![Abhishek Singhvi Says Governor Post Should Be Abolished](/styles/webp/s3/article_images/2024/09/2/congress-party-2.jpg.webp?itok=zZ5Jtwz4)
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో గవర్నర్ పదవిని పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. అలా కానీ పక్షంలో ఎటువంటి రాజకీయలకు సంబంధం లేని ఉన్నతస్థాయి వ్యక్తులను మాత్రమే ఏకాభిప్రాయంతో నియమించాలని డిమాండ్ చేశారాయన. తాజాగా ఆయన పీటీఐ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.
‘‘ఈ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ఏమిటంటే.. ప్రతీ సంస్థను కించపర్చటం, దాని విలువ తగ్గించటం. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు రెండో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే గవర్నర్ పదవిని పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే రాజకీయలకు సంబంధంలేని వ్యక్తిని మాత్రమే నియమించాలి. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు తలెత్తితే వెంటనే గవర్నర్‌ను తెలగించాలి. ఎందుకంటే ఎన్నికల ప్రకియలో ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు కానీ గవర్నర్ కాదు. ప్రస్తుతం గవర్నర్ల తీరు వల్ల పరిపాలన కష్టంగా మారుతోంది. ప్రభుత్వం చేసని కొన్ని ముఖ్యమైన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారు’’ అని అన్నారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి. మరోవైపు.. సింఘ్వీ ఇటీవల తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment