సెలవుకు సెలవేనా?
- ట్రాఫిక్ విభాగంలో మొదలు పెడతామన్న అధికారులు
- మూడు నెలలైనా ఆ ఊసేలేదు
- సిబ్బంది కొరతతో వెనకడుగు
- పోలీసు సిబ్బందిలో నైరాశ్యం
సాక్షి, సిటీబ్యూరో: వారాంతపు సెలవు... దశాబ్దాలుగా పోలీసుల కల ఇది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నల్లగొండ జిల్లా పోలీసులు ప్రయోగాత్మకంగా ఈ కలను సాధ్యం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అదే స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని... ట్రాఫిక్ విభాగంలో ముందుగా మొదలు పెడతామని అధికారులు హామీ ఇచ్చారు. మూడు నెలలవుతున్నా దాని ఊసే లేదు. సిబ్బంది కొరతతో నగరంలో ఇది అమలు కావడం లేదు. కొత్త వారిని నియమిస్తే గానీ ఇది సాధ్యం కాదని సిబ్బంది అంటున్నారు. ఆగస్టు 15 నుంచి వీక్లీ ఆఫ్ అమలు చేస్తారనే ప్రచారంతో సిబ్బందిలో ఆశలు రేకెత్తాయి. ఆ గడువు దాటిపోయినా అందుకు సంబంధించి ఎటువంటి కదలికలు లేకపోవడంతో వారిలో నైరాశ్యం నెలకొంటోంది.
వీక్లీ ఆఫ్ అమలు కావాలంటే...
జంట పోలీసు కమిషనరేట్లలో ట్రాఫిక్, సివిల్, ఏఆర్ విభాగాల్లో వారాంతపు సెలవు అమలు కావాలంటే సుమారు 7,603 మంది సిబ్బందిని కొత్తగా నియమించాలి.ప్రస్తుతం నగర కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్‌లో హోంగార్డులతో కలిపి 3,057 మంది పని చేస్తుండగా, సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్)లో 8,698 మంది ఉన్నారు. సైబరాబాద్‌లో 990 మంది ట్రాఫిక్‌లో పని చేస్తుండగా, సివిల్, ఏఆర్‌లో 5,700 మంది విధులు నిర్వహిస్తున్నారు. నగర కమిషనరేట్‌కు ప్రస్తుతం ట్రాఫిక్, సివిల్, ఏఆర్ లకు కలిపి 4,603 మంది కావాల్సి ఉంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్, సివిల్, ఏఆర్‌లకు కలిపి సుమారు 3 వేల మంది సిబ్బంది కావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని భారం తగ్గుతుంది.
నగరంలో ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది...
ఉండాల్సింది ఉన్నది ఖాళీలు
1795 1167 628
భర్తీ కావలసిన పోస్టులు:
26 మంది ఎస్‌ఐలు, 17 మంది ఏఎస్‌ఐలు, ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు, 582 మంది కానిస్టేబుళ్లు
ట్రాఫిక్‌లో హోంగార్డులే ఎక్కువ నగర ట్రాఫిక్ విభాగంలో పోలీసు సిబ్బంది కంటే అధికంగా హోం గార్డులు పని చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అదనపు పోలీసు కమిషనర్, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు కలిసి మొత్తం 1167 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా హోంగార్డులు 1890 మంది పని చేస్తున్నారు. నగర ట్రాఫిక్ విభాగానికి మరో 900 మంది సిబ్బంది వస్తేగానీ వారాంతపు సెలవు సాధ్యం కాదు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ రాకపోవడంతో అరకొరగా ఉన్న సిబ్బంది పైనే పనిభారం పడుతోంది.
ట్రాఫిక్ సిబ్బంది పని వేళలు
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి 10 గంటల వ రకు సిబ్బంది రెండు షిప్టులలో విధులు నిర్వహిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ ఈ రోజు మొదటి షిప్టులో డ్యూటీ చేస్తే అదే కానిస్టేబుల్ మరుసటి రోజు రెండో షిఫ్టు చేయాల్సి ఉంటుంది.
ఇక సిటీ సివిల్, ఏఆర్ పోలీసు విభాగంలో 12,401 పోస్టులకు గాను 8,698 మంది మాత్రమే ఉన్నారు.
సైబరాబాద్‌లో ట్రాఫిక్ విభాగంలో హోంగార్డులతో సహా ప్రస్తుతం 990 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంత మంది ఉండాలి అనే లెక్కలు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మరో వెయ్యి మంది వరకు ఉంటేనే వీక్లీఆఫ్‌లతో పాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలవుతుంది. సివిల్, ఏఆర్‌లో కలిపి ప్రస్తుతం సుమారు 5,700 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అదనంగా హోంగార్డులు 2వేల మంది వరకు ఉంటారు. వీక్లీ ఆఫ్ అమలు కావాలంటే మరో 2వేల మంది సిబ్బందిని నియమించాలి.
నెలకు 360 గంటలు విధుల్లో...
ఒక కానిస్టేబుల్ 24 గంటలు విధుల్లో ఉంటే... మరో 24 గంటల పాటు విశ్రాంతిలో ఉంటాడు. అంటే నెలలో అతడు 360 గంటల పాటు విధులు నిర్వహించినట్లు అవుతుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు నెలలో సుమారు 208 గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన పోలీసులు ఇతర విభాగాల ఉద్యోగుల కంటే 152 గంటలు అధికంగా పని చేస్తున్నారు. తక్కువ పనిగంటలు పనిచేస్తున్న వారికి వీక్లీ ఆఫ్‌లు ఉన్నాయి. అదే ఎక్కువ గంటలు పని చేస్తున్న పోలీసులకు మాత్రం ఇంకా వీక్లీఆఫ్‌లు మొదలు కాకపోవడం గమనార్హం.