సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులకు వీక్లీఆఫ్ అమలు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఎనిమిది నెలలు గడిచినా అమలు కాలేదు. 24 గంటలు విధులు నిర్వర్తించే పోలీసులకు వారంతపు సెలవు(వీక్లీఆఫ్) ఇస్తామని గతేడాది నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 2017 జూలై నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం రాష్ట్రమంతటా వీక్లీఆఫ్ పద్దతిని అమలు చేస్తామని ఘనంగా ప్రకటనలు చేశారు.
ఈ నిర్ణయం ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుళ్లలో ఆనందోత్సహాలను నింపింది. కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నా వీక్లీఆఫ్ నిర్ణయం ఆచరణకు నోచుకోకపోవడంతో పోలీస్ శాఖలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. వాస్తవంగా ప్రతీ జిల్లాలోను సర్కిల్ పోలీస్‌స్టేషన్‌ల వారీగా సిబ్బంది, విధులు వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని సౌలభ్యతను బట్టి వీక్లీఆఫ్‌లు ఇవ్వాలని ఉన్నతస్థాయి ఆదేశాలు ఇచ్చారు. అమలులో మాత్రం చిత్తశుద్ది కొరవడిందని పోలీసులు వాపోతున్నారు.
ప్రకాశం జిల్లాలో అరకొరగానే..
ప్రయోగాత్మకంగా ప్రకాశం జిల్లాలో చేపట్టిన వీక్లీఆఫ్ పద్దతి అరకొరగానే అమలు జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. అప్పట్లో ప్రకాశం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు వీక్లీఆఫ్ అమలుకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సివిల్, ఏఆర్ పోలీసులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింపజేయాలని, ఎమర్జెన్సీ, ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయించి వీక్లీఆఫ్‌లు అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు లోబడి వారాంతపు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు.
రాజమహేంద్రవరంలో ప్రత్యేక సెలవులు..
వీక్లీఆఫ్ అమలు మాటెలా ఉన్నా రాజమహేంద్రవరం అర్బన్ పరి ధిలో ప్రత్యేక సెలవులు ఇస్తూ ఎస్పీ రాజకుమారి కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం పోలీసుల్లో ఆనందోత్సహాలు నింపుతోంది. పోలీసుల పెళ్లి రోజు, పుట్టిన రోజుల్లో వేతనం కూడిన సెలవు ఇచ్చే పద్దతిని ఈ నెల 19 నుంచి అమలు చేయాలని భావించారు. దీంతో తమ జీవితంలో ముఖ్యమైన రోజున కుటుంబంతో గడిపేందుకు అవకాశం వచ్చిందని పోలీసులు సంబరపడుతుండటం గమనార్హం. కానీ ముందుగా ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చి సెలవులు పొందాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతానికి అరకొరగానే ఈ పద్దతి అమలు జరుగుతోంది. వీక్లీఆఫ్ కూడా ఇవ్వాలని అర్బన్ ఎస్పీ నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో అమలేది..
రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ఎక్కడా అమలు కావడంలేదని పలువురు పోలీసులు తమ సంఘ నేతల వద్ద వాపోతున్నారు. రాత్రిపగలు విధులు నిర్వర్తించే తమకు వారాంతపు సెలవు కూడా లేకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు 32 పండుగలు, 52 ఆదివారాలు, 12 శనివారాలు, తదితర అన్ని కలుపుకొని 121 రోజులు సెలవులుగా ఇస్తుండటంతో 244రోజులు పని చేస్తున్నారని పోలీసులు లెక్కలు చెబుతున్నారు. అదే పోలీసులకు ఏడాదిలో కేవలం 20 రోజులు సెలవులు ఇస్తే 345రోజులు విధి నిర్వహణ తప్పడంలేదని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment