కూలి పనులకెళ్లి కానరాని లోకాలకు
- గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో
- ఆరుగురు దుర్మరణం
- విషాదంలో బుడగ జంగాల కాలనీ
- రెక్కాడితే డొక్కాడని బతుకులు
- ఆస్పత్రిలో అడ్రస్‌లేని వైద్యులు
- గాయాలతో నరకయాతన అనుభవించిన బాధితులు
జంగమహేశ్వరపురం (గురజాలరూరల్)/గురజాల: పట్టణంలోని బేడ బుడగ జంగం కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లి కానరానిలోకాలకు వెళ్లారు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. రోజు వారి కూలీ పనులకు వెళితేనే ఐదు వేళ్లు లోపలికి పోయేది. వచ్చే వంద రూపాయల కూలికి సుమారుగా 30 కిలోమీటర్లుకు పైగా పనులకు వెళ్తుంటారు. కుటుంబంలో కొంతమంది యాచక వృత్తికి వెళ్లగా మరికొంత మంది కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. తల్లి ఆలనా,...తండ్రి పాలన ఆట పాటలతో బడిలో ఎదగాల్సిన చిన్నారులు సైతం చేతిలో క్యారేజ్ పట్టుకుని పొలం పనులకు వెళ్తుంటారు. నివసిస్తున్న గ్రామంలో పొలం పనులు దొరక్కపోవడంతో ...కిలోమీటర్ల దూరం వెళ్లి పనులు చేసుకుని వస్తుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని చేస్తే వంద రూపాయలు, సాయంత్రం వరకు ఉంటే రూ. 200 కూలి ఇస్తారు.
మరికాసేపట్లో ఇంటికి చేరతారనగా ...
బుడగ జంగం కాలనీ వాసులు రోజూ మాదిరిగానే మినీ ఆటోలో బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం తండాకు మిరçప కాయలు కోసేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనగా ప్రమాదం జరిగింది. మృతురాలు పేర్ల మార్తమ్మ అలీయాస్ ఇస్తారమ్మ భర్త వీరాస్వామి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వీరికి ముగ్గురు అబ్బాయిలు, నలుగ్గురు అమ్మాయిలు సంతానం కలరు.
ఆడపిల్లల ఆలనా పాలనా చూçసుకోవాల్సిన వృద్ధాప్యంలో కూలీ పనులకు వెళ్లి దుర్మరణం చెందడంతో మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులను బాధకల్గించింది. మరొక మృతురాలు కడెం నర్సమ్మ భర్త రాములు గతంలోనే మరణించాడు. ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు కలరు. గంధం వెంకటమ్మభర్త భిక్షంలో గతంలోనే మృతి చెందాడు. ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. చేతిలో పలకా బలపం ఉండాల్సిన వయస్సులో చేతిలో క్యారేజీ పట్టుకుని కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వారిది. మనస్సు చదువుకొమ్మంటున్నా..ఆకలి తీర్చుకునేందుకు పనికి వెళ్లక తప్పని దుస్థితి.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో....
గురజాల మండలం జంగమహేశ్వరపురం వద్ద కూలీల వ్యాను చెరువులోకి దూసుకెళ్లి ఆరుగురు దుర్మరణం చెందారు. గురజాల పోలీసుల కథనం మేరకు.. బుడగ జంగాల కాలనీకి చెందినవారు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. శుక్రవారం ఉదయం వ్యానులో 45 మంది కూలీలు బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంతండాలో మిరపకాయలు కోసేందుకు వెళ్లి.. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తున్న సమయంలో జంగమహేశ్వరపురానికి చేరుకున్న తర్వాత రోడ్డు వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాన్ని వ్యాను ఢీకొట్టి పక్కనున్న చేపల చెరువులోకి పల్టీకొట్టి యథాస్థితికి చేరుకుంది.
మృతులు వీరే....
ఈ ప్రమాదంలో పేర్ల మార్తమ్మ (60), కడియం నర్సమ్మ (45), కడెం సమక్ష (12), పస్తం కుమారి (14) అక్కడికక్కడే మృతిచెందారు.మార్గ మధ్యలో గంధం వెంకటమ్మ (46), క డెం సమక్క (16) మృతిచెందారు. మరో 27మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గాయలైన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో జి. రమేష్, పి. మనీషా, కె. ఇందు, కె. వెంకమ్మ, కె. అమరలింగమ్మ, ఎన్. శ్రీను, పి. జంపన్న, యు.మరియమ్మ, 30, పి. చంద్రమ్మ 60, సారయ్యతో పాటు మరో పదిమందిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ రాయన ధర్మేంద్ర కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులుండగా తీవ్రంగా గాయపడిన వారిలో మరో ముగ్గురు మైనర్లు ఉన్నారు.
సకాలంలో వైద్యం అందక...
ప్రమాదం జరిగి గంట అయినా వైద్యులు మాత్రం అందుబాటులో లేరు. వైద్యశాలలో క్షతగాత్రుల ఆర్తనాదాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గురజాల ప్రభుత్వ 30 పడకల వైద్యశాలను వంద పడకల వైద్యశాలగా మార్చినా , పీహెచ్‌సీ నుంచి సీహెచ్‌సీగా గుర్తింపు వచ్చినా కనీస వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమైయ్యారు. ప్రమాదం జరిగి వైద్యశాలకు సుమారుగా 20 మంది బాధితులను తీసుకొచ్చినా గంట వరకు డాక్టర్లు రాలేదు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గాయపడిన వారు పడిన నరకయాతన అంతా ఇంతా కాదు. అసలే ప్రమాదంలో దెబ్బలు తగిలి అల్లాడుతుంటే వైద్యులు మాత్రం తాపీగా వచ్చి ఏమి జరిగింది అంటూ సాగదీస్తూ ప్రథమ చికిత్స చేశారు . ప్రమాదం జరిగిందని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి బాధితులను పరామర్శించారు.