సాక్షి,కాకినాడ : విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని ఏ ఉద్యోగి అయినా కోరుకుంటారు. దేశ సేవలో 13 ఏళ్లు పనిచేసిన ఆ సైనికుడు విశ్రాంత జీవితాన్నీ సమాజం కోసం వెచ్చించాలని భావించి పోలీసు శాఖలో చేరి ట్రాఫిక్ విభాగంలో ఇతోథికంగా సేవ చేస్తున్నారు. కాకినాడ నగరానికి చెందిన బులుసు విశ్వేశ్వరరావు బీఎస్‌ఎఫ్‌లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన సేవా దృక్పథం, సైనికుడిగా పొందిన శిక్షణలో క్రమశిక్షణను ప్రజలలో ఇసుమంతైనా అలవాటు చేయాలని తలచారు.
అందుకు పోలీసు శాఖను ఎంచుకుని స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకు వచ్చి ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే కాకినాడ టౌన్‌హాల్ వద్ద జంక్షన్‌లో ట్రాఫిక్ నియంత్రణ సేవకుడిగా తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారికి ఆ నిబంధనలు బంధనాలు కావని, స్వీయ రక్షణ కోసమని ఎంతో వినయంగా వారికి వివరిస్తున్నారు. దీంతో నిత్యం ఆ మార్గంలో వచ్చి వెళ్లే వాహనచోదకులకు ఆయన సుపరిచితుడయ్యారు.
జీతం ఇస్తామన్నా వద్దని..
ట్రాఫిక్ నియంత్రణకు స్వచ్ఛందంగా వచ్చిన విశ్వేశ్వరరావు ఎటువంటి జీతం, భత్యం ఆశించకుండానే తన విధి నిర్వహణను కొనసాగిస్తున్నారు. నెలవారీ జీతం వచ్చే ఏర్పాటు చేస్తామని ఎందరు ఎస్పీలు సూచించినా ఆయన ససేమిరా అంటారు. నిబంధనలు అతిక్రమించి వెళ్లేవారికి తన సూచనలు సలహాలు నచ్చి కృతజ్ఞతతో శభాష్ సార్, థాంక్యూ సార్ అంటూ ఇచ్చే మెచ్చుకోళ్లే తనకు సంతృప్తిని ఇస్తాయని, ప్రోత్సాహాన్నిస్తాయని అంటారు విశ్వేశ్వరరావు. దేశ సేవలో ఒక రకమైన సంతృప్తి ఉంటే, ట్రాఫిక్ నియంత్రణ ద్వారా సమాజ సేవలో లభించే సంతృప్తి మరో రకమైనదని ఆయన గర్వంగా చెప్తారు.
Comments
Please login to add a commentAdd a comment