శివప్ప (ఫైల్) , ఈరన్న (ఫైల్)
కౌతాళం/కౌతాళం రూరల్/కర్నూలు: కర్నూలు జిల్లాలో బీజేపీ నేతలు కిరాతకానికి పాల్పడ్డారు. ఒక భూమి విషయంలో గురువారం ఉదయం పంచాయితీకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై కారం, పెట్రోల్, యాసిడ్, వేటకొడవళ్లతో దాడి చేసి, నిప్పంటించారు. ఈ దమనకాండలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో మరణించాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు ఇద్దరూ దళితులు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం కామవరంలో ఈ దారుణం జరిగింది.
బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని ఆదోనికి చెందిన మునీంద్రకు కామనూరులో సర్వే నంబర్ 254లో 7 ఎకరాల పొలం ఉంది. దీన్ని 15 ఏళ్లుగా అదే గ్రామంలోని బీజేపీ నాయకులు వడ్డె మల్లికార్జున, ఈశ్వరతో పాటు వారి సోదరులు మరో నలుగురు కౌలుకు తీసుకున్నారు. ఈ పొలాన్ని కొనడానికి పదేళ్ల కిందట మునీంద్రతో వారు ఒప్పందం చేసుకున్నారు. లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. మిగిలిన డబ్బు చెల్లించలేదు. రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. కౌలూ ఇవ్వడంలేదు. దీనిపై మునీంద్ర పలుసార్లు మల్లికార్జున సోదరులను అడిగారు. కానీ వారు ఖాతరు చేయలేదు. పొలాన్ని సాగు చేస్తూనే ఉన్నారు. దీంతో మిగతా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదా అగ్రిమెంట్ వెనక్కి తీసుకుని పొలం తిరిగిచ్చేయాలని మునీంద్ర కోరాడు. దీనికి వారు ససేమిరా అన్నారు. దీంతో మునీంద్ర కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు.
మునీంద్ర ఇటీవల కోర్టు ఉత్తర్వులను తీసుకుని పొలం వద్దకు వెళితే మల్లికార్జున దాడి చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితం మునీంద్ర గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకుడు మహేందర్‌రెడ్డిని ఆశ్రయించారు. న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలిసి మల్లికార్జున, అతని సోదరులు ఒక యూ ట్యూబ్ చానల్ విలేకరిని పిలిపించి మహేందర్‌రెడ్డి గ్రామంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని తప్పుడు కథనాలు సృష్టించారు. ఇవి ప్రసారమైన తర్వాత వైఎస్సార్‌సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ వసంత, అతని సోదరులు శివప్ప, సత్యప్ప, ఈరన్న (దళితులు) మరికొంత మంది తమ నాయకుడు మహేందర్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని మల్లికార్జునను ప్రశ్నించారు. మహేందర్‌రెడ్డిపై దుష్ప్రచారం, పొలం విషయం మాట్లాడేందుకు గురువారం మల్లికార్జున ఇంటికి వెళ్లాలని సర్పంచ్, అతని బంధువులు బుధవారం నిర్ణయించుకున్నారు. ఈ స మాచారాన్ని మల్లికార్జునకు తెలిపారు. గురువారం ఉదయమే వీరు మల్లికార్జున ఇంటివద్దకు వెళ్లారు.
పక్కా ప్రణాళికతో హత్య
సామరస్యంగా పంచాయితీకి వెళ్లిన సర్పంచి సోదరుడు శివప్ప, దూరపు బంధువు ఈరన్నతో పాటు మరికొందరిపై పక్కా ప్రణాళికతో బీజేపీ నాయకుడు మల్లికార్జున, అతని సోదరులు, అనుచరులు దాడి చేశారు. పురుగుల మందు స్ప్రేయర్లలో పెట్రోలు, యాసిడ్ కలిపి సిద్ధంగా ఉంచుకున్నారు. శివప్ప, ఇతరులు మల్లికార్జున ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా వారిపై దాడికి దిగారు. మల్లికార్జున సోదరులు, పిల్లలు, మహిళలు అనుచరులు అందరూ కలిసి శివప్ప, ఇతరుల కంట్లో కారం చల్లారు. స్ప్రేయర్లతో పెట్రోలు, యాసిడ్ స్ప్రే చేశారు. వేట కొడవళ్లు, కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
ఈ ఘటనలో శివప్ప కిందపడిపోయాడు. అతని దేహానికి నిప్పంటించారు. దీంతో శివప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఈరన్న ఆదోని ప్రభుత్వాసుప్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యప్ప, అయ్యప్ప, పెద్ద తిమోతి, బజారప్ప, ఇస్మాయిల్, నగేష్‌లను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో సత్యప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. హత్యాకాండ విషయం తెలియగానే జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐ పార్థసారథి, ఎస్‌ఐ మన్మథ విజయ్ ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. శివప్ప సోదరుడు, సర్పంచ్ వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు, వారి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు.
నిందితులంతా రౌడీషీటర్లు
కామవరం గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితులు నలుగురు రౌడీషీటర్లే. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో హత్య కేసులు నమోదయ్యాయి. 1998లో ఆదోని టూటౌన్ పరిధిలో హత్య కేసు, 2009లో ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులోను వీరు నిందితులు ప్రస్తుత బీజేపీ డివిజన్ నాయకుడి అండదండలతోనే గ్రామ నాయకులుగా ఎదిగి ఈ హత్యలకు పూనుకున్నారు.
పథకం ప్రకారమే దాడి
మా నాయకుడు మహేందర్‌రెడ్డిపై కొన్ని పత్రికల్లో వచ్చిన అవాస్తవాలను అడిగేందుకు వెళ్లగా వారు పథకం ప్రకారమే మాపై దాడి చేశారు. దాడిలో నేను స్వల్ప గాయాలతో బయటపడ్డాను. గ్రామస్తులైన శివప్ప, ఈరన్న, సత్యప్పలపై విచక్షణ రహితంగా వేట కొడవళ్లు పెట్రోల్, కారం, రాళ్లతో దాడి చేశారు.
– క్షతగాత్రుడు ఇస్మాయిల్
నిందితులను పట్టుకుంటాం: ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి
దాడిలో గాయపడి ఆదోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, దాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన అమానుషమని, దోషులు ఎంతటి వారైనా, ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. భూ వివాదంలో ఇద్దరు దళితులు హత్యకు గురయ్యారని, హత్య చేసిన వారు పరారీలో ఉన్నారని ఎస్పీ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ను ఆదేశించినట్లు చెప్పారు. ఘటనపై కౌతాళం పోలీసు స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment