కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాలను ఎంతో సన్నిహితంగా గమనిస్తున్నవారిని సైతం ఆశ్చర్యపరిచే పరిణామం ఇది. అక్కడ ముఖ్యమంత్రి నారాయణస్వామి సారథ్యంలో కొనసాగుతున్న ప్రభుత్వం మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వరకూ వుంటుందా...ఈలోగానే ఎమ్మెల్యేల రాజీనామాలతో కుప్పకూలుతుందా అని అందరూ ఆసక్తికరంగా చూస్తుండగా, ఎవరూ ఊహించని విధంగా అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పదవి కోల్పోయారు. వాస్తవానికి ఆమె అయిదేళ్ల పదవీకాలం కూడా మరో మూడు నెలల్లో ముగియాల్సివుంది. కానీ ఆమెను అలా సజావుగా రిటైర్ కానీయకుండా... కనీసం రాజీనామా చేయమని కూడా కోరకుండా ఉద్వాసన పలికి కేంద్రం భిన్నంగా వ్యవహరించింది. గవర్నర్లుగా వున్నవారికీ, ముఖ్యమంత్రులకూ పడని సంద ర్భాలు చోటుచేసుకోవటం కొత్తేమీ కాదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి చెందిన ప్రభు త్వాలుంటే ఈ వివాదం వుండదు. అలాగని విపక్షాలు ఏలుతున్న రాష్ట్రాలన్నిటా కూడా ఆ పరిస్థితి లేదు.
గతంలో ఢిల్లీలో తరచుగా, ఈమధ్య పశ్చిమ బెంగాల్‌లో అప్పుడప్పుడు ఆ మాదిరి సమస్యలు ఏర్పడ్డాయి. ఇటీవలికాలంలో ఢిల్లీలో వివాదాలేమీ లేవనే చెప్పాలి. కానీ పుదుచ్చేరిలో అలా కాదు. 2016 మే నెలలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా వచ్చింది మొదలు కిరణ్ బేడీ నిరంతరం వివాదాల్లోనే వున్నారు. తనను తొలగించాక రాష్ట్ర ప్రజలనుద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో లెఫ్టినెంట్ గవ ర్నర్‌గా రాజ్యాంగపరమైన, నైతికపరమైన బాధ్యతల్ని పవిత్ర కర్తవ్యంగా భావించి నిర్వర్తించినట్టు చెప్పుకున్నారు. ఆమె నిజంగా అలా అనుకునే ఈ నాలుగున్నరేళ్లూ పనిచేసివుండొచ్చు. కానీ ప్రజ లంతా అలా అనుకునేలా వ్యవహరించివుంటే వేరుగా వుండేది. దేశంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ అందరికీ గుర్తుండిపోతారు. ఐపీఎస్ అధికారిగా ఆమె అందరి మన్ననలూ పొందిన సందర్భాలున్నాయి. అలాగే శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన అతి చిన్న అంశాల్లో అతిగా స్పందించి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలున్నాయి.
2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బ్రహ్మాండమైన రాజకీయ ఎత్తుగడగా లెక్కేసుకుని కిరణ్ బేడీని పార్టీలో చేర్చు కోవటమేకాక, ఆమెను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించి బీజేపీ అధిష్టానం భంగపడింది. అయినా ఆ మరుసటి సంవత్సరం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ అవకాశం వచ్చింది. కానీ అక్కడ కూడా అంచనాలకు తగినట్టు ఆమె వ్యవహరించలేకపోయారు. కిరణ్ బేడీ తీరును నిరసిస్తూ 2019 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి వారం రోజులపాటు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట ధర్నా సాగించిన సంగతిని ఎవరూ మరిచి పోరు. చివరకు సుదీర్ఘ చర్చలు నడిచి రాజీ కుదిరింది. కానీ ఆ తర్వాతైనా పెద్దగా మారిందేమీ లేదు. ప్రజలెన్నుకున్నవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాలా, లెఫ్టినెంట్ గవర్నర్‌గా వున్నవారు సొంత చొరవతో దూసుకుపోతూ సమాంతరంగా పెత్తనం సాగించాలా అన్న వివాదం పుదుచ్చేరిలో చాన్నాళ్లుగా సాగుతోంది. పారిశుద్ధ్యం నుంచి అవినీతి వరకూ సమస్యలు తలెత్తినచోటల్లా కిరణ్ బేడీయే ప్రత్యక్షమవుతూ అధికారులకు ఆదేశాలు జారీచేయటం, వారిని మందలించటం వంటివి చేస్తుంటే జనం దృష్టిలో ప్రభుత్వం దోషిగా మారిన సందర్భాలున్నాయి.
అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నత్తనడకన పనులు సాగుతుండటం కిరణ్ బేడీలో అసహనం కలిగించి వుండొచ్చు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే వేరుగా వుండేది. అధికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరించేవారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీరు జన సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆటంకంగా మారిందని నారాయణస్వామి ఒకమారు ఆరోపించారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఇద్దరి మధ్యా కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధానికి అంతేలేదు. ఆఖరికి నూతన సంవత్సర వేడుకలు ప్రజలు జరుపు కోవాలా, వద్దా అనే అంశంలోనూ ప్రభుత్వానికీ, ఆమెకూ మధ్య ఏకాభిప్రాయం లేదు. కరోనా కారణంగా ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని కిరణ్ బేడీ విజ్ఞప్తి చేయగా... కొన్ని శక్తులు ఈ వేడుకలను అడ్డుకోవాలని చూసినా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారంటూ ఆ మర్నాడు నారాయణస్వామి ప్రకటించారు. కిరణ్ బేడీని తొలగించాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు వినతిపత్రం కూడా ఇచ్చారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తీరు పెద్ద చర్చనీయాంశంగా మారితే అది అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి నష్టం చేకూరుస్తుందని కేంద్రంలోని పెద్దలు భావించటం వల్లే తాజా పరిణామం చోటుచేసుకుందన్నది కొందరి విశ్లేషణ. అందులో నిజం లేకపోలేదు. ద్విచక్ర వాహనదారులకు తక్షణం హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలనడం, రేషన్ దుకాణాల్లో సరుకులిచ్చే బదులు నగదు బదిలీ చేయాలని కిరణ్ బేడీ పట్టుబట్టడం అధికార కూటమికి మాత్రమే కాదు... విపక్షానికి కూడా మింగుడు పడలేదు. ఎన్నికలు ముంగిట్లో వుండగా ఆమె ఇలా వ్యవహరించటం వల్ల కొంపమునుగుతుందని, కేందమ్రే ఆమెతో అలా చేయిస్తున్నదని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విపక్షం భయపడింది. మొత్తానికి కిరణ్‌బేడీ పదవిలో వున్నçప్పటిలాగే పోగొట్టుకోవటంలోనూ సంచలనం సృష్టిం చారు. ఇక ఇన్నాళ్లూ ఆమెతో ఎడతెగని వివాదాల్లో చిక్కుకుని ప్రస్తుతం మైనారిటీలో పడిన నారాయణస్వామి సర్కారు పూర్తి పదవీకాలం పూర్తి చేసుకుంటుందా... కిరణ్ బేడీ తరహాలో ముందుగానే అధికారం నుంచి వైదొలగవలసి వస్తుందా అన్నది ఒకటి రెండురోజుల్లో తేలిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment