరికి వారు తహతహలాడటం అనా రోగ్యకరమైన ధోరణి. ఢిల్లీ, పుదుచ్చేరివంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోనైనా, రాష్ట్రాల్లోనైనా పాలన సజావుగా, మెరుగ్గా సాగాలంటే ఘర్షణ వైఖరికి స్వస్తిచెప్పాలి.
గవర్నర్ల పంచాయతీ
Published Wed, Feb 20 2019 12:09 AM | Last Updated on Wed, Feb 20 2019 12:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment