
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కుటుంబ కలహాల కారణంగా అనుమానాస్పదంగా దంపతులు మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరం ఆనంద్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. అయితే సంఘటనా స్థలంలో ఆధారాలను బట్టి భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేటకు చెందిన శ్రీధర్ (28)కు ప్రత్తిపాడుకు చెందిన దేవి (22)కి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. తాపీ పనిచేసుకునే శ్రీధర్‌కు ఏడాది కిందట ప్రమాదం జరగడంతో వేరొకరిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది.
భార్య దేవికి ఫిట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలో భార్య దేవి నెలరోజుల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను కాపురానికి తీసుకు వచ్చేందుకు శ్రీధర్ వారం కిందట అత్తారింటికి వెళ్లాడు. పిల్లలను ప్రత్తిపాడులో వదిలేసి భార్యాభర్తలిద్దరూ కలసి ఆనంద్‌నగర్‌లోని ఇంటికి శనివారం ఉదయం 10.30 గంటలకు వచ్చారు. వస్తూ శ్రీధర్ వెంట మద్యం బాటిల్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకూ తలుపు వేసి ఉండడం, ఇంటి లోపలకు వెళ్లిన వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు ఎంత తట్టినా తీయలేదు.
అనుమానం వచ్చి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి తలుపులు తీసి చూడగా భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని మూడో పట్టణ పోలీసులకు తెలిపారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దేవి మెడకు చున్నీ ఉండడం, ఆమె కిందపడిపోవడంతో ఆమెను చంపి శ్రీ«ధర్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను సీఐ వీరయ్య గౌడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment