అడ్డంగా బుక్కైన హర్యానా అధికారులు..!
గుర్గావ్ః విజిలెన్స్ అధికారుల వలలో అవినీతి తిమింగలాలు చిక్కాయి. ఓ కాంట్రాక్టర్ కు రావాల్సిన బిల్లులను చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ముగ్గురు లంచావతారాలు అధికారుల దాడుల్లో అడ్డంగా బుక్కయ్యారు. కాంట్రాక్టర్ వద్దనుంచీ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
హర్యానాలోని రివారీలో విజిలెన్స్ బ్యూరో అధికారులకు అవినీతి చేపలు చిక్కాయి. ప్రజారోగ్య శాఖకు చెందిన ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. కోస్లీలోని పబ్లిక్ హెల్గ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్డీవో రాజ్ కుమార్, జూనియర్ ఇంజనీర్ దల్బీర్ సింగ్ బురా, సీనియర్ గుమాస్తా గుల్షన్ కుమార్ లు, స్థానిక కాంట్రాక్టర్ ఆనంద్ ప్రకాశ్ వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.. లంచావతారాలను అదుపులోకి తీసుకున్నారు. లంచం తీసుకున్న డబ్బు ఎస్డీవో నుంచి 9000, ఇంజనీర్ నుంచి 6000, క్లర్క్ నుంచి 2500 లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక అకౌంటెంట్ అనిల్ కుమార్ సహా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటిండెంట్ ఇంజనీర్లకు సైతం ఒక్కోరికీ 9 వేలు చొప్పున లంచం చెల్లించేందుకు బురా సిద్ధంగా ఉండగా.. అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్ డీఎప్పీ నరేష్ కుమార్ తెలిపారు.
కాంట్రాక్టర్ ఆనంద్.. తనకు రావాల్సిన 6 లక్షల రూపాయల బిల్లును క్లియర్ చేసేందుకు సదరు అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ప్రణాళిక ప్రకారం దాడిచేసి లంచగొండి అధికారులను అరెస్ట్ చేశారు.