రామకృష్ణారెడ్డి (ఫైల్)
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చౌళూరు గ్రామంలోని ఆయన ఇంటి వద్ద వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రామకృష్ణారెడ్డి ఏపీ సరిహద్దుల్లో కర్ణాటకలోని తన దాబా వద్ద శనివారం రాత్రి పని ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో కారులో ఇంటికి వచ్చారు.
ఇంటి వద్ద కారు దిగుతున్న సమయంలో అప్పటికే మొఖానికి మాస్క్‌లు ధరించి కాపు కాచి ఉన్న ముగ్గురు నలుగురు ఒక్కసారిగా వేట కొడవళ్లతో దాడి చేశారు. తల, గొంతు, చేతులు, కాళ్లపై దారుణంగా నరికి పారిపోయారు. రామకృష్ణారెడ్డి అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఇంటి ముందు పడి ఉన్న రామకృష్ణారెడ్డిని ఆయన కారులోనే హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారిం చారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ ఇస్మాయిల్, రూరల్ సీఐ జీటీ నాయుడు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
రామకృష్ణారెడ్డి హత్య వార్త తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, చౌళూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చౌళూరు రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం కృషి చేశారు. హిందూపురం మండలంలో మంచి పట్టు ఉన్న నాయకుడు. ఆయన భార్య, కుమారుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆయన మృతి సమాచారాన్ని వారికి అందించారు. ఆయన తల్లి, బంధువులు, గ్రామస్తుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్యను వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. హత్య విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకొన్నారు.
దుండగులను వెంటనే పట్టుకోవాలి: ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్
చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు దారుణ హత్యకు గురికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందన్నారు. ఆయన పార్టీ కోసం చేసిన సేవలు మరవలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.
హత్య విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకోవాలని కోరారు. హత్యకు కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూపురం నియోజకవర్గంలో కక్ష సాధింపు హత్యల సంస్కృతి లేదని, ఈ ఘటనకు కారణమైన వారిని ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment