Traffic Department
-
Cyberabad Police Commissionerate: సైబరాబాద్‌లో 5 జోన్లు!
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ స్వరూపం మారనుంది. హైదరాబాద్ తరహాలో సైబరాబాద్ కూడా ఐదు జోన్లతో కార్యకలాపాలు సాగించనుంది. ఇప్పటికే శాంతి భద్రతల విభాగంలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్లు అవతరించనున్నాయి. ట్రాఫిక్ విభాగాన్నీ రెండు జోన్లుగా విభజించి, జాయింట్ సీపీ అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు ఆయా ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్‌లో సుమారు ఏడు లక్షల జనాభా ఉంది. పట్టణీకరణ, కొత్త ప్రాంతాల ఏర్పాటుతో సైబరాబాద్ విస్తరిస్తుంది. దీంతో కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యమైంది. ఈ మేరకు ప్రస్తుతం బాలానగర్ జోన్లో భాగంగా ఉన్న మేడ్చల్‌ను వేరే చేసి కొత్తగా మేడ్చల్ జోన్‌ను, అలాగే ప్రస్తుతం శంషాబాద్ జోన్లో ఉన్న రాజేంద్రనగర్‌ను విడదీసి రాజేంద్రనగర్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే సైబరాబాద్‌కు 750 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో ఒక జాయింట్ సీపీ, నాలుగు డీసీపీ, ఏడు అదనపు డీసీపీ, ఎనిమిది ఏసీపీ ర్యాంకు పోస్టులు కాగా.. మిగిలినవి ఇన్స్పెక్టర్, ఆ కింది స్థాయి ర్యాంకు పోస్టులున్నాయి. కొత్త జోన్ల స్వరూపం ఇదే: మేడ్చల్ జోన్: ఈ జోన్లో మేడ్చల్, పేట్‌బషీరాబాద్ డివిజన్లుంటాయి. మేడ్చల్ డివిజన్లో కొత్తగా ఏర్పాటయ్యే సూరారం, జీనోమ్‌వ్యాలీతో పాటు ఇప్పటికే ఉన్న మేడ్చల్, దుండిగల్ ఠాణాలుంటాయి. రాజేంద్రనగర్ జోన్: ఈ జోన్లో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లుంటాయి. రాజేంద్రనగర్ డివిజన్లో రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, నార్సింగితో పాటు కొత్తగా ఏర్పాటుకానున్న అత్తాపూర్ ఠాణా కూడా ఉంటుంది. పేట్‌బషీరాబాద్ డివిజన్లో అల్వాల్, శామీర్‌పేట, పేట్‌బషీరాబాద్ పీఎస్‌లు, చేవెళ్ల డివిజన్లో మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్, చేవెళ్ల పీఎస్‌లుంటాయి. కొత్త ఠాణాలు ఇక్కడే.. తాజా పునర్ వ్యవస్థీకరణతో సైబరాబాద్‌లో ప్రతి జోన్‌లోనూ రెండేసి డివిజన్లు ఉంటాయి. ప్రస్తుతం మాదాపూర్ జోన్లో ఉన్న కూకట్పల్లి డివిజన్‌ను విడదీసి బాలానగర్ జోన్లో కలిపేయనున్నారు. దీంతో మాదాపూర్ జోన్లో మాదాపూర్, మియాపూర్ డివిజన్లు, బాలానగర్ జోన్లో బాలానగర్, కూకట్పల్లి, శంషాబాద్ జోన్లో శంషాబాద్, షాద్‌నగర్ డివిజన్లుంటాయి. అలాగే ప్రస్తుతం సైబరాబాద్‌లో 37 శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు ఉండగా.. కొత్తగా గండిపేట, మెకిలా, కొల్లూరు, జన్వాడ, సూరారం, జీనోమ్‌వ్యాలీ, అత్తాపూర్ ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్‌కు జాయింట్ సీపీ.. ప్రస్తుతం సైబరాబాద్ మొత్తానికీ ఒకటే ట్రాఫిక్ జోన్ ఉంది. దీన్ని రెండుగా విభజించి రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోన్ ఒక డీసీపీ, అదనపు డీసీపీ పర్యవేక్షణలో ఉంటాయి. కొత్తగా ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (జాయింట్ సీపీ)ను నియమించనున్నారు. ప్రస్తుతం సైబరాబాద్‌లో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ ట్రాఫిక్ డివిజన్లలో 14 పీఎస్‌లున్నాయి. -
మీరే పౌర పోలీస్!
సాక్షి, అమరావతిబ్యూరో: ‘ముగ్గురు యువకులు ఒకే ద్విచక్రవాహనంపై అడ్డదిడ్డంగా నడుపుతూ ఇతరులకు అంతరాయం కలిగిస్తున్నారు. ఆ యువకుల దుడుకు ప్రవర్తనను అడ్డుకోవాలని మీ మనసులో ఉన్నా.. గొడవ జరుగుతుందేమోననే ఆందోళన మిమ్మల్ని ముందుకు వెళ్లనీయడంలేదు. అయితే మీ చేతికి మట్టి అంటుకోకుండా మీ కోరిక నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తూ రవాణాశాఖ ప్రత్యేక వాట్సాప్ నెంబరు 9542800800 అందుబాటులోకి తెచ్చింది. ఉల్లంఘన దారులపై మీరు తీసిన ఫొటోను ఈ వాట్సాప్‌కు జతచేస్తే వారికి జరిమానాలు పడతాయి. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన రాజేష్ (పేరు మార్చాం) ఓ ప్రభుత్వ ఉద్యోగి. నిత్యం గొల్లపూడి నుంచి పటమటకు రాకపోకలు సాగిస్తుంటారు. తాను వెళ్లే మార్గంలో తరచూ ట్రాఫిక్ ఉల్లంఘనలు కనిపిస్తుండటంతో ఓ రోజు తన సెల్ఫోన్లో చిత్రీకరించి, విజయవాడ రవాణాశాఖ అధికారులకు వాట్సప్ ద్వారా పంపించారు. ఉల్లంఘన జరిగిందని రవాణాశాఖ నిర్ధారణకు వచ్చాక ఈ–వెహికల్ చెక్ రిపోర్ట్‌లో ఆ వివరాలను నమోదు చేయగా, ఉల్లంఘనదారుడికి ఈ–చలానా జారీ అయింది. రోజూ సగటున 27 వరకు.. విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగర తదితర జిల్లాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై తరచూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. రవాణాశాఖ ఈ వాట్సాప్ నెంబరును ఆగస్టు 27 నుంచి అమల్లోకి తీసుకురాగా.. ఈ నెల 11వ తేదీ వరకు మొత్తం 2,731 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా విశాఖపట్నం నుంచి 1,444, శ్రీకాకుళం నుంచి 540, కృష్ణా జిల్లాలో 240, గుంటూరు నుంచి 114 ఫిర్యాదులు అందగా.. అనంతపురం జిల్లా నుంచి అత్యల్పంగా 9 ఫిర్యాదులే అందాయి. చాలా జిల్లాల్లో పౌరులు దీనిని ఓ సామాజిక స్పృహగా భావించాలని ఫిర్యాదు చేయడానికి నడుంకట్టారు. పోలీసు వాహనాలైనా.. పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖల వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధించరనే ప్రచారం ఉంది. అయితే ప్రభుత్వ వాహనాలపైనా ఫిర్యాదు చేయవచ్చని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాం నిబంధనల ఉల్లంఘన జరిగితే సాధారణ ప్రజలెవరైనా రవాణాశాఖ దృష్టికి తీసుకురావచ్చు. అందుకే ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ తరహా ఫిర్యాదుల్ని ప్రోత్సహిస్తున్నాం. ఉల్లంఘన జరిగిందని తేలితే ఈ–చలాన్ విధిస్తున్నాం. – ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ, విజయవాడ ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేవారు వాట్సప్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకోవచ్చు. ఉల్లంఘన జరిగిన ప్రాంతం, వాహన రిజిస్ట్రేషన్ నెంబరు, తేదీ, సమయం.. తదితర వివరాల్ని పొందుపర్చాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులు తీసే ఫొటోపై ఆ సమాచారం ఉంటే మరీ మంచిది. -
ఈ సైనికుడు మంచి సేవకుడు
సాక్షి,కాకినాడ : విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని ఏ ఉద్యోగి అయినా కోరుకుంటారు. దేశ సేవలో 13 ఏళ్లు పనిచేసిన ఆ సైనికుడు విశ్రాంత జీవితాన్నీ సమాజం కోసం వెచ్చించాలని భావించి పోలీసు శాఖలో చేరి ట్రాఫిక్ విభాగంలో ఇతోథికంగా సేవ చేస్తున్నారు. కాకినాడ నగరానికి చెందిన బులుసు విశ్వేశ్వరరావు బీఎస్ఎఫ్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన సేవా దృక్పథం, సైనికుడిగా పొందిన శిక్షణలో క్రమశిక్షణను ప్రజలలో ఇసుమంతైనా అలవాటు చేయాలని తలచారు. అందుకు పోలీసు శాఖను ఎంచుకుని స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకు వచ్చి ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే కాకినాడ టౌన్‌హాల్ వద్ద జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ సేవకుడిగా తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారికి ఆ నిబంధనలు బంధనాలు కావని, స్వీయ రక్షణ కోసమని ఎంతో వినయంగా వారికి వివరిస్తున్నారు. దీంతో నిత్యం ఆ మార్గంలో వచ్చి వెళ్లే వాహనచోదకులకు ఆయన సుపరిచితుడయ్యారు. జీతం ఇస్తామన్నా వద్దని.. ట్రాఫిక్ నియంత్రణకు స్వచ్ఛందంగా వచ్చిన విశ్వేశ్వరరావు ఎటువంటి జీతం, భత్యం ఆశించకుండానే తన విధి నిర్వహణను కొనసాగిస్తున్నారు. నెలవారీ జీతం వచ్చే ఏర్పాటు చేస్తామని ఎందరు ఎస్పీలు సూచించినా ఆయన ససేమిరా అంటారు. నిబంధనలు అతిక్రమించి వెళ్లేవారికి తన సూచనలు సలహాలు నచ్చి కృతజ్ఞతతో శభాష్ సార్, థాంక్యూ సార్ అంటూ ఇచ్చే మెచ్చుకోళ్లే తనకు సంతృప్తిని ఇస్తాయని, ప్రోత్సాహాన్నిస్తాయని అంటారు విశ్వేశ్వరరావు. దేశ సేవలో ఒక రకమైన సంతృప్తి ఉంటే, ట్రాఫిక్ నియంత్రణ ద్వారా సమాజ సేవలో లభించే సంతృప్తి మరో రకమైనదని ఆయన గర్వంగా చెప్తారు. -
గూగుల్‌తో పోలీసు విభాగం కీలక ఒప్పందం
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ మూస ధోరణిలో నడుస్తోంది. చిన్న జంక్షన్లలో 90 సెకన్లు, పెద్ద జంక్షన్లలో 240 సెకన్లలో సిగ్నల్స్ సైకిల్ పూర్తవుతుంది. అంటే సదరు జంక్షన్‌లోని ఓ రోడ్‌కు గ్రీన్‌లైట్ ఆగి రెడ్‌లైట్ పడిన తర్వాత మళ్లీ గ్రీన్‌లైట్ పడటానికి పట్టే సమయం ఇది. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై ఉంటోంది. ఉదాహరణకు బేగంపేట మీదుగా సికింద్రాబాద్–పంజగుట్ట మధ్య ఉన్న రహదారినే తీసుకుంటే ఉదయం వేళల్లో సికింద్రాబాద్ వైపు నుంచి, రాత్రిపూట బేగంపేట దిశ నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఉన్న జంక్షన్లలో మాత్రం సిగ్నల్ సైకిల్ ఒకేలా పనిచేస్తోంది. దీంతో ఆయా జంక్షన్లలోని కొన్ని రోడ్లు ఖాళీగా, మరికొన్ని బంపర్ టు బంపర్ జామ్‌తో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితి విద్యాసంస్థలు, వాణిజ్య ప్రాంతాలు, ప్రభుత్వ–ప్రైవేట్ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తరచూ కనిపిస్తోంది. దీంతో ట్రాఫిక్ విభాగం ఓ జంక్షన్‌లోని ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురావచ్చని భావించింది. దీని కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) విధానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. దీని కోసం గూగుల్ సంస్థతో పోలీసు విభాగం ఓ కీలక ఒప్పందాన్ని చేసుకుంది. స్మార్ట్ఫోన్లతో గుర్తిస్తున్న గూగుల్.. కీలక మార్గాలు, జంక్షన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ వద్ద రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంటోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆ సంస్థకు సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు తమ లొకేషన్ తెలుసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. దీంతో ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్లు తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. వీటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఏ రహదారిలో, ఏ దిశలో సెల్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయనేది గుర్తిస్తోంది. రహదారులపై ఉన్న సెల్ఫోన్లు సాధారణంగా వాహనచోదకులవే అయ్యి ఉంటాయి. ఇలా రోడ్లపై ఉన్న ట్రాఫిక్ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్ సంస్థకు చేరుతున్నాయి. వీటి ఆధారంగానే ఆ సంస్థ తమ మ్యాప్స్‌లో ట్రాఫిక్ రద్దీ ఉన్నరహదారుల్ని ఎరుపు రంగులో చూపిస్తుంటుంది. ప్రస్తుత సమస్య.. ప్రతి ట్రాఫిక్ జంక్షన్లో ఉన్న నాలుగు రోడ్లలో ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ సిగ్నల్స్ సైకిల్ నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు. అయినా ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్ లైన్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా, రెడ్‌లైన్ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. పరిష్కారం.. ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఓ జంక్షన్‌లోని 4 రహదారుల్లో ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురావచ్చు. సమస్యకు గూగుల్ సాయం.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆ సంస్థకు సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు తమ లొకేషన్ తెలుసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. దీంతో ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్లు తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. దీంతో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ వద్ద రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంటోంది. ఏపీఐ కోసం ఆ సంస్థతో ఒప్పందం.. గూగుల్ వద్ద ఉన్న ఈ వివరాలను వాహన చోదకులు, ప్రజలకు ఉపయుక్తంగా వినియోగించాలని పోలీసు విభాగం యోచించింది. దీంతో ట్రాఫిక్ అప్డేట్స్తో కూడిన గూగుల్ సర్వర్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కంట్రోల్ చేసే సర్వర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇది అమల్లోకి రావడంతో గూగుల్ సర్వర్ ఆధారంగా ఓ జంక్షన్ సమీపంలోని రహదారుల్లో వాహనాల రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్ సిగ్నల్స్ సైకిల్‌ను మారుస్తుంది. దీంతో ఓ చౌరస్తాకు సంబంధించి రద్దీ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు గ్రీన్‌లైట్ వెలుగుతుంది. రద్దీని బట్టి ఆయా మార్గాల్లో సిగ్నల్స్ సైకిల్‌ను సర్వర్ మార్చేస్తూ ఉంటుంది. అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టంగా పిలిచే దీని ఫలితంగా ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతోపాటు వాహనచోదకుల సమయం సైతం ఆదా అవుతుంది. ఇప్పటికే ఈ విధానాన్ని గచ్చిబౌలి చౌరస్తాలో ప్రయోగాత్మకంగా వినియోగించారు. విజయవంతం కావడంతో 3 కమిషనరేట్లలోని దాదాపు అన్ని జంక్షన్లలోనూ వినియోగించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను నిర్వహిస్తున్న బెల్ సంస్థ కాంట్రాక్ట్ నవంబర్‌లో పూర్తయి కొత్త కాంట్రాక్ట్ మొదలవుతుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఐటీఎంఎస్ ప్రాజెక్టు అదే సమయానికి 3 కమిషనరేట్లలోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నుంచి ఐటీఎంఎస్‌లో భాగంగా ఏటీసీఎస్ విధానం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించనుంది. ప్రజలకు ఎంతో ఉపయుక్తం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో అంతర్భాగంగా అమల్లోకి రానున్న అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టంను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించాం. మంచి ఫలితాలు ఇస్తున్న ఈ విధానం ప్రజలకు, వాహనచోదకులకు ఉపయుక్తంగా మారుతుంది. మౌలిక వసతుల కల్పన, ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితరాల్లో ఉన్న ఇబ్బందుల్ని అధిగమిస్తున్నాం. త్వరలోనే ఏటీసీఎస్‌ను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నాం. గూగుల్ సంస్థ సహకారంతో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే సర్వర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. - అనిల్‌కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ -
ఫైన్ పడకుండా జిమ్మిక్కులు
సాక్షి, మంచిర్యాల : నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఇటీవల చేపట్టిన చర్యల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ట్రాఫిక్‌నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వాహనదారులకు తెలియకుండానే పోలీసులు ఫొటోలు తీసి వాహనం నంబర్ ఆధారంగా ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తూ ఆన్లైన్లో నోటీసులు పంపిస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనదారులు పోలీస్ కెమెరాకు చిక్కకుండా వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండానే హల్చల్ చేస్తున్నారు. నంబర్ ప్లేట్ ఉన్నా వారు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ దగ్గరకు రాగానే ద్విచక్రవాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తి తమకాళ్లతో, చేతులతో నంబర్‌ప్లేట్ కనిపించకుండా రయ్‌మని వెళ్లిపోతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. పత్రాలు మార్చుకోవడంలో జాప్యం పాత వాహనాలు కొనుగోలు కొనుగోలు చేసినవారు పత్రాలు మార్చుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఈ–చలాన్ ద్వారా వాహనం ఎవరి పేరుమీద ఉంటే వారే బాధితులకు నష్టపరిహారం కట్టించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇటివల తేల్చి చెప్పింది. దీంతో యాజమాన్య హక్కులు బదలాయింపులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా... ఇబ్బందులకు గురైనట్లే. ఇంతేకాదు ఇటీవల పోలీస్‌శాఖ రహదారి నిబంధనల్లో కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఈ–చలాన్ విధానం అమలు చేస్తోంది. దీంతో వాహనాలు ఎవరి పేరుమీద ఉంటే వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు వాహనాల పత్రాలను మార్చుకోవడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో వారు దానికి జరిమానా విధించాల్సి వస్తుంది. వాహనాలు విక్రయించిన తరువాత కొనుగోలు చేసిన వారి పేరుమీద త్వరగా పత్రాలను మార్చేయాలి. లేదంటే ఇబ్బందులకు గురికావల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం తగదు హైదరాబాద్, విజయవాడ, మహారాష్ట్రలాంటి పెద్దపెద్ద నగారాల్లో సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారానికి పెట్టింది పేరు. ఆయా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా వాహనాలు కొనుగోలు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సుమారు 150వరకు కన్సల్టెన్సీలు ఉన్నాయి. కొందరు దొంగ వాహనాలను కొనుగోలు చేసి వాటికి పత్రాలు లేకున్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వాహనాదారుల నుంచి పత్రాలు తీసుకుంటున్నా కొనేవారి పేరుతో బదిలీ చేయడంలో తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో అసలు వాహన యజమాని ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులకు ఇది కొంతమేర తలనొప్పిగానే మారే అవకాశం ఉందని ఓ అధికారి అనడం గమనార్హం. అసలు యజమాని ఎవరో తెలియక ఎవరి పేరుమీద వాహనం రిజిష్టర్ అయి ఉంటుందో వారికే ఈ–చలాన్ ద్వారా జరిమానా నోటీస్ వెళ్తుందన్నారు. అప్పుడు ఎవరూ ఏమీచేయలేరని ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానా విధించాల్సిందేనని, లేనిపక్షంలో కఠిన చర్యలుంటాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీరిపై చర్యలేవీ? నంబర్ ప్లేట్ లేని వాహనదారులు, ఉన్నవారు నంబర్ ప్లేట్‌పై ఉన్న నంబర్ కనిపించకుండా కాళ్లు, చేతులు అడ్డుపెట్టి తప్పించుకొని తిరుగుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఆ హక్కు ప్రభుత్వానికి ఉంది: రూప
బెంగళూరు: అధికారులు బదిలీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వ ఉత్తర్వులను పాటించానని ట్రాఫిక్ ఐజీ రూప తెలిపారు. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీకి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కిరణ్ బేడీ ఇచ్చిన మద్దతు తనకు అమూల్యమైందని రూప పేర్కొన్నారు. కాగా అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో అందుతున్న వీఐపీ ట్రీట్మెంట్, జైల్లో అవకతవకలను బయటపెట్టిన డేరింగ్ ఐపీఎస్, డీఐజీ రూప మౌద్గిల్‌కు బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. గత నెల 23న జైళ్ల డీఐజీగా చార్జ్ తీసుకున్న ఆమెపై నెల తిరక్కుండానే బదిలీ వేటు పడడం గమనార్హం. మరోవైపు విపక్ష నేతలు సర్కారు చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. ఇక జైళ్ల డీజీపీ సత్యనారాయణరావు, నిఘా డీజీపీ ఎంఎన్.రెడ్డిలు కూడా బదిలీ అయ్యారు. మరోవైపు డీజీపీ ఆర్కే దత్త మాట్లాడుతూ రహదారుల భద్రతకు సంబంధించి రూపకు కీలక, బాధ్యతయుతమైన పోస్ట్ కేటాయించడం జరిగిందే కానీ, పనిష్మెంట్ కింద బదిలీ జరగలేదని అన్నారు. -
రూపను బదిలీ చేయడం దారుణం: యెడ్డీ
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సోమవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. జైళ్ల శాఖ డీఐజీ రూప బదిలీ వ్యవహారంపై ఆయన ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో చర్చించారు. భేటీ అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ... డీఐజీ రూపను బదిలీ చేయడం దారుణమని, నిజాయితీపరులైన ప్రభుత్వ అధికారులకు రాష్ట్రంలో భద్రత లేదని వారిని సిద్ధరామయ్య సర్కార్ శిక్షిస్తోందన్నారు. డీజీపీకి రూప ఇచ్చిన నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యలపై విచారణ జరిపించాలని, మంగళూరులో వెంటనే ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలన్నారు. మరోవైపు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరిండెంటెంట్ కృష్ణ కుమార్‌పై కూడా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ఆర్.అనిత నియమితులయ్యారు. కాగా డీఐజీ రూప బదిలీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. సాధారణ బదిలీల్లో భాగంగా రూప బదిలీ జరిగిందని, అందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. కాగా అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన జైళ్ల శాఖ డీఐజీ రూప పై బదీలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఆమెను జైళ్లశాఖ నుంచి ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని డీఐజీ రూప డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది. -
బెంగళూరు డీఐజీ రూపపై బదిలీ వేటు
బెంగళూరు: అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప పై బదీలీ వేటు పడింది. ఆమెను జైళ్లశాఖ నుంచి ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని డీఐజీ రూప డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది. ఈ నివేదికపై జైళ్ల శాఖ డీజీ సత్యనారాయణ రావు స్పందించిన విషయం తెలిసిందే. జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక సదుపాయాల కోసం రూ.2 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళకు ఎలాంటి ప్రత్యేక వంటగది వసతి కల్పించలేదని, కోర్టు ఉత్తర్వులు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేశారని డీఐపీ రూపపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. -
నొక్కేస్తే.. పట్టేస్తారు..!
►చెకింగ్స్‌పై నజర్! ►ఈ–చలాన్ల తనిఖీలో సిబ్బంది చేతివాటం ►వాహనచోదకుల నుంచి డబ్బు వసూలు ►సర్వర్‌తో పీడీఏ మిషన్ల అనుసంధానం ఇప్పటికే కొందరు ► అక్రమార్కుల గుర్తింపు సిటీబ్యూరో: ఉల్లంఘనలకు పాల్పడి ఈ–చలాన్లు భారీగా పెండింగ్‌లో ఉన్న వాహనచోదకులపై ట్రాఫిక్ విభాగం అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. దీనిని కొందరు సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుంటూ ‘క్యాష్’ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ చెకింగ్స్ పైనా కన్నేసి ఉంచుతున్నారు. ఈ నిఘాలో పట్టుబడిన కొందరిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. పెరిగిపోతున్న పెండింగ్ చలాన్లు... ట్రాఫిక్ ఉల్లంఘనులకు జరిమానా విధించే విషయంలో ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతోంది. క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులు నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ–చలాన్లు పంపిస్తున్నారు. వీటిని ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దాదాపు 50 శాతం వాహనదారుల చిరునామాలు ఆర్టీఏ డేటాబేస్‌లో అప్డేట్ కాలేదు. దీంతో వారికి ఈ–చలాన్లు అందక తమ వాహనంపై చలాన్ జారీ అయిందనే విషయం యజమానికి తెలియట్లేదు. మరికొందరు ఉల్లంఘనులకు తమ వాహనంపై చలాన్ పెండింగ్‌లో ఉందని తెలిసినా.. ఉద్దేశపూర్వకంగా జరిమానా చెల్లించడంలేదు. రహదారులపై అడ్డంగా ‘బాదుడు’... దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు పెండింగ్ ట్రాఫిక్ ఈ–చలాన్ల డేటాబేస్‌ను అధికారుల వద్ద ఉండే పీడీఏ మిషన్లకు అనుసంధానించారు. ఈ మిషన్లతో రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ ఈ–చలాన్లు ఉన్న వాహనాలను గుర్తిస్తున్నారు. భారీ మొత్తం పెండింగ్‌లో ఉంటే వాహనం స్వాధీనం చేసుకోవడం, బకాయి మొత్తం చెల్లించిన తర్వాతే వదిలిపెట్టడం చేస్తున్నారు. దీంతో ఈ–చలాన్ల వసూలు మాట ఎలా ఉన్నా.. కొందరు సిబ్బంది మాత్రం భారీగా వసూళ్ళకు పాల్పడుతున్నారు. ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనచోదకుల నుంచి డబ్బు తీసుకుని జరిమానా చెల్లించకుండానే వారిని పంపేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్ని సందర్భాల్లో వాహనచోదకుల్ని బెదిరిస్తూ అందినకాడికి తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సర్వర్‌తో అనుసంధానం... వీటిని దృష్టిలో ఉంచుకున్న ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు చెకింగ్స్‌పై సాంకేతిక నిఘా అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు వినియోగించే ప్రతి పీడీఏ మిషన్‌ను సర్వర్‌తో అనుసంధానించడంతో పాటు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. దీంతో ఒక్కో పీడీఏ మిషన్ ఆ రోజు ఎన్ని వాహనాల వివరాలు తనిఖీ చేసింది? వాటిలో ఎన్నింటిపై ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి? స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎన్ని? బకాయి తీర్చేలా చర్యలు తీసుకున్నవి ఎన్ని? అనేది ఓ నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందుతోంది. దీని ఆధారంగా ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలను గుర్తించి, విడిచిపెట్టడానికి కారణాలపై విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ హోంగార్డు చేతివాటం వెలుగులోకి రావడంతో అతడిపై చర్యలకు సిఫార్సు చేశారు. మరికొందరి పాత్ర పైనా అధికారులకు ప్రాథమిక ఆధారాలు అందినట్లు తెలిసింది. వీరిపైనా చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. -
పోలీస్ శాఖలో క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్
అన్ని జిల్లాల్లో అమలుకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వ్యవస్థను పోలీస్ శాఖలోనూ అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయించారు. పోలీస్ శాఖ ఎన్ఫోర్స్ మెంట్ విధానంలో క్యాష్‌లెస్‌ను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణ ప్రసాద్, పీసీఎస్ అదనపు డీజీపీ రవిగుప్తా ఆధ్వర్యంలో శనివారం సమీక్ష జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిష నరేట్ల పరిధిలోని ట్రాఫిక్ విభాగం నిర్వహిస్తున్న ఈ–చలాన్ వ్యవస్థను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. హైదరాబాద్ కమిషన రేట్లోని ఈ–చలాన్ సాఫ్ట్వేర్, సర్వర్లు, సిబ్బంది శిక్షణపై ఎస్పీలు ఆధ్యయనం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిం చారు. క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్, ఈ–చలాన్ విధానంపై జిల్లాల పోలీస్ సిబ్బందికి శిక్షణనివ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఖర్చుపై పోలీస్ కంప్యూటర్ సర్వీ సెస్ అదనపు డీజీపీ నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. -
డ్రైవరే టార్గెట్!
ఉల్లంఘనల నమోదులో కొత్త ప్రక్రియ పదేపదే వైలేషన్స్ చేసే వారి గుర్తింపు కోసమే తప్పుడు ‘నెంబర్లు’ చెప్పకుండా ఓటీపీ విధానం సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నిత్యం ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్న ట్రాఫిక్ విభాగం అధికారులు ఆయా వ్యక్తుల పైనే కేసులు నమోదు చేస్తున్నారు. తద్వారా ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన వారిని గుర్తించడం తేలికవుతోంది. దీంతో ఆయా వివరాలను కోర్టుకు సమర్పించి ట్రాఫిక్ పోలీసులు జరిమానాతో పాటు జైలు శిక్ష పడేలా, శిక్షాకాలం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడే వారిని పట్టుకుంటున్న క్షేత్రస్థాయి ట్రాఫిక్ పోలీసులు... ఈ వాహనం నెంబర్ ఆధారంగా జరిమానా విధిస్తున్నారు. దీంతో పదేపదే చిక్కుతున్న వాహనాల డేటాబేస్ రూపొందుతోంది. అయితే అసలు తప్పు వాటిని డ్రైవ్ చేసిన వ్యక్తులదని తెలిసినా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించడం సాధ్యం కావడట్లేదు. దీంతో ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడినా ఒకే తరహాలో జరిమానా విధిస్తున్నారు. ‘డ్రంకన్ డ్రైవింగ్’ను స్ఫూర్తిగా తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనల నమోదును వాహనం నుంచి డ్రైవర్ ఆధారంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల అమలవుతున్న ఈ విధానం త్వరలో నగర వ్యాప్తంగా అమలులోకి రానుంది. దీని ఆధారంగా రూపొందే డేటాబేస్ ద్వారా రిపీటెడ్ వైలేటర్స్ను గుర్తించడం, ఆర్టీఏ, న్యాయస్థానాల సహకారంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ కాప్స్ సన్నాహాలు పూర్తి చేశారు. పీడీఏ మిషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు... ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పుస్తకాలను వాడట్లేదు. ఉల్లంఘనులకు జరిమానా విధించడం, వారి నుంచి క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆ మొత్తాన్ని వసూలు చేయడం తదితరాలన్నీ చేతిలో ఇమిడిపోయే పీడీఏ మిషన్లు ద్వారానే నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు తాజాగా తీసుకున్న ‘డ్రైవర్’ నిర్ణయంతో ఈ పీడీఏ మిషన్లలో కొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాహనచోదకుడి వద్ద ఒరిజినల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉంటే దాన్ని రీడ్ చేసే పరిజ్ఞానం జోడించారు. ఉల్లంఘనుడి వద్ద ఉన్నది జిరాక్సు ప్రతి అయితే ఆ వివరాలు మాన్యువల్‌గా ఫీడ్ చేయనున్నారు. ప్రతి ఉల్లంఘనుడు తన డ్రైవింగ్ లెసైన్స్‌తో పాటు మరో గుర్తింపు కార్డును చూపించడం కచ్చితం చేయనున్నారు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ తదితరాల్లో ఏదో ఒకటి అదనంగా చూపించాల్సిన విధానం అమలులోకి తీసుకువస్తున్నారు. ఈ వివరాలను సైతం పీడీఏ మిషన్లలో ఫీడ్ చేయడం ద్వారా ఉల్లంఘనులకు సంబంధించిన డేటాబేస్ రూపొందించనున్నారు. ఫోన్ నెంబర్ సైతం కచ్చితం.. సిటీలో పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్ల సంఖ్య సైతం భారీగానే ఉంది. ఆయా వాహనచోదకులకు పోలీసులు ఎస్సెమ్మెస్‌ల రూపంలో రిమైండర్స్ ఇస్తున్నారు. దీనికి అవసరమైన ఫోన్ నెంబర్లను వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఏ అధికారులకు ఇచ్చింది తీసుకుంటున్నారు. అయితే ఆయా వాహనాలు చేతులు మారిపోవడం, అసలు యజమాని దగ్గరే ఉన్నా ఆయన ఫోన్ నెంబర్లు మార్చేయడంతో ఈ సమాచారం వారికి చేరట్లేదు. మరోపక్క అత్యవసర సమయాల్లో వాహనచోదకుడిని సంప్రదించడానికీ అవకాశం ఉండట్లేదు. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు వైలేషన్స్‌ను డ్రైవర్ కేంద్రంగా నమోదు చేయడంతో పాటు వారి నుంచి ఫోన్ నెంబర్లనూ కచ్చితంగా తీసుకోనున్నారు. నెంబర్ ‘మార్చకుండా.... ఈ రకంగా ట్రాఫిక్ పోలీసులు కోరినప్పుడు ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగానో, అనివార్యకారణాల నేపథ్యంలోనే తప్పు నెంబర్లు చెప్పే అవకాశం ఉంది. ఏవో పది అంకెల నెంబర్ చెప్పి తప్పించుకోవడానికీ ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులు ఫోన్ నెంబర్ల సేకరణలో వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) విధానం అమలు చేస్తున్నారు. ఉల్లంఘనుడు ట్రాఫిక్ పోలీసులకు తన ఫోన్ నెంబర్ చెప్పిన వెంటనే దాన్ని అధికారులు పీడీఏ మిషన్‌లో నమోదు చేస్తారు. ఈ వెంటనే పీడీఏలు కనెక్ట్ అయి ఉండే సర్వర్ నుంచి సదరు ఉల్లంఘనుడు చెప్పిన నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సైతం ఉల్లంఘనుడు అందుకుని, చెప్తేనే అసలు నెంబర్ చెప్పినట్లు నిర్థారిస్తారు. ఈ నూతన విధానంతో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడం తేలికవుతుందని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. అలా రూపొందే రిపీటెడ్ వైలేటర్స్ డేటాబేస్ ఆధారంగా ఆర్టీఏ ద్వారా లెసైన్స్ సస్పెండ్ చేయించడం, కొన్ని రకాలైన ఉల్లంఘనుల్ని కోర్టు ద్వారా జైలుకు తరలించడం తదితర కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
‘జీరో యాక్సిడెంట్ నైట్’గా డిసెంబర్ 31
కూల్... కూల్‌గా! ప్రశాంతంగా ప్రారంభమైన కొత్త ఏడాది ఫలించిన ‘జంట పోలీసుల’ వ్యూహం అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా వే డుకలు ‘జీరో యాక్సిడెంట్ నైట్’గా డిసెంబర్ 31 సిటీబ్యూరో: జంట కమిషనరేట్ల పోలీసులు ఏర్పాటు చేసిన బందోబస్తు, విధించిన ఆంక్షలు ఫలితాలనిచ్చాయి. కొత్త సంవత్సర స్వాగత వేడుకలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా... ఒక్క ప్రమాదం కూడా నమోదు కాకుండా ‘జీరో యాక్సిడెంట్ నైట్’గా చేయగలిగారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతో పాటు అదనపు బలగాలు గురువారం రాత్రంతా విధుల్లోనే ఉన్నాయి. నగరంలోని కీలక ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లలో నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. వేడుకలు జరుపుకునే వారు ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండాచర్యలు తీసుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం... దురుసుగా డ్రైవింగ్ చేయడం... మితిమీరిన వేగం... పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం తదితర ఉల్లంఘనలపై ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సిటీలో 557 మంది, సైబరాబాద్‌లో 505 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కారు. గతంలోని ప్రమాదాలు, ఘటనలను దృష్టిలో పెట్టుకున్న పోలీసలు ముందు జాగ్రత్తగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను బంద్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గం లేని కారణంగా బేగంపేట, డబీర్‌పుర, సనత్‌నగర్ వంటి కొన్ని ఫ్లైఓవర్లకు మాత్రమే మినహాయింపునిచ్చారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లతో పాటు హుస్సేన్ సాగర్ చుట్టు పక్కలవాహనాలను అనుమతించలేదు. ఓఆర్ఆర్, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేలోనూ ఆంక్షలు కొనసాగాయి. జంట కమిషనరేట్లలోని ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు వాహన చోదకుల వేగాన్ని నియంత్రించారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యలతో డిసెంబర్ 31 ప్రశాంతంగా గడిచింది. శుక్రవారం తెల్లవారు జాము 2 గంటల తరవాత ఫ్లైఓవర్లు, 3 గంటలకు ట్యాంక్‌బండ్, 5 గంటలకు నెక్లెస్ రోడ్లలో సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించారు. -
హోంగార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేయండిలా..
నోటిఫికేషన్ వివరాలు... మొత్తం పోస్ట్‌లు 150 ఎంపికైన వారు హైదరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. భారతీయుడై ఉండాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని వారై ఉండాలి. ఏడోతరగతి పాసై కనీసం పదేళ్లు పూర్తికావాలి. 50 ఏళ్లలోపు వయస్సు వారే అర్హులు. లైట్ మోటార్, హెవీ వెహికిల్ లెసైన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 160 సెం.మీ ఎత్తు ఉండాలి. దరఖాస్తు విధానం... అడిషనల్ డీజీపీ హోంగార్డ్స్, తెలంగాణ పేరిట దరఖాస్తు చేయాలి. ఇందుకు ttp://www.hyderabadpolice.gov.in/HGForm.pdf లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు ఆఖరు తేదీ... అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తులో ఉన్న కాలమ్స్‌లో వివరాలు పూరించండి. విద్యార్హత పత్రాలు, వయస్సు ధ్రువీకరించే పత్రం, వాహన లెసైన్స్ జిరాక్స్ జత చేయాలి. 4 పాస్‌పోర్ట్ కలర్ ఫొటోలు. స్థానికత ధ్రువీకరణ పత్రం. రూ.25 రుసుమును దరఖాస్తుతో ఇవ్వాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఆ రుసుం ఉండదు) చెక్‌లు, డీడీలు అనుమతించరు. దరఖాస్తులను 22-11-2014లోపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు జామ్‌బాగ్‌లోని గోషామహల్ స్టేడియంలో అందజేయాలి. దరఖాస్తును పోస్ట్ లేదా ఇతరుల ద్వారా పంపకూడదు. అభ్యర్థే స్వయంగా సంబంధిత అధికారికి సమర్పించాలి. అప్పటికప్పుడు దరఖాస్తును పరిశీలించి హాల్‌టికెట్ జారీ చేస్తారు. అభ్యర్థుల ఎంపిక విధానం... డ్రైవింగ్ స్కిల్స్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. వీటితోపాటుగా మెడికల్‌గా ఫిట్నెస్ ఉన్నట్టు ధ్రువీకరణ వస్తేనే ఎంపిక చేస్తారు. గమనిక: దరఖాస్తులు అమ్మబడవు. ఏ పోలీస్ స్టేషన్లోనూ అందుబాటులో ఉండవు. కేవలం పైన పేర్కొన్న వెబ్‌లో నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. హెచ్చరిక: దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఉండాలి. ఒక వేళ తప్పుడు ధ్రువీకరణతో ఎంపికైనా మధ్యలో జరిగే విచారణలో బహిర్గతమైతే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగిస్తారు. -
సెలవుకు సెలవేనా?
ట్రాఫిక్ విభాగంలో మొదలు పెడతామన్న అధికారులు మూడు నెలలైనా ఆ ఊసేలేదు సిబ్బంది కొరతతో వెనకడుగు పోలీసు సిబ్బందిలో నైరాశ్యం సాక్షి, సిటీబ్యూరో: వారాంతపు సెలవు... దశాబ్దాలుగా పోలీసుల కల ఇది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నల్లగొండ జిల్లా పోలీసులు ప్రయోగాత్మకంగా ఈ కలను సాధ్యం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అదే స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని... ట్రాఫిక్ విభాగంలో ముందుగా మొదలు పెడతామని అధికారులు హామీ ఇచ్చారు. మూడు నెలలవుతున్నా దాని ఊసే లేదు. సిబ్బంది కొరతతో నగరంలో ఇది అమలు కావడం లేదు. కొత్త వారిని నియమిస్తే గానీ ఇది సాధ్యం కాదని సిబ్బంది అంటున్నారు. ఆగస్టు 15 నుంచి వీక్లీ ఆఫ్ అమలు చేస్తారనే ప్రచారంతో సిబ్బందిలో ఆశలు రేకెత్తాయి. ఆ గడువు దాటిపోయినా అందుకు సంబంధించి ఎటువంటి కదలికలు లేకపోవడంతో వారిలో నైరాశ్యం నెలకొంటోంది. వీక్లీ ఆఫ్ అమలు కావాలంటే... జంట పోలీసు కమిషనరేట్లలో ట్రాఫిక్, సివిల్, ఏఆర్ విభాగాల్లో వారాంతపు సెలవు అమలు కావాలంటే సుమారు 7,603 మంది సిబ్బందిని కొత్తగా నియమించాలి.ప్రస్తుతం నగర కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్‌లో హోంగార్డులతో కలిపి 3,057 మంది పని చేస్తుండగా, సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్)లో 8,698 మంది ఉన్నారు. సైబరాబాద్‌లో 990 మంది ట్రాఫిక్‌లో పని చేస్తుండగా, సివిల్, ఏఆర్‌లో 5,700 మంది విధులు నిర్వహిస్తున్నారు. నగర కమిషనరేట్‌కు ప్రస్తుతం ట్రాఫిక్, సివిల్, ఏఆర్ లకు కలిపి 4,603 మంది కావాల్సి ఉంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్, సివిల్, ఏఆర్‌లకు కలిపి సుమారు 3 వేల మంది సిబ్బంది కావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని భారం తగ్గుతుంది. నగరంలో ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది... ఉండాల్సింది ఉన్నది ఖాళీలు 1795 1167 628 భర్తీ కావలసిన పోస్టులు: 26 మంది ఎస్ఐలు, 17 మంది ఏఎస్ఐలు, ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు, 582 మంది కానిస్టేబుళ్లు ట్రాఫిక్‌లో హోంగార్డులే ఎక్కువ నగర ట్రాఫిక్ విభాగంలో పోలీసు సిబ్బంది కంటే అధికంగా హోం గార్డులు పని చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అదనపు పోలీసు కమిషనర్, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు కలిసి మొత్తం 1167 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా హోంగార్డులు 1890 మంది పని చేస్తున్నారు. నగర ట్రాఫిక్ విభాగానికి మరో 900 మంది సిబ్బంది వస్తేగానీ వారాంతపు సెలవు సాధ్యం కాదు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ రాకపోవడంతో అరకొరగా ఉన్న సిబ్బంది పైనే పనిభారం పడుతోంది. ట్రాఫిక్ సిబ్బంది పని వేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి 10 గంటల వ రకు సిబ్బంది రెండు షిప్టులలో విధులు నిర్వహిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ ఈ రోజు మొదటి షిప్టులో డ్యూటీ చేస్తే అదే కానిస్టేబుల్ మరుసటి రోజు రెండో షిఫ్టు చేయాల్సి ఉంటుంది. ఇక సిటీ సివిల్, ఏఆర్ పోలీసు విభాగంలో 12,401 పోస్టులకు గాను 8,698 మంది మాత్రమే ఉన్నారు. సైబరాబాద్‌లో ట్రాఫిక్ విభాగంలో హోంగార్డులతో సహా ప్రస్తుతం 990 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంత మంది ఉండాలి అనే లెక్కలు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మరో వెయ్యి మంది వరకు ఉంటేనే వీక్లీఆఫ్‌లతో పాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలవుతుంది. సివిల్, ఏఆర్‌లో కలిపి ప్రస్తుతం సుమారు 5,700 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అదనంగా హోంగార్డులు 2వేల మంది వరకు ఉంటారు. వీక్లీ ఆఫ్ అమలు కావాలంటే మరో 2వేల మంది సిబ్బందిని నియమించాలి. నెలకు 360 గంటలు విధుల్లో... ఒక కానిస్టేబుల్ 24 గంటలు విధుల్లో ఉంటే... మరో 24 గంటల పాటు విశ్రాంతిలో ఉంటాడు. అంటే నెలలో అతడు 360 గంటల పాటు విధులు నిర్వహించినట్లు అవుతుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు నెలలో సుమారు 208 గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన పోలీసులు ఇతర విభాగాల ఉద్యోగుల కంటే 152 గంటలు అధికంగా పని చేస్తున్నారు. తక్కువ పనిగంటలు పనిచేస్తున్న వారికి వీక్లీ ఆఫ్‌లు ఉన్నాయి. అదే ఎక్కువ గంటలు పని చేస్తున్న పోలీసులకు మాత్రం ఇంకా వీక్లీఆఫ్‌లు మొదలు కాకపోవడం గమనార్హం. -
తప్పుచేస్తే తిప్పలే
సాక్షి, ముంబై: రోడ్డు నిబంధనలు పాటించని వాహన చోదకులను పట్టుకునేందుకు ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. గత మూడు రోజుల్లో నగరవ్యాప్తంగా వాహన నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 5,400 మంది వాహనదారులను ట్రాఫిక్ విభాగం గుర్తించి కేసులు నమోదు చేసింది. ‘ఆపరేషన్ ఈగల్’ పేరుతో చేపట్టిన ఈ డ్రైవ్‌లో ఓ ప్రత్యేక బృందం మెరైన్‌డ్రైవ్ వద్ద గత నెల 28 నుంచి తనిఖీలు నిర్వహిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సమర్థంగా అడ్డుకునేందుకు గిర్గావ్ చౌపాటీ, నారిమన్ పాయింట్ల వద్ద కూడా ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) బి.కె.ఉపాధ్యాయ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 8-8.30 గంటల సమయంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించామని చెప్పారు. ఈ సమయంలో రద్దీ ఎక్కువ కాబట్టి సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలు పెరుగుతాయన్నారు. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్యలోనూ ఉల్లంఘనలు ఎక్కువగానే ఉన్నాయని ఉపాధ్యాయ వివరించారు. ఉల్లంఘనలను సమర్థంగా అడ్డుకోవడానికి ‘ఆపరేషన్ ఈగల్’ డ్రైవ్ నిర్వహించే సిబ్బంది మఫ్టీ దుస్తుల్లోనే ఉంటున్నారు. సిగ్నల్‌ను జంప్ చేసిన వారిని గుర్తించి, వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నోట్ చేసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు. గత నెల 28న ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. శుక్రవారం వరకు దాదాపు 5,400 మంది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించి చలానాలు రాశారు. హెల్మెట్ ధరించకపోవడం,తప్పుడు దిశలో వాహనం నడుపుతున్న వారిని కూడా పట్టుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందికి సూచించామని ఉపాధ్యాయ వెల్లడించారు. మెరైన్‌డ్రైవ్‌లో నిర్వహిస్తున్న తనిఖీల్లో 12 మంది అధికారులతోపాటు 50 మంది కానిస్టేబుళ్లు విధులు పాల్గొంటున్నారు. వీరు రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. మెరైన్‌డ్రైవ్ వద్ద నిబంధనలు ఉల్లంఘనలను సున్నాశాతానికి తీసుకురావడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయ స్పష్టీకరించారు. ఇదిలా వుండగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపిన 1,459 మందిని, సిగ్నల్స్ జంప్ చేసిన 921 మంది నేరస్తులను మే 29న పట్టుకున్నారు. వాహనాన్ని తప్పుడు దిశలో నడిపిన 529 మందిని పట్టుకొని చలానాలు రాశారు. 28న కూడా హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపిన 1,031 మందిని, సిగ్నల్స్‌ను జంప్ చేసిన 735 మంది వాహనదారులకు జరిమానా విధించారు. తప్పుడు దిశలో వాహనం నడిపిన 122 మంది వాహన చోదకులు కూడా ఇదే రోజు పట్టుబడ్డారు. 30, 31 తేదీల్లో కూడా వందలాది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించి పట్టుబడ్డారు. -
త్వరలో ప్రీపెయిడ్ ఆటో బూత్‌లు
సాక్షి, ముంబై: దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను దోచుకుంటున్న ఆటోడ్రైవర్ల ఆగడాలకు కళ్లెం వేయాలని ట్రాఫిక్ శాఖ యోచిస్తోంది. మొదటి విడతలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ), బాంద్రా టర్మినస్, అంధేరి, కల్యాణ్ తదితర ప్రధాన రైల్వేస్టేషన్ల బయట ప్రీ పెయిడ్ ఆటో బూత్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే ఆటో డ్రైవర్ల ఇష్టారాజ్యం, దాదాగిరి, అడ్డగోలుగా చార్జీల వసూలు, మోసం చేయడం లాంటి ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు విముక్తి లభించనుంది. నగరంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), ముంబై సెంట్రల్, దాదర్ లాంటి కీలకమైన రైల్వే స్టేషన్ల బయట ట్రాఫిక్ శాఖ ప్రీ పెయిడ్ ట్యాక్సీ బూత్‌లను ఇదివరకే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి కారణంగా ప్రయాణికులకు సరైన సేవలు అందుతున్నాయి. ఇదే తరహాలో ఆటో ప్రీపెయిడ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రధాన రైల్వే స్టేషన్ల బయట స్థలం సమస్య ఏర్పడుతోంది. కానీ ప్రీ పెయిడ్ ఆటోబూత్‌లు ఏర్పాటుచేసేందుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చేందుకు రైల్వే పరిపాలన విభాగం అంగీకరించింది. కాగా, అవసరమైన స్థలాన్ని సమకూర్చి ఇవ్వాలని సెంట్రల్, పశ్చిమ రైల్వే పరిపాలన విభాగాలకు విజ్ఞప్తిచేయగా అందుకు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ట్రాఫిక్ శాఖ వర్గాలు తెలిపాయి. స్థలం లభించిన వెంటనే బూత్‌లు ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా స్వగ్రామాల నుంచి పిల్లలు, భారీ లగేజీలతో రైలు దిగిన ప్రయాణికులకు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో లేదా ట్యాక్సీ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయటకు రాగానే, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు ధరలు చెబుతారు. దగ్గర కిరాయికి రారు. ఒకవేళ వచ్చినా వారు అడిగినంత చెల్లించాల్సిందే. ఇక ప్రీ పెయిడ్ బూత్‌లు అందుబాటులోకి వస్తే వీరి ఆగడాలకు కచ్చితంగా కళ్లెం పడుతుందని ట్రాఫిక్ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.