ఫైన్‌ పడకుండా జిమ్మిక్కులు | Two Wheeler's Choosing New Ways To Avoid Rules Of Traffic Police | Sakshi
Sakshi News home page

ఫైన్‌ పడకుండా జిమ్మిక్కులు

Published Fri, Jun 21 2019 11:50 AM | Last Updated on Fri, Jun 21 2019 11:50 AM

Two Wheeler's Choosing New Ways To Avoid Rules Of  Traffic Police - Sakshi

నంబర్‌ప్లేట్‌ లేకుండా వెళ్తున్న వాహనదారులు

సాక్షి, మంచిర్యాల : నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్‌ పోలీసులు ఇటీవల చేపట్టిన చర్యల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ట్రాఫిక్‌నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వాహనదారులకు తెలియకుండానే పోలీసులు ఫొటోలు తీసి వాహనం నంబర్‌ ఆధారంగా ఈ–చలాన్‌ ద్వారా జరిమానా విధిస్తూ ఆన్‌లైన్‌లో నోటీసులు పంపిస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనదారులు పోలీస్‌ కెమెరాకు చిక్కకుండా వాహనాలకు నంబర్‌ ప్లేట్‌ లేకుండానే హల్‌చల్‌ చేస్తున్నారు. నంబర్‌ ప్లేట్‌ ఉన్నా వారు ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్‌ దగ్గరకు రాగానే ద్విచక్రవాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తి తమకాళ్లతో, చేతులతో నంబర్‌ప్లేట్‌ కనిపించకుండా రయ్‌మని వెళ్లిపోతున్నారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. 

పత్రాలు మార్చుకోవడంలో జాప్యం 
పాత వాహనాలు కొనుగోలు కొనుగోలు చేసినవారు పత్రాలు మార్చుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఈ–చలాన్‌ ద్వారా వాహనం ఎవరి పేరుమీద ఉంటే వారే బాధితులకు నష్టపరిహారం కట్టించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇటివల తేల్చి చెప్పింది. దీంతో యాజమాన్య హక్కులు బదలాయింపులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా... ఇబ్బందులకు గురైనట్లే. ఇంతేకాదు ఇటీవల పోలీస్‌శాఖ రహదారి నిబంధనల్లో కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఈ–చలాన్‌ విధానం అమలు చేస్తోంది. దీంతో వాహనాలు ఎవరి పేరుమీద ఉంటే వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు వాహనాల పత్రాలను మార్చుకోవడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో వారు దానికి జరిమానా విధించాల్సి వస్తుంది. వాహనాలు విక్రయించిన తరువాత కొనుగోలు చేసిన వారి పేరుమీద త్వరగా పత్రాలను మార్చేయాలి. లేదంటే ఇబ్బందులకు గురికావల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

నిర్లక్ష్యం తగదు 
హైదరాబాద్, విజయవాడ, మహారాష్ట్రలాంటి పెద్దపెద్ద నగారాల్లో సెకండ్‌ హ్యాండ్‌  వాహనాల వ్యాపారానికి పెట్టింది పేరు. ఆయా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా వాహనాలు కొనుగోలు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సుమారు 150వరకు కన్సల్టెన్సీలు ఉన్నాయి. కొందరు దొంగ వాహనాలను కొనుగోలు చేసి వాటికి పత్రాలు లేకున్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వాహనాదారుల నుంచి పత్రాలు తీసుకుంటున్నా కొనేవారి పేరుతో బదిలీ చేయడంలో తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో అసలు వాహన యజమాని ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసులకు ఇది కొంతమేర తలనొప్పిగానే మారే అవకాశం ఉందని ఓ అధికారి అనడం గమనార్హం. అసలు యజమాని ఎవరో తెలియక ఎవరి పేరుమీద వాహనం రిజిష్టర్‌ అయి ఉంటుందో వారికే ఈ–చలాన్‌ ద్వారా జరిమానా నోటీస్‌ వెళ్తుందన్నారు. అప్పుడు ఎవరూ ఏమీచేయలేరని ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం జరిమానా విధించాల్సిందేనని, లేనిపక్షంలో కఠిన చర్యలుంటాయని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

వీరిపై చర్యలేవీ? 
నంబర్‌ ప్లేట్‌ లేని వాహనదారులు, ఉన్నవారు నంబర్‌ ప్లేట్‌పై ఉన్న నంబర్‌ కనిపించకుండా కాళ్లు, చేతులు అడ్డుపెట్టి తప్పించుకొని తిరుగుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement