traffic voilation
-
ఫ్రీ లెఫ్ట్‌తో వాహనదారులకు ఊరట
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): వాహనదారులకు ఊరట లభించింది. ప్రతినిత్యం సుచిత్ర నుంచి కొంపల్లి వరకు నిత్యం ట్రాఫిక్ జామ్ కావడం, వాహనదారులు ఇబ్బందులు పడటాన్ని గుర్తించిన అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు అన్ని ప్రధాన చౌరస్తా రహదారుల వద్ద ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ సీఐ రాజు పర్యవేక్షణలో ఉన్నతాధికారుల సూచన మేరకు ఒకవైపు రహదారి పనులు జరుగుతుండగా మరోవైపు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీలో రోడ్డు వైపు వచ్చి వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే వుడ్స్ కాలనీ, రిలయన్స్ పెట్రోల్ బంక్, జయభేరి, దండమూడి ఎన్క్లేవ్, డీ–మార్ట్ సమీపంలో రోడ్లను పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫ్రీలెఫ్ట్ ఏర్పాటు చేసిన ప్రాంతాలివే... సుచిత్ర చౌరస్తాలో కుత్బుల్లాపూర్ నుంచి అటు అల్వాల్ ఇటు సికింద్రాబాద్‌కు వెళ్లేవారు ఫ్రీ లెఫ్ట్ ద్వారా మళ్లించి స్వాగత్–సురభి హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన యూటర్న్ వద్ద మళ్లీ వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీంతో సుచిత్ర చౌరస్తా వద్ద కొద్దిగా ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఈ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీడిమెట్ల గాంధీ విగ్రహం చౌరస్తాలో కూడా గ్రామం నుంచి వచ్చే వాహనాలకు ఒక దారి, అటు షాపునగర్ నుంచి సుభాష్‌నగర్ మీదుగా వచ్చే వారికి ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నర్సింగ్ క్లాత్ ఎంపోరియం సమీపంలో ఏర్పాటు చేసిన యూటర్న్ వద్ద తిరిగి సికింద్రాబాద్ వైపు వెళ్లొచ్చు. జాతీయ రహదారి–44 రోడ్డు వెడల్పులో భాగంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తుండగా అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయా కాలనీల సంక్షేమ సంఘాల విజ్ఞప్తులను పరిశీలించి రోడ్డు మార్గాలను ముందే చెప్పేస్తున్నారు. ప్రస్తుతం జీడిమెట్ల, సుచిత్ర, దూలపల్లి క్రాస్ రోడ్, కొంపల్లి ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ దృష్టి సారించి ఆయా వాహనాలను మళ్లిస్తున్నారు. వెన్ సాయి అపార్ట్మెంట్ సమీపంలో యూటర్న్ ఏర్పాటు చేయగా కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వచ్చే వాహనాలు వేగంగా రావడం మూలంగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని పలువురు వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
దేశంలో పెరిగిపోతున్న ఉల్లం‘ఘనులు’
ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు కదా అని సిగ్నల్ జంప్ చేసినా, రోడ్డు బాగుంది కదా అని పరిమితికి మించి వేగంగా నడిపారో జాగ్రత్త. మీ కోసం ఛలానా రెడీగా ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు మీరు ఉల్లంఘించడం పోలీసులు చూడకపోయినా మెషిన్లు చూస్తున్నాయి. మీ తప్పులను అట్టే పసిగట్టి ఫైన్లు విధిస్తున్నాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ట్రాఫిక్ ఫైన్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగాయి. 7.7 కోట్ల ఛలానాలు నూతన మోటారు వాహనాల చట్టం 2019 అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఛలాన్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైన్లు కడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. 2017 ఆగస్టు 1 నుంచి 2019 ఆగస్టు 1 వరకు దేశవ్యాప్తంగా 1.9 కోట్ల జరిమానాలు విధిస్తే 2019 ఆగస్టు నుంచి 2021 జులై వరకు ఈ సంఖ్య ఏకంగా 7.7 కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి తమిళనాడులో ట్రాఫిక్ ఛలాన్ల సంఖ్య 10.50 లక్షల నుంచి ఏకంగా 2.5 కోట్లకు చేరుకుంది. దాదాపు 24 రెట్లు ఎక్కువగా ఈ రాష్ట్రంలో అధికారికంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్టుగా రికార్డయ్యింది. దేశ రాజధానిలో నేషనల్ కాపిటల్ రీజియన్‌లో ఉండి ఎల్లవేళలా వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే ఢిల్లీలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనలు తక్కువగా లేవు. కిలోమీటరకు నలుగురు కానిస్టేబుళ్లు ఉండే దేశ రాజధానిలో ఛలాన్ల సంఖ్య 49.70 లక్షల నుంచి 2.2 కోట్లకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలలో రిజిస్టరయిన వాహనాల సంఖ్య కంటే ఢిల్లీలో జారీ అయిన ట్రాఫిక్ ఛలాన్ల సంఖ్యనే ఎక్కువ. ఇక్కడ సగటున ఒక్కో వాహనంపై రెండు మూడు వరకు జరిమానాలు ఉన్నాయి. మరోవైపు గుజరాత్, హర్యానలో ఈ చలాన్ల సంఖ్య తగ్గింది. కెమెరాల వల్లే గతంలో ట్రాఫిక రూల్స్ మీరిన వారికి పోలీసులే ఫైన్లు విధించడం చేసే వారు కానీ ఇప్పుడా పనిని సీసీ కెమెరాలు చేస్తున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మనుషులు చేసే పనిని అవే చేస్తున్నాయి. దీంతో ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఇలా ప్రతీ ఒక్క సంఘటన రికార్డు అవుతోందని పోలీసులు అధికారులు అంటున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి రాకముందు ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో నిర్లక్ష్యం ఉండేదని ఇప్పుడది తగ్గిందని రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఛలాన్ల పెరిగిన తీరు (ఆగస్టు నుంచి ఆగస్టు వరకు) రాష్ట్రం 2017 నుంచి 2019 2019 నుంచి 2021 తమిళనాడు 10.5 లక్షలు 2.50 కోట్లు ఢిల్లీ 49.70 లక్షలు 2.20 కోట్లు ఉత్తర్‌ప్రదేశ్ 44.30 లక్షలు 1.50 కోట్లు హర్యాన 41.60 లక్షలు 27.30 లక్షలు గుజరాత్ 27.80 లక్షలు 11.40 లక్షలు మొత్తం 1.90 కోట్లు 7.70 కోట్లు -
ఓవరైతే.. డేంజర్ !
సాక్షి, హైదరాబాద్ : అధిక భారంతో వెళ్తున్న వాహనాలు రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాహన పరిమితికి మించి లోడ్‌తో వెళ్తే ఆ వాహనాన్ని డ్రైవర్ నియంత్రించలేరని, ఈ వాహనాల వల్ల రోడ్డు ధ్వంసం కావడంతో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ధనార్జన కోసం యజమానుల దురాశ వల్ల అమాయకులు బలవుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. 1979లో రోడ్డు ప్రమాదాలపై జస్టిస్ వీఆర్ కృష్ణన్ ఆందోళన వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చి 30 ఏళ్లు దాటినా.. పరిస్థితిలో మెరుగు కాలేదని, రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. రహదారి భద్రతకు చెందిన రెండు చట్టాలను కఠినంగా అమలు చేయని పక్షంలో మరిన్ని అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని వ్యాఖ్యా నించింది. ఈ నెల 4న ఆటో ప్రమాదంలో 13 మంది వ్యవసాయ కూలీలు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాలను సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారించిన జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు. చట్టాల అమలులో ఉదాసీనత... అధిక లోడ్‌తో, సామర్థ్యం లేని వాహనాలను నియంత్రించడానికి చట్టాల్లో నిబంధనలున్నప్పటికీ అమల్లో ఉదాసీనత కనిపిస్తోందని జస్టిస్ పి.నవీన్‌రావు పేర్కొన్నారు. సీజ్ చేసిన వాహనాలను అక్కడికక్కడే విడిచి పెట్టే అధికారం ఉన్నప్పటికీ ప్రాసిక్యూషన్ చేయడం లేదన్నారు. కఠినమైన శిక్షలు లేని పక్షంలో అమాయకుల ప్రాణాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని, వాహనాన్ని వినియోగించుకునే హక్కు వ్యక్తులకు ఉందని, ఇది విస్తృత ప్రజాప్రయోజనాలకు లోబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన వాహనాల విడుదల విషయంలో దాఖలైన దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించాలన్నారు. ప్రత్యామ్నాయం ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. మార్గదర్శకాలు జారీ చేశారు. ఇవీ మార్గదర్శకాలు అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను సీజ్ చేసినప్పుడు నేరుగా హైకోర్టులో పిటిషన్ విచారణార్హం కాదు. వాహన యజమాని, డ్రైవర్లో ఎవరైనా ఇక్కడ పిటిషన్ వేయడానికి ముందే చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను వాడాలి. తెలంగాణ రాష్ట్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం సీజ్ చేసిన వాహన యజమాని ఆర్టీఏ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై కార్యదర్శి చట్ట ప్రకారం పరిశీలించి తగిన ఉత్తర్వులివ్వాలి. షరతులతో వాహనాన్ని విడుదల చేయవచ్చు. దానికి ముందు విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా వాహన కండిషన్‌ను అధ్యయనం చేయడంతోపాటు దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంటుంది. వాహనాన్ని సీజ్ చేసే ప్రక్రియను వీడియోతో చిత్రీకరించి దాన్ని రికార్డులో భాగం చేయాలి. వీడియో రికార్డింగ్ విధానాన్ని రూపొందించాలి. కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే పరిష్కారంలో ఎక్కువ జాప్యం జరుగుతోందన్నది యజమానుల ఆవేదన. దీనికి పరిష్కార మార్గంగా ఆన్లైన్ పోర్టల్‌ను తెరవాలి. ప్రస్తుతం ఉన్నదానిలో ప్రత్యేకంగా ఒక పేజీ, మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాలి. విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలి. దరఖాస్తుదారు కార్యదర్శి/ అధీకృత అధికారి వద్దకు రావాల్సిన అవసరంలేదు. నిర్దేశిత ప్రదేశాల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. తీర్పు ప్రతి అందిన 6 వారాల్లో తాత్కాలికంగా వాహనాన్ని అప్పగించడానికీ, దరఖాస్తును పరిష్కరించడానికిగాను విధానాన్ని రూపొందించాలి. ఈ దరఖాస్తును వారంలోగా పరిష్కరించాలి. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇప్పటికే విడుదలైన వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఈ కోర్టు చెప్పడం లేదు. అయితే ప్రాసిక్యూషన్ చేయడానికి, జరిమానా విధించడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కావు. ఒకవేళ యజమాని అడ్వాన్స్ సొమ్ము చెల్లించినట్లయితే తప్పు తేలి విధించే జరిమానాతో సర్దుబాటు చేయాలి. యజమాని జరిమానా చెల్లించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. చట్టప్రకారం ప్రాసిక్యూషన్ చేయడానికి అధికారులకు అవకాశం ఉంది. ళీ జరిమానా చెల్లించడానికి వాహన యజమాని చేసుకున్న దరఖాస్తును అనుమతించినట్లయితే వాహనాన్ని విడుదల చేసే ముందు దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించి ధ్రువీకరణ జారీ చేయాలి. ఈ పత్రం ఉంటేనే వాహనాన్ని అనుమతించాలి. ళీ అక్రమాలకు పాల్పడుతున్న ఇసుక లారీలను స్వాధీనం చేసుకునే విషయంలో మైనింగ్ అధికారులు కూడా రవాణా శాఖతో అనుసంధానమై తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ళీ పోలీసు, పరిశ్రమల శాఖల అధికారులకు అవకాశం ఉండేలా ప్రయాణికులు, సరకు రవాణా వాహనాలు నిబంధనల ఉల్లంఘనలు ఆన్లైన్లో కనిపించేలా ఉండాలి. యజమాని/డ్రైవర్ పదేపదే ఉల్లంఘించినట్లయితే అవి ఆన్లైన్లో కనిపిం చాలి. తర్వాత వాటిపై చర్యలు తీసుకోవాలి. -
ఫైన్ పడకుండా జిమ్మిక్కులు
సాక్షి, మంచిర్యాల : నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఇటీవల చేపట్టిన చర్యల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ట్రాఫిక్‌నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వాహనదారులకు తెలియకుండానే పోలీసులు ఫొటోలు తీసి వాహనం నంబర్ ఆధారంగా ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తూ ఆన్లైన్లో నోటీసులు పంపిస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనదారులు పోలీస్ కెమెరాకు చిక్కకుండా వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండానే హల్చల్ చేస్తున్నారు. నంబర్ ప్లేట్ ఉన్నా వారు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ దగ్గరకు రాగానే ద్విచక్రవాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తి తమకాళ్లతో, చేతులతో నంబర్‌ప్లేట్ కనిపించకుండా రయ్‌మని వెళ్లిపోతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. పత్రాలు మార్చుకోవడంలో జాప్యం పాత వాహనాలు కొనుగోలు కొనుగోలు చేసినవారు పత్రాలు మార్చుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఈ–చలాన్ ద్వారా వాహనం ఎవరి పేరుమీద ఉంటే వారే బాధితులకు నష్టపరిహారం కట్టించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇటివల తేల్చి చెప్పింది. దీంతో యాజమాన్య హక్కులు బదలాయింపులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా... ఇబ్బందులకు గురైనట్లే. ఇంతేకాదు ఇటీవల పోలీస్‌శాఖ రహదారి నిబంధనల్లో కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఈ–చలాన్ విధానం అమలు చేస్తోంది. దీంతో వాహనాలు ఎవరి పేరుమీద ఉంటే వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు వాహనాల పత్రాలను మార్చుకోవడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో వారు దానికి జరిమానా విధించాల్సి వస్తుంది. వాహనాలు విక్రయించిన తరువాత కొనుగోలు చేసిన వారి పేరుమీద త్వరగా పత్రాలను మార్చేయాలి. లేదంటే ఇబ్బందులకు గురికావల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం తగదు హైదరాబాద్, విజయవాడ, మహారాష్ట్రలాంటి పెద్దపెద్ద నగారాల్లో సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారానికి పెట్టింది పేరు. ఆయా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా వాహనాలు కొనుగోలు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సుమారు 150వరకు కన్సల్టెన్సీలు ఉన్నాయి. కొందరు దొంగ వాహనాలను కొనుగోలు చేసి వాటికి పత్రాలు లేకున్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వాహనాదారుల నుంచి పత్రాలు తీసుకుంటున్నా కొనేవారి పేరుతో బదిలీ చేయడంలో తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో అసలు వాహన యజమాని ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులకు ఇది కొంతమేర తలనొప్పిగానే మారే అవకాశం ఉందని ఓ అధికారి అనడం గమనార్హం. అసలు యజమాని ఎవరో తెలియక ఎవరి పేరుమీద వాహనం రిజిష్టర్ అయి ఉంటుందో వారికే ఈ–చలాన్ ద్వారా జరిమానా నోటీస్ వెళ్తుందన్నారు. అప్పుడు ఎవరూ ఏమీచేయలేరని ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానా విధించాల్సిందేనని, లేనిపక్షంలో కఠిన చర్యలుంటాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీరిపై చర్యలేవీ? నంబర్ ప్లేట్ లేని వాహనదారులు, ఉన్నవారు నంబర్ ప్లేట్‌పై ఉన్న నంబర్ కనిపించకుండా కాళ్లు, చేతులు అడ్డుపెట్టి తప్పించుకొని తిరుగుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
రవితేజ ర్యాలీకి అనుమతి తీసుకోలేదు: పోలీస్ కమిషనర్
విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెండో కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించేందుకు తమ అనుమతి తీసుకోలేదని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వర రావు చెప్పారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వాహనాలను సీసీ పుటేజ్ ల ద్వారా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆ వాహనదారులకు ఈ-చలానాలు పంపుతామని కమిషనర్ చెప్పారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విజయవాడ నగరంలో భీతావహ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రవితేజ అనుచరులు ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లు వదిలి రోడ్డు మీద రేసుల తరహాలో 30 బైకులు నడిపారు. బైకుల సెలైన్సర్లు తొలగించిన రణగొణ ధ్వనులు సృష్టించారు. ఆపకుండా హారన్లు మోగిస్తూ రాంగ్ రూట్లో కార్లు నడిపారు. దీంతో వాహనదారులకు, రోడ్డుపై వెళ్లే అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విషయాన్ని వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఈ రోజు పోలీస్ కమిషనర్ స్పందించారు. -
బొండా కుమారుడి రాంగ్ రైడ్
- ఎమ్మెల్యే కుమారుడి బర్త్‌డేకు రోడ్డుపై రేసుల్లా ర్యాలీలు - విజయవాడలో బొండా కుమారుల అనుచరుల హల్చల్ - ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లు - గతంలో కేసు నమోదైనా తీరు మారని వైనం విజయవాడ: ఓ ఎమ్మెల్యే కుమారుడి బర్త్‌డే దెబ్బకు విజయవాడ ప్రజలంతా హడలిపోయారు. రోడ్డు మీద రేసుల తరహాలో దూసుకొస్తున్న బైకులు, సెలైన్సర్లు తొలగించిన బైకుల రణగొణ ధ్వనులు, ఆగకుండా మోగుతూనే ఉన్న హారన్లు, రాంగ్ రూట్లో కార్ల హల్చల్...... దీంతో రోడ్డుపై అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెండో కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విజయవాడ నగరంలో ఈ భీతావహ పరిస్థితి నెలకొంది. రవితేజ, అతని స్నేహితులు సాయంత్రం నాలుగు గంటల నుంచి 30 బైకులు, రెండు సుమోలతో హల్చల్ చేశారు. మొగల్రాజపురం నుంచి బయలుదేరి బందరురోడ్డు, ఏలూరురోడ్డు, గాయత్రినగర్‌లలో నినాదాలు చేసుకుంటూ తిరిగారు. ఒక్కో బైక్‌పై ముగ్గురేసి యువకులు ఎక్కి వన్‌వేలను, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఖాతరుచేయకుండా దూసుకుపోయారు. బైక్‌లకు సెలైన్సర్లు తీసివేయడంతో వాహనాల సౌండ్‌కు, యువకులు చేసే నినాదాలకు ఇతర వాహనచోదకులు బెంబేలెత్తిపోయారు. వ్యాన్లకు ఇరువైపులా యువకులు వేలాడుతూ నిలబడినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. బందరురోడ్డులో వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ వారిని వారించబోగా రవితేజ అనుచరులు వాగ్వాదానికి దిగి వన్‌వేలో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని కానిస్టేబుల్ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుంచి స్పందన రాలేదు. గతంలో బొండా ఉమపెద్ద కుమారుడు సిద్ధార్థ గుంటూరు జిల్లాలో నిర్వహించిన కారు రేసు సందర్భంగా ఓ యువకుడు మృతి చెందిన విషయం విదితమే.