ఉప్పలం : పుదుచ్చేరిలో గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వేదికపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే అంబలగన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కిరణ్ బేడీ సమక్షంలోనే ఆమె పనితీరును ఎమ్మెల్యే ఆక్షేపించడంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. కిరణ్ బేడీ పర్యవేక్షణలో తన నియోజకవర్గంలో ఎలాంటి పనులూ జరగలేదన్నారు. ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించినా ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనకు సర్ధిచెప్పేందుకు కిరణ్ బేడీ ప్రయత్నించినా అంబలగన్ వినిపించుకోకుండా విమర్శల దాడి కొనసాగించారు.
ఎమ్మెల్యే మైక్‌ను కట్ చేయాలని ఆమె అధికారులకు సూచించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆమెపై బిగ్గరగా కేకలు వేశారు. వేదిక దిగి వెళ్లిపోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ పదేపదే కోరినా నిరాకరించిన ఎమ్మెల్యే కిరణ్ బేడీనే సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కిరణ్ బేడీపై ఎమ్మెల్యే అంబలగన్ విమర్శల దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. పుదుచ్చేరిలో అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తున్న బేడీని కేంద్రం వెనక్కిపిలవాలని ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment