అధికారుల తీరుపై మేయర్ ఆగ్రహం
అధికారుల నిర్లక్ష్యం వల్లే కౌన్సిల్ సమావేశం జాప్యం
రాజమహేంద్రవరం సిటీ : నగరాభివృద్ధికి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తత అడ్డంకిగా తయారైందని, పాలకవర్గ సామావేశానికి అజెండా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసినా పెడచెవిన పెట్టడం వల్లే నగర పాలక సంస్థ పాలకవర్గ సమావేశం జాప్యం జరుగుతోందని మేయర్ పంతం రజనీశేషసాయి ఆరోపించారు. మంగళవారం మేయర్ చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 13న సెక్రటరీ శైలజావల్లిని 24వ తేదీ పాలకవర్గ సమావేశం కోసం అజెండా తయారు చేయాలని ఆదేశించినా ఏమాత్రం స్పందించలేదన్నారు. సెక్రటరీని అజెండా తయారీ విషయమై వివరణ కోరగా అధికారులు స్పందించలేదని, మూడు అంశాలు మాత్రమే ఉన్నాయంటున్నారని, అందువల్లే అజెండా సిద్ధం కాలేదన్నారని చెబుతున్నారన్నారు.ç పది రోజుల క్రితం అజెండా తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసినా ఏమాత్రం «అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నగరాభివృద్ధిని కాంక్షించే అధికారులు ఎప్పటికప్పుడు నగరానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించాల్సిన అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో దాని పర్యవసానం పాలకవర్గంపై పడుతుందన్నారు. నగర ప్రజలకు కావాల్సిన వసతులను గుర్తించే విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా తయారైందన్నారు. నగరంలో ఉన్న 50 డివిజన్‌లలో ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పాలకవర్గం దృష్టికి అజెండా రూపంలో తీసుకు రావాల్సి ఉండగా ఆ విధమైన పరిస్థితి లేకపోవడం వల్లే సమావేశం ఆలస్యమైపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల్లో నిర్లిప్త ధోరణి పెరిగిపోయిందని, మేయర్‌గా తాను ఆదేశించిన అభివృద్ధి పనుల విషయంలో చేస్తున్న జాప్యమే దీనికి నిదర్శనమన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందంటే ఏబీ నాగేశ్వర్రావు పార్కు అభివృద్ధి విషయంలో రెండేళ్లుగా నత్తనడకన పనులు సాగిస్తున్నారన్నారు. అలాగే విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం పక్కనే ఉన్న నగరపాలక సంస్థ స్థలాన్ని పౌంటెన్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినా ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. క్వారీ ఏరియా గోతుల్లో ఊట ద్వారా వస్తున్న నీటిని ప్లాంటేషన్ అభివృద్ధికి వినియోగించే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. కోటిలింగాల ఘాట్‌లో ధోబీ ఘాట్ నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నగరాభివృద్ధికి అవసరమైనంత కృషి చేసేందుకు పాలక వర్గం సిద్ధంగా ఉందన్నారు.