
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలోని సింహాచల్ నగర్‌లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలివీ.. కోరుకొండ మండలం గాడాల గ్రామానికి చెందిన లక్కాకు ఏడుకొండలు (40) హార్డ్‌వేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. వ్యాపారానికి సంబంధించి కొన్ని సరకులు తీసుకురావాలని భార్య విజయలక్ష్మికి చెప్పిన ఏడుకొండలు ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం వచ్చాడు. కొద్ది గంటల తర్వాత అతడికి భార్య ఫోన్ చేసింది. పని ఇంకా పూర్తి కాలేదని చెప్పి అతడు ఫోన్ పెట్టేశాడు. 10 గంటల తర్వాత అతడి ఫోన్ స్విచాఫ్ వచ్చింది.
ఇదిలా ఉండగా సింహాచల్ నగర్ నుంచి క్వారీకి వెళ్లే రోడ్డుపై ఒక వ్యక్తి హత్యకు గురయ్యారంటూ ఆదివారం అర్ధరాత్రి దాటాక త్రీటౌన్ సీఐ మధుబాబుకు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. ఆ మృతదేహం ఏడుకొండలుదేనని గుర్తించారు. తెల్లవారుజామున అతడి భార్య విజయలక్ష్మికి సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తల, వీపుపై గాయాలుండటంతో ఏడుకొండలును ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టినట్టు పోలీసులు గుర్తించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు 24 గంటలు గడవక ముందే పట్టుకున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఓ మహిళతో ఏడుకొండలు, మరో వ్యక్తి వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారు. వీరిద్దరికీ తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఏడుకొండలు భార్య ఇచ్చిన సమాచారం మేరకు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మహిళను, ఆమె భర్తను, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
చదవండి: (Hyderabad- Sravani: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు)
Comments
Please login to add a commentAdd a comment